ఖమ్మం: 1952వ సంవత్సరంలో ఈ నియోజకవర్గం ఏర్పడింది. ఆది నుంచి కమ్యూనిస్టుల కంచుకోటగా పేరుంది. తెలుగు దేశం పార్టీ బీఆర్ఎస్ పార్టీలు ఇక్కడి నుంచి ఒక్కసారి కూడా గెలవలేదు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి అభివృద్ధికి సీఎం కేసీఆర్ చేసిన 100 కోట్ల వాగ్దానం నెరవేరలేదు. దీంతో ఇక్కడి ప్రజలు ఆ పార్టీపై వ్యతిరేకత చూపుతున్నారు.
కమ్యూనిస్టుల కంచుకోటగా..
భద్రాచలం నియోజకవర్గం ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోట. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి రాముల వారి ఆలయం, పవిత్ర గోదావరి నది ఇక్కడ ప్రాధాన్యత సంతరించుకుంది. అధిక శాతం గిరిజనులు ఉన్న ప్రాంతం. గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న నియోజకవర్గంలోని అన్ని మండలాలు వరదల కారణంగా ముంపునకు గురి కావడం జరుగుతుంది.
భద్రాచలం నుంచి వాజేడు వరకు వరదల సమయంలో రాకపోకలు నిలిచి పోతాయి. ఒకోసారి విద్యుత్ సరఫరా నిలిచి పోవడంతో అంధకారంలో గడపాల్సిన పరిస్థితి ఉంది. వరద ముంపు ప్రాంతాల్లో చేపట్టిన కరకట్ట పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. దీంతో గోదావరి వరదలు వచ్చినప్పుడు ఈ ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేసవి కాలంలో తునికాకు సేకరణ అటవీ ప్రాంతంలోని ప్రజలకు రెండు నెలల పాటు జీవనోపాధి కల్పిస్తుంది. భద్రాచలంలో బీడీ పరిశ్రమ ఏర్పాటు ఏళ్ల తరబడి కలగానే మిగిలింది.
భద్రాచలం డివిజన్లోని చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో 25 వేల ఎకరాలకు సాగునీరు అందించే తాలిపేరు ప్రాజెక్టు ద్వారా చివరి ఆయకట్టు భూములకు సాగునీరు అందించాలని రైతులు చేస్తున్న ఆందోళన పాలకుల చెవికెక్కడం లేదని ఆవేదన చెందుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 2018 ఎన్నికల్లో గెలుపొందిన పొదెం వీరయ్య పై దళిత బంధు పంపిణీ విషయంలో కొంత అసంతృప్తి నెలకొంది.
ప్రభావిత ప్రాంతం కావడంతో..
తెలంగాణా రాష్ట్రంలో పూర్తి మావోయిస్టు ప్రభావిత నియోజకవర్గం భద్రచలం. ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే ఈ నియోజకవర్గంలో మారుమూల అటవీ గ్రామాలకు మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో రహదారి, ఇతర అభివృద్ధి పనులు చేపట్టారు. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు ఆయకట్టు కింద చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో ఖరీఫ్ సీజన్లో 25 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది.
45 శాతం ఎస్టీ కులాల ఓట్లు అభ్యర్థుల గెలుపు ఓటములు శాసించే స్థాయిలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భద్రాచలం పుణ్యక్షేత్రం అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం టూరిజం శాఖ ఆధ్వర్యంలో 90 కోట్ల రూపాయల వ్యయంతో పనులు చేస్తున్నారు. ఇక్కడ బీజేపీ ఉనికి అంతంత మాత్రంగానే ఉంది. ఈ సారి జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే పొదెం వీరయ్య గెలుపు ఖాయమని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment