న్యూఢిల్లీ: ఆన్‌లైన్ గేమింగ్ రంగ నియంత్రణకు సంబంధించి కేంద్రం గురువారం నిబంధనలను ప్రకటించింది. సిసలైన డబ్బులు పెట్టి ఆడేవి, బెట్టింగ్ చేసే గేమ్‌లను నిషేధించింది. అలాగే, ఆన్‌లైన్ గేమింగ్ రంగం స్వీయ నియంత్రణ విధానాన్ని పాటించాలని సూచించింది. ఈ దిశగా దేశీయంగా ఉపయోగించే గేమ్‌లను ఆమోదించేందుకు తొలుత మూడు స్వీయ నియంత్రణ సంస్థలను (ఎస్‌ఆర్‌వో) నోటిఫై చేయనుంది. 2021 ఐటీ చట్టాలకు సవరణగా ఈ నిబంధనలను చేర్చారు.
సిసలైన డబ్బుతో పందేలు కాయనివి, వినియోగదారులకు హాని కలిగించే కంటెంట్ ఏదీ ఉండనివి, పిల్లలకు వ్యసనంగా మారని గేమ్స్‌కు అనుమతి ఉంటుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. ‘ఆన్‌లైన్ గేమింగ్ వృద్ధికి భారత్‌లో అపార అవకాశాలు ఉన్నాయి. అది గణనీయంగా విస్తరించేందుకు ఈ నిబంధనలు తోడ్పడగలవు‘ అని మంత్రి చెప్పారు. కొత్త నిబంధనలు నవకల్పనలకు ఊతమివ్వగలవని, ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంపొందించగలదని పరిశ్రమ వర్గాలు స్వాగతించాయి. గ్యాంబ్లింగ్ ప్లాట్‌ఫాంలను ఏరివేసి, అంతర్జాతీయంగా పరిశ్రమ పోటీపడేలా ప్రోత్సహించగలవని అభిప్రాయపడ్డాయి.
నిబంధనల్లో మరిన్ని ముఖ్య అంశాలు..
► ఆన్‌లైన్ గేమ్స్‌ను నియంత్రించే ఎస్‌ఆర్‌వోల్లో పరిశ్రమ ప్రతినిధులు, గేమర్లు, ఇతరత్రా సంబంధిత వర్గాలు ఉంటాయి. నిబంధనల ప్రకారం ఎస్‌ఆర్‌వోల్లో ఒక విద్యావేత్త, సైకాలజీ నిపుణులు, బాలల హక్కుల పరిరక్షణ కోసం పనిచేస్తున్న వ్యక్తి లేదా అధికారి ఉండాలి. నిబంధనలకు అనుగుణంగా నడుచుకోకపోతే ఎస్‌ఆర్‌వోలను డీనోటిఫై చేస్తారు.
► గేమింగ్ వ్యసనంగా మారకుండా, ఆర్థికంగా నష్టపోకుండా, మోసాల బారిన పడకుండా యూజర్లను కాపాడేందుకు తగు వ్యవస్థను ఎస్‌ఆర్‌వోలు రూపొందించాలి. ఒక గేమింగ్ సెషన్‌లో సముచిత సమయం దాటితే పదే పదే హెచ్చరిక మెసేజీలు కూడా పంపించే విధంగా అది ఉండాలి.
Comments
Please login to add a commentAdd a comment