Bhadrachalam Assembly Constituency
-
TS Election 2023: కాంగ్రెస్ కంచుకోటలో గులాబి వికసించేనా?
ఖమ్మం: 1952వ సంవత్సరంలో ఈ నియోజకవర్గం ఏర్పడింది. ఆది నుంచి కమ్యూనిస్టుల కంచుకోటగా పేరుంది. తెలుగు దేశం పార్టీ బీఆర్ఎస్ పార్టీలు ఇక్కడి నుంచి ఒక్కసారి కూడా గెలవలేదు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి అభివృద్ధికి సీఎం కేసీఆర్ చేసిన 100 కోట్ల వాగ్దానం నెరవేరలేదు. దీంతో ఇక్కడి ప్రజలు ఆ పార్టీపై వ్యతిరేకత చూపుతున్నారు. కమ్యూనిస్టుల కంచుకోటగా.. భద్రాచలం నియోజకవర్గం ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోట. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి రాముల వారి ఆలయం, పవిత్ర గోదావరి నది ఇక్కడ ప్రాధాన్యత సంతరించుకుంది. అధిక శాతం గిరిజనులు ఉన్న ప్రాంతం. గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న నియోజకవర్గంలోని అన్ని మండలాలు వరదల కారణంగా ముంపునకు గురి కావడం జరుగుతుంది. భద్రాచలం నుంచి వాజేడు వరకు వరదల సమయంలో రాకపోకలు నిలిచి పోతాయి. ఒకోసారి విద్యుత్ సరఫరా నిలిచి పోవడంతో అంధకారంలో గడపాల్సిన పరిస్థితి ఉంది. వరద ముంపు ప్రాంతాల్లో చేపట్టిన కరకట్ట పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. దీంతో గోదావరి వరదలు వచ్చినప్పుడు ఈ ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేసవి కాలంలో తునికాకు సేకరణ అటవీ ప్రాంతంలోని ప్రజలకు రెండు నెలల పాటు జీవనోపాధి కల్పిస్తుంది. భద్రాచలంలో బీడీ పరిశ్రమ ఏర్పాటు ఏళ్ల తరబడి కలగానే మిగిలింది. భద్రాచలం డివిజన్లోని చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో 25 వేల ఎకరాలకు సాగునీరు అందించే తాలిపేరు ప్రాజెక్టు ద్వారా చివరి ఆయకట్టు భూములకు సాగునీరు అందించాలని రైతులు చేస్తున్న ఆందోళన పాలకుల చెవికెక్కడం లేదని ఆవేదన చెందుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 2018 ఎన్నికల్లో గెలుపొందిన పొదెం వీరయ్య పై దళిత బంధు పంపిణీ విషయంలో కొంత అసంతృప్తి నెలకొంది. ప్రభావిత ప్రాంతం కావడంతో.. తెలంగాణా రాష్ట్రంలో పూర్తి మావోయిస్టు ప్రభావిత నియోజకవర్గం భద్రచలం. ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే ఈ నియోజకవర్గంలో మారుమూల అటవీ గ్రామాలకు మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో రహదారి, ఇతర అభివృద్ధి పనులు చేపట్టారు. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు ఆయకట్టు కింద చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో ఖరీఫ్ సీజన్లో 25 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. 45 శాతం ఎస్టీ కులాల ఓట్లు అభ్యర్థుల గెలుపు ఓటములు శాసించే స్థాయిలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భద్రాచలం పుణ్యక్షేత్రం అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం టూరిజం శాఖ ఆధ్వర్యంలో 90 కోట్ల రూపాయల వ్యయంతో పనులు చేస్తున్నారు. ఇక్కడ బీజేపీ ఉనికి అంతంత మాత్రంగానే ఉంది. ఈ సారి జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే పొదెం వీరయ్య గెలుపు ఖాయమని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
పొంగులేటికి హ్యాండిస్తూ.. తిరిగి బీఆర్ఎస్లోకి తెల్లం
-
పొంగులేటికి భారీ ఝలక్
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ఖమ్మం మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి పెద్ద ఝలకే తగిలింది. గత నెలలో ఢిల్లీలో కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ సమక్షంలో తనతో పాటే కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి ముఖ్య అనుచరుడు తెల్లం వెంకటరావు మనసు మర్చాకున్నాడు. తిరిగి బీఆర్ఎస్లోకే వెళ్తున్నట్లు అధికారికంగా ప్రకటన చేశారు. కాంగ్రెస్ సిద్ధాంతాలు నచ్చకపోవడం, అదే సమయంలో తనను నమ్ముకున్న కార్యకర్తల నమ్మకం వమ్ము చేయడం ఇష్టం లేకనే తిరిగి బీఆర్ఎస్ వెళ్తున్నట్లు ఓ వీడియో సందేశం ద్వారా తెలిపారాయన. భద్రాచలం అభివృద్ధి కేసీఆర్ నాయకత్వంలోనే జరుగుతుందని తాను నమ్ముతున్నట్లు, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రేపు(గురువారం) ఆయన తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెల్లం వెంకటరావు మొదటి నుంచి పొంగులేటికి ముఖ్య అనుచరుడిగా ఉంటూ వచ్చారు. 2018లో టీ(బీ)ఆర్ఎస్ తరపున తెల్లం పోటీ చేసి ఓడిపోయారు(32 శాతం ఓటింగ్.. దాదాపు 36వేల ఓట్లు పోలయ్యాయి). అయితే రాబోయే ఎన్నికల్లో భద్రాచలం టికెట్ ఆశించి మరీ ఆయన పొంగులేటితో కాంగ్రెస్‌లో చేరారు. అయితే ఇక్కడే ఆయనకు ఆటంకాలు ఎదురయ్యాయి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన పొదెం వీరయ్యకే కేటాయించే అవకాశం ఉండడంతో.. వెంకటరావు నిరాశకు లోనయ్యారు. అదే సమయంలో మరోపక్క నుంచి బీఆర్ఎస్ ముఖ్యనేతలు వెంకటరావుతో మంతనాలు జరిపినట్లు సమాచారం. అయితే టికెట్ హామీ ఇస్తేనే బీఆర్ఎస్లోకి వస్తానని ఆయన కరాకండిగా చెప్పినట్లు ఆయన వర్గీయులు ప్రచారం చేస్తున్నారు. చివరకు ఏమైందో తెలియదుగానీ.. ఆయన బీఆర్ఎస్లో చేరనున్నట్లు ప్రకటన చేసేశారు. ఇదీ చదవండి: జెండా వందనంలో కొట్టుకున్న బీజేపీ నేతలు -
భద్రాచలం నియోజకవర్గంలో ఈసారి ఎవరిది పైచేయి ..?
భద్రాచలం (ఎస్టి) నియోజకవర్గం భద్రాచలం గిరిజన రిజర్వుడ్ నియోజకవర్గంలో పొడెం వీరయ్య మూడోసారి విజయం సాదించారు .గతంలో ఆయన ములుగు నియోజకవర్గంలో 1999,2004లలో కాంగ్రెస్ ఐ పక్షాన గెలవగా,ఈసారి భద్రాచలం నుంచి విజయం సాదించడం విశేషం. ములుగు సీటును మరో నేత సీతక్కకు కేటాయించి వీరయ్యకు భద్రాచలం సీటు ఇవ్వగా ఇద్దరూ గెలిచారు. వీరయ్య తన సమీప టిఆర్ ఎస్ ప్రత్యర్ది తెల్లం వెంకటరావుపై 11785 ఓట్ల ఆదిక్యతతో విజయం సాదించారు.వీరయ్యకు 47746 ఓట్లు రాగా,వెంకటరావుకు 35961 ఓట్లు వచ్చాయి. ఇక్కడ సిపిఎం పక్షాన పోటీచేసిన మాజీ ఎమ్.పి మిడియం బాబూరావుకు 12400 ఓట్లు వచ్చాయి. ఒకప్పుడు భద్రాచలం సిపిఎం కంచుకోటగా ఉండేది. కాని వివిధ పరిణామాలలో ఆ పార్టీ బలహీనపడిపోయింది. భద్రాచలంలో 2014లో సిపిఎం నేత సున్నం రాజయ్య గెలుపొందారు. 2009లో ఆయన ఓటమి చెందినా, తిరిగి 2014లో తన సమీప టిడిపి ప్రత్యర్ధి ఫణీశ్వరమ్మను 1815ఓట్ల తేడాతో ఓడిరచారు. రాజయ్య అంతకు ముందు రెండుసార్లు గెలిచారు. 2014లో తెలంగాణలో సిపిఎం పక్షాన గెలిచిన ఏకైక నేతగా కూడా ఈయన ఉన్నారు. 2018లో రాజయ్య పోటీచేయలేదు. 2009లో మిర్యాలగూడలో సిపిఎం నేత జూలకంటి రంగారెడ్డి ఒక్కరే గెలిచారు. 2014లో ఆయన ఓడిపోయారు. 2018లో సిపిఎంకు తెలంగాణ అసెంబ్లీలో ప్రాతినిద్యం లేకుండా పోయింది. భద్రాచలంలో 2014లో అప్పటి కాంగ్రెస్ సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కుంజా సత్యవతి పరా జయం చెందారు. భద్రాచలం 1952, 55 ఎన్నికల వరకు ఆంధ్రప్రాంతంలో తూర్పుగోదావరి జిల్లాలో ఉండగా, ఆ తర్వాత ఖమ్మం జిల్లాలోకి వెళ్ళింది. భద్రాచలం 52,55లలో ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది. 1952లో కెఎమ్‌పిపి గెలిస్తే, 1955లో సిపిఐ గెలిచింది. అయితే గెలిచిన వారిలో సీతారామయ్య ఎన్నిక చెల్లదని కోర్టు చెప్పడంతో జరిగిన ఉప ఎన్నికలో పి.విరావు గెలిచారు. ఈ ఉప ఎన్నికతోపాటు మొత్తం నాలుగుసార్లు కాంగ్రెస్ గెలిచింది. సిపిఎం ఎనిమిదిసార్లు గెలిచింది. ఇక్కడ టిడిపి ఒకసారి కూడా గెలవలేదు. సిపిఎం నేతలు కుంజా బొజ్జి మూడుసార్లు, ముర్ల ఎర్రయ్యరెడ్డి రెండుసార్లు, సున్నం రాజయ్య మూడుసార్లు గెలిచారు. సిపిఐ మాజీ ఎం.పి సోడే రామయ్య ఆ తర్వాత కాలంలో టిడిపిలో చేరి భద్రాచలంలో పోటీచేసినా ఓడిపోయారు. భద్రాచలం (ఎస్టి) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
భద్రాచలం నియోజకవర్గ బీఆర్ఎస్లో వీడని 'టు - లెట్'
భద్రాద్రి: దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన భద్రాచలం స్థానాన్ని కైవసం చేసుకోవాలని రాజకీయ పార్టీలు, ఇక్కడి నుంచి గెలుపొందాలని అభ్యర్థులు పోటీ పడుతుంటారు. కానీ ఈసారి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అధికార బీఆర్ఎస్ పార్టీలో ఈ రెండూ కనిపించడం లేదని ఆ పార్టీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. అక్కడ పోటాపోటీ.. రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి ఇప్పటికే రెండుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముచ్చటగా మూడోసారీ అధికార పీఠం తమదేనన్న ధీమా ఆ పార్టీ నేతలు, కేడర్‌లో తొణికిసలాడుతోంది. అందుకే రాబో యే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుపై పోటీ చేసేందుకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులు క్యూ కడుతున్నారు. సిట్టింగులుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నా.. తమకు ఏ మూలనో అవకాశం రాకపోతుందా అంటూ గత రెండేళ్లుగా తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. సిట్టింగులను మార్చాల్సిన పరిస్థితి ఎదురైతే తామున్నామంటూ గులాబీ నేతలు బారులు దీరుతున్నారు. జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు నియోజవర్గాల్లోనూ ఈ తరహా పరిస్థితే నెలకొంది. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా తమకే టికెట్ దక్కుతుందని సిట్టింగ్ ఎమ్మెల్యేలు ధీమాతో ఉన్నారు. కానీ భద్రాచలంలో మాత్రం వీటికి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. అనూహ్యంగా వీరయ్య గెలుపు ఒకప్పుడు రాష్ట్రంలోనే అతి పెద్ద అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటిగా భద్రాచలం వెలుగొందింది. రాష్ట్ర విభజన తర్వాత వరరామచంద్రాపురం, చింతూరు, కూనవరం మండలాలు ఆంధప్రదేశ్‌లో కలిశాయి. ఆ తర్వాత జిల్లాల విభజన సమయంలో ఈ నియోజకవర్గం మరోసారి విడిపోయింది. జిల్లాలో భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల మండలాలు ఉండగా, వాజేడు, వెంకటాపురం మండలాలు ములుగు జిల్లా పరిధిలోకి వెళ్లాయి. మొదటి నుంచీ ఎస్టీలకు రిజర్వ్ చేసిన ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పార్టీలకు పెట్టని కోటగా ఉంటూ వచ్చింది. అయితే రాష్ట్ర విభజనకు ముందు ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. రాష్ట్ర, జిల్లా విభజన తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పొదెం వీరయ్య గెలుపొందారు. ఆయన తన సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావుపై విజయం సాఽధించారు. పొదెం వీరయ్య గతంలో ములుగు స్థానం నుంచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. గత ఎన్నికల్లో చివరి నిమిషంలో భద్రాచలం నుంచి నామినేషన్ దాఖలు చేసి హస్తం గుర్తుపై విజయం సాధించారు. ఆయన గెలుపు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఫలించని ప్రయత్నాలు.. ప్రస్తుతం భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జ్గా బాలసాని లక్ష్మీనారాయణ ఉన్నారు. ఆయన స్వస్థలం ఇదే నియోజకవర్గంలోని వెంకటాపురం మండలం. కనీసం లక్ష్మీనారాయణ తరఫున కూడా ఇక్కడ బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న బలమైన నాయకులు లేకుండా పోయారు. ఇక్కడ పార్టీని బలోపేతం చేయడంపై సరైన దృష్టి పెట్టలేదనే ఆరోపణలు స్థానిక ఎంపీపై వస్తున్నాయి. గతంలో దశాబ్ది ఉత్సవాల సందర్భంగా భద్రాచలం నియోజకవర్గానికి సంబంధించి ఆమెకు కీలక బాధ్యతలు అప్పగిస్తే స్వీకరించడానికి నిరాకరించడం ఈ ఆరోపణలకు ఊతం ఇచ్చినట్టయ్యింది. పినపాక ఎమ్మెల్యే, విప్, జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు గడిచిన కొన్ని నెలలుగా భద్రాచలం నుంచి కారు గుర్తుపై పోటీ చేసేందుకు బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు ముంగిట్లోకి వచ్చినప్పటికీ ఆయన సానుకూల ఫలితం రాబట్టలేకపోయారనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో నెలకొంది.