భద్రాద్రి: దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన భద్రాచలం స్థానాన్ని కైవసం చేసుకోవాలని రాజకీయ పార్టీలు, ఇక్కడి నుంచి గెలుపొందాలని అభ్యర్థులు పోటీ పడుతుంటారు. కానీ ఈసారి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అధికార బీఆర్‌ఎస్ పార్టీలో ఈ రెండూ కనిపించడం లేదని ఆ పార్టీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.
అక్కడ పోటాపోటీ..
రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి ఇప్పటికే రెండుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముచ్చటగా మూడోసారీ అధికార పీఠం తమదేనన్న ధీమా ఆ పార్టీ నేతలు, కేడర్‌లో తొణికిసలాడుతోంది. అందుకే రాబో యే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుపై పోటీ చేసేందుకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులు క్యూ కడుతున్నారు.
సిట్టింగులుగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నా.. తమకు ఏ మూలనో అవకాశం రాకపోతుందా అంటూ గత రెండేళ్లుగా తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. సిట్టింగులను మార్చాల్సిన పరిస్థితి ఎదురైతే తామున్నామంటూ గులాబీ నేతలు బారులు దీరుతున్నారు. జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు నియోజవర్గాల్లోనూ ఈ తరహా పరిస్థితే నెలకొంది. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా తమకే టికెట్ దక్కుతుందని సిట్టింగ్ ఎమ్మెల్యేలు ధీమాతో ఉన్నారు. కానీ భద్రాచలంలో మాత్రం వీటికి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి.
అనూహ్యంగా వీరయ్య గెలుపు
ఒకప్పుడు రాష్ట్రంలోనే అతి పెద్ద అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటిగా భద్రాచలం వెలుగొందింది. రాష్ట్ర విభజన తర్వాత వరరామచంద్రాపురం, చింతూరు, కూనవరం మండలాలు ఆంధప్రదేశ్‌లో కలిశాయి. ఆ తర్వాత జిల్లాల విభజన సమయంలో ఈ నియోజకవర్గం మరోసారి విడిపోయింది.
జిల్లాలో భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల మండలాలు ఉండగా, వాజేడు, వెంకటాపురం మండలాలు ములుగు జిల్లా పరిధిలోకి వెళ్లాయి. మొదటి నుంచీ ఎస్టీలకు రిజర్వ్ చేసిన ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పార్టీలకు పెట్టని కోటగా ఉంటూ వచ్చింది. అయితే రాష్ట్ర విభజనకు ముందు ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. రాష్ట్ర, జిల్లా విభజన తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పొదెం వీరయ్య గెలుపొందారు.
ఆయన తన సమీప ప్రత్యర్థి, బీఆర్‌ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావుపై విజయం సాఽధించారు. పొదెం వీరయ్య గతంలో ములుగు స్థానం నుంచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. గత ఎన్నికల్లో చివరి నిమిషంలో భద్రాచలం నుంచి నామినేషన్ దాఖలు చేసి హస్తం గుర్తుపై విజయం సాధించారు. ఆయన గెలుపు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.
ఫలించని ప్రయత్నాలు..
ప్రస్తుతం భద్రాచలం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా బాలసాని లక్ష్మీనారాయణ ఉన్నారు. ఆయన స్వస్థలం ఇదే నియోజకవర్గంలోని వెంకటాపురం మండలం. కనీసం లక్ష్మీనారాయణ తరఫున కూడా ఇక్కడ బీఆర్‌ఎస్ టికెట్ ఆశిస్తున్న బలమైన నాయకులు లేకుండా పోయారు.
ఇక్కడ పార్టీని బలోపేతం చేయడంపై సరైన దృష్టి పెట్టలేదనే ఆరోపణలు స్థానిక ఎంపీపై వస్తున్నాయి. గతంలో దశాబ్ది ఉత్సవాల సందర్భంగా భద్రాచలం నియోజకవర్గానికి సంబంధించి ఆమెకు కీలక బాధ్యతలు అప్పగిస్తే స్వీకరించడానికి నిరాకరించడం ఈ ఆరోపణలకు ఊతం ఇచ్చినట్టయ్యింది.
పినపాక ఎమ్మెల్యే, విప్, జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు గడిచిన కొన్ని నెలలుగా భద్రాచలం నుంచి కారు గుర్తుపై పోటీ చేసేందుకు బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు ముంగిట్లోకి వచ్చినప్పటికీ ఆయన సానుకూల ఫలితం రాబట్టలేకపోయారనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment