నర్సంపేట నియోజకవర్గంలోని దుగ్గొండి మండలంలో మిత్ర బృందంతో ఓ వాట్సప్ గ్రూప్ ఉంది. అందులో ఇటీవల వర్తమాన రాజకీయాలపై జోరుగా చర్చ సాగుతోంది. ప్రస్తుత ఎన్నికల్లో గెలిచే అభ్యర్థుల గెలుపోటములపై జరిగిన చర్చ ఇటీవల తీవ్ర స్థాయికి చేరింది. ఫలానా పార్టీ అభ్యర్థి గెలుస్తాడంటే.. కాదు వేరే పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తాడని మిత్రుల మధ్య మెస్సేజ్ వార్ నడిచింది. చివరికి అది పందెం కాసే వరకు వెళ్లింది. ఇలాంటి ఘటనలు జిల్లాలోని ప్రతి గ్రామంలో అనేకం చోటుచేసు కుంటున్నాయి.
నర్సంపేట: ఎన్నికల వేళ ఏ వాట్సప్ గ్రూప్ చూసినా.. ఏ పట్టణం చూసినా ఎవరు గెలుస్తారు.. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనేదే ప్రధాన చర్చ. మా పార్టీ నాయకుడు గెలుస్తాడంటే మా వాడే గెలుస్తాడని మరొకరు చర్చించుకోవడం పరిపాటిగా మారింది. కాని ఇప్పుడు ఈ చర్చ బెట్టింగ్‌ల స్థాయికి చేరుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా అభ్యర్థుల గెలుపుఓటములపై పందేలు జోరుగా సాగుతున్నాయి. గెలుపోటములతోపాటు మెజారిటీ ఫిగర్స్ మీద చర్చ సాగుతోంది. వరంగల్ రూరల్ జిల్లాలో కొందరు కార్యకర్తలు తమ పార్టీ నాయకుడి కోసం ప్రచారం చేసుకుంటూనే.. మరోవైపు ఎన్నికలను జూదంగా మారుస్తున్నారు. కొందరు వీటిని సరదాగా కాస్తే, మరికొందరు డబ్బే ధ్యేయంగా పందేలు కాస్తున్నారు. పార్టీపై ఉన్న మోజుతో మరికొందరు బెట్టింగ్ చేస్తున్నారు. దీంతో అంతిమంగా వారందరూ ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి నెలకొంది. క్రికెట్‌తో మొదలైన బెట్టింగ్ ఇప్పుడు అన్ని రంగాల్లోకి చాపకింద నీరులా విస్తరిస్తోంది.
పందేలు ఇలా..
సాధారణంగా క్రికెట్‌లో ఎవరు టాస్ గెలుస్తారు నుంచి ఏ బాల్‌కు సిక్స్, ఫోర్ కొడుతారులాంటి పలు అంశాలపై బెట్టింగ్ కాస్తారు. ఎన్నికల సమయంలో అనేక రకాలైన అంశాలపై రూ.వేల నుంచి లక్షల్లో బెట్టింగ్ పెడుతున్నారు. అసెంబ్లీ రద్దు చేయకముందు కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేస్తాడా..? లేదా..? అన్న అంశం నుంచి మొదలుకొని, సిట్టింగ్‌లకు సీట్లపై, తర్వాత మహాకూటమిలో ఎన్ని పార్టీలు ఉంటాయి? ఏ నాయకుడికి టికెట్ వస్తుంది? రెబల్స్‌గా ఎవరు నామినేషన్లు వేస్తారు? నామినేషన్లు ఉపసంహరణ 19 వరకు ఉండడంతో అప్పటి వరకు ఉపసంహరించుకోకుండా బరిలో ఎవరు నిలుస్తారనే అంశాలపై పందేలు కాస్తున్నారు. తమ నియోజకవర్గంలో ఫలానా నాయకుడే గెలుస్తాడు.
ఇంత మెజారిటీ వస్తుంది, రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే వాటిపై కాయ్ రాజా కాయ్ అంటూ పందేలు కాయడం గమనార్హం. నర్సంపేట, పరకాల నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థులే కాకుండా రాష్ట్రంలోని నాయకులు, పార్టీలు, వారి గెలుపోటములపై బెట్టింగ్‌లు కాయడం విశేషం. ముఖ్యంగా నర్సంపేట, పరకాల పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో కొంచెం పలుకుబడి ఉన్న ద్వితీయశ్రేణి నాయకులు, రాజకీయాలంటే ఎంతో ఆసక్తి చూపే ఉన్నత వర్గాలు, వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎక్కువగా వీటిపై ఆసక్తి చూపుతున్నారు. వీటిని పసిగట్టిన కొంతమంది బెట్టింగ్‌రాయుళ్లు రాజకీయాల మీద ఆసక్తి ఉన్నవారిని గమనించి వారిని బెట్టింగ్ ఊబిలోకి దించుతున్నారు.
లక్షల్లో బెట్టింగ్..
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎన్నికల సందడి కనిపిస్తోంది. వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఉదయం నుంచి పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని, సాయంత్రం విందుల్లో తేలుతున్నారు. ఆ సమయంలో రాజకీయాల గురించి చర్చించుకుంటూ బెట్టింగ్‌లు కాస్తున్నారు. కొందరు రూ. లక్షల్లో పందెం కాస్తే, మరికొందరు ఫలితం తెలిసిన తర్వాత ఓడిపోయిన వారు పార్టీ ఇవ్వాలనే షరతులు పెట్టుకుంటున్నారు. కొందరైతే మాట మీద నమ్మకం లేక బాండ్ పేపర్ల మీద అగ్రిమెంట్‌లు రాసుకుంటున్నారు. పోలీసులు, ఇతర ప్రభుత్వ యంత్రాంగం ఎన్నికల పనుల్లో బిజీగా ఉండడంతో వీటివైపు పోలీసులు దృష్టి సారించలేకపోతున్నారు. ఇదే అదనుగా బెట్టింగ్ రాయుళ్లు విజృంభిస్తున్నారు.
బెట్టింగ్‌లపై కఠిన చర్యలు..
ఎన్నికలకు సంబంధించి బెట్టింగ్‌ల విషయం మా దృష్టికి రాలేదు. బెట్టింగ్‌లకు పాల్పడడం చట్టరీత్యా నేరమే. ఏదైనా వాట్సప్ గ్రూప్‌లో, లేదంటే ఇతర సోషల్ మీడియాలో బెట్టింగ్‌లకు పాల్పడినా, మరెవరైనా ఈ పందేలను నిర్వహించినా సమాచారం ఉన్నవారు పోలీసుల దృష్టికి తీసుకురావాలి. నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటాం. –సునీతామోహన్, ఏసీపీ, నర్సంపేట
Comments
Please login to add a commentAdd a comment