bhagyanagar Colony
-
Kukatpally: బ్యూటీ పార్లర్, స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం
సాక్షి, హైదరాబాద్: బ్యూటీ పార్లర్, స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ఇంటిపై కూకట్పల్లి ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. ఈ సంఘటన కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన వెంకట నరసింహారాజు (31) సూరారంలోని చిత్తారమ్మ దేవాలయం సమీపంలో నివాసం ఉటున్నాడు. కూకట్పల్లి భాగ్యనగర్ కాలనీలోని లావిష్ బ్యూటీ పార్లర్, వెల్నెస్ స్పా నిర్వహిస్తున్నాడు. స్పా సెంటర్ ముసుగులో విటులను రప్పించి వాట్సప్‌లో యువతుల ఫొటోలు పంపుతూ విటులకు ఎరవేసి వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. సమాచారం అందుకున్న ఎస్ఓటీ, కూకట్పల్లి పోలీసులు ఇంటిపై దాడి చేసి నిర్వాహకుడితో పాటు నలుగురు విటులను అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంట్లో నుంచి వెళ్లిన మహిళ అదృశ్యం.. ఫోన్ చేయగా
సాక్షి, హైదరాబాద్(భాగ్యనగర్‌కాలనీ): ఇంట్లో నుంచి వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైన సంఘటన కూకట్పల్లి పీఎస్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. కూకట్పల్లి సంగీత్‌నగర్‌లో జీతాబాయి (23), వెంకటేష్ నాయక్‌లు నివాసముంటున్నారు. ఈ నెల 16న ఉదయం వెంకటేష్ నాయక్ పని నిమిత్తం బయటకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూడగా భార్య జీతాబాయి కనిపించలేదు. దీంతో అత్తమామలకు ఫోన్ చేసి ఆరాతీయగా తమవద్దకు రాలేదని సమాధానం చెప్పారు. జీతాబాయికు ఫోన్ చేయగా స్విచ్చాఫ్‌లో ఉంది. దీంతో ఆమె కోసం ఎంత వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసుల కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (ఒకే కాలేజీ ఫేస్బుక్లో దగ్గరై సహజీవనం.. పవిత్రకు నిజం తెలిసి..) -
తెల్లవారితే వివాహ నిశ్చితార్థం.. అంతలోనే మృత్యుముఖం
సాక్షి, భాగ్యనగర్‌కాలనీ: తెల్లవారితే ఆ యువతికి పెళ్లి నిశ్చితార్థం.. అంతలోనే ఆమెను రెయిలింగ్ రూపంలో మృత్యువు కబళించింది. మూడంతస్తుల భవనంపై నుంచి రెయిలింగ్ కూలి కింద కూర్చున్న యువతిపై పడటంతో అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. తమ గారాలపట్టి వివాహ నిశ్చితార్థ ఏర్పాటులో ఆనందంగా ఉన్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా తీరని విషాదం నెలకొంది. ఈ దుర్ఘటన కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకోగా.. బుధవారం వెలుగులోకి వచ్చింది. కూకట్పల్లి ఎస్ఐ సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కారంకోట గ్రామానికి చెందిన జట్టూరి శేఖర్, సత్తెమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. పెద్ద కూతురు రోజా బీటెక్ పూర్తి చేసింది. ఆమె స్నేహితురాలు మౌనికతో పాటు మరో మిత్రురాలితో కలిసి కూకట్‌పల్లిలో గది అద్దెకు తీసుకొని ఉంటోంది. శామీర్‌పేట్‌లోని ఎస్పీ అక్యూర్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. ఇటీవల అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో రోజాకు వివాహం కుదిరింది. కొత్త దుస్తుల కోసం వెళ్లగా.. బుధవారం పెళ్లి ముహూర్తం పెట్టుకునే రోజు కావటంతో మంగళవారం సాయంత్రం కూకట్పల్లి బీజేపీ కార్యాలయం రోడ్డులోని శ్రీ బాలాజీ లేడీస్ ఫ్యాషన్ డిజైనర్స్ షాపులో దుస్తుల కోసం వెళ్లింది. ఆ సమయంలో షాపు యజమాని ఇంటికి వెళ్లటంతో బయట తన స్నేహితురాలు మౌనికతో వేచి చూస్తోంది. ఒక్కసారిగా షాపు భవనం మూడో అంతస్తు నుంచి రెయిలింగ్ విరిగి రోజా తలపై బలంగా పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. సమాచారం అందుకున్న కూకట్పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకొని మృతురాలి తండ్రి శేఖర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సదరు భవనం ఓ ఎమ్మెల్యే బంధువులకు చెందింది కావటంతో కూకట్పల్లి పోలీసులు మృతురాలి వివరాలు బయటకు రాకుండా జాగ్రత్త పడినట్లు సమాచారం. -
ఆ ఏటీఎం చోరీకి విఫలయత్నం
భాగ్యనగర్ కాలనీ: గుర్తు తెలియని వ్యక్తులు ఏటీఎంను కొల్లగొట్టేందుకు విఫలయత్నం చేశారు. కూకట్పల్లి ఠాణా పరిధిలో ఈ ఘటన జరిగింది. ఆదివారం క్రైమ్ ఎస్ఐ అనిల్ తెలిపిన వివరాల ప్రకారం... జయనగర్ కాలనీ లోని యాక్సిస్ బ్యాంకు ఏటీఎం సెంటర్లోకి శనివారం రాత్రి మాస్కులు ధరించి ఉన్న దుండగులు ప్రవేశించారు. మిషిన్ ధ్వంసం చేసి నగదు ఎత్తుకెళ్లేందుకు యత్నించారు. అది తెరుచుకోకపోవడంతో అక్కడి నుంచి జారుకున్నారు. ఈ విషయం తెలిసి పోలీసులు బ్యాంక్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో పాటు క్లూస్‌టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరిం చారు. కేసు దర్యాప్తులో ఉంది. -
వీడియో తీసి ‘టార్గెట్’ ఎంపిక
భాగ్యనగర్ కాలనీ: ఇన్‌కం ట్యాక్స్ ఆఫీసర్లమంటూ వీడియో కెమెరాలు పట్టుకొని విల్లాలు, కాలనీల్లో తిరుగుతున్న దొంగలు ‘టార్గెట్’ ను గుర్తించి రాత్రిపూట పంజా విసురుతున్నారు. ఇదే విధంగా శనివారం అర్ధరాత్రి కేపీహెచ్పీ ఠాణా పరిధిలోని నిజాంపేటలోని రెండు విల్లాల్లో చోరీకి పాల్పడ్డారు. కూకట్పల్లి బాలాజీ నగర్‌లోని అపార్టుమెంట్లలో వరుస చోరీలు జరిగి 24 గంటలు కూడా గడవక ముందే దొంగలు మళ్లీ చోరీలకు పాల్పడటంతో స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సీఐ కుషాల్కర్, బాధితుల కథనం ప్రకారం.. నిజాంపేట కేటీఆర్ కాలనీలో గల బాలాజీ మెడోస్ విల్లాలోని ప్లాట్ నెం.130లో ఉండే బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగి గోపాల్ కుటుంబ సభ్యులతో కలిసి మంత్రాలయం వెళ్లారు. ఇది గమనించిన దొంగలు ఇంటి తలుపు గడియ పగులగొట్టి ఆ ఇంట్లోకి చొరబడ్డారు. బీరువాలో భద్రపర్చిన 12 తులాల బంగారు నగలతో పాటు అరకిలో వెండి, రూ. 20 వేల నగదు ఎత్తుకెళ్లారు. అదే విధంగా అఖిల విల్లాలో ఉండే రాయప్ప అనే వ్యక్తి బెంగళూరు వెళ్లగా.. దొంగలు ఆయన ఇంట్లోనూ చోరీకి పాల్పడ్డారు. బీరువా పగులగొట్టి రూ. 50 వేల నగదుతో పాటు రూ. 5 లక్షల విలువైన బంగారు నగలు అపహరించుకెళ్లారు. ఇదే కాలనీలో మరో విల్లాలోని గ్రిల్, డోర్‌ను పగులగొట్టేందుకు దొంగలు యత్నించారు. అయితే, ఆ విల్లా ఖాళీగా ఉండటంతో వెనుదిరిగారు. చోరీ జరిగిన విల్లాలను పరిశీలించిన పోలీసులు.. క్లూస్‌టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. కేసు దర్యాప్తులో ఉంది. రెండు రోజులుగా రెక్కీ... ఈ చోరీ ముఠా రెండు రోజులుగా కాలనీలు, విల్లాలల్లో రెక్కీ నిర్వహించినట్టు పోలీసులు గుర్తించారు. ఆరుగురు సభ్యుల ఈ ముఠా ఇన్‌కం ట్యాక్స్ ఆఫీసర్లమంటూ కాలనీలలో తిరుగుతూ వీడియో తీసినట్టు కాలనీలు, విల్లాల్లోని సీసీ టీవీ కెమెరాల ఫుటేజీల్లో రికార్డు అయిందని పోలీసులు తెలిపారు. తమను ఎవరైనా పట్టుకొనేందుకు యత్నిస్తే దాడి చేసేందుకు దొంగలు రాళ్లు వెంట పెట్టుకొని తిరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. శనివారం బాలాజీ నగర్‌లోని ఇళ్లల్లో వరుస చోరీలకు పాల్పడిన ముఠానే ఇక్కడ కూడా దొంగతనాలకు పాల్పడి ఉండవచ్చని సీఐ కుషాల్కర్ తెలిపారు. -
యువతిని వీడియో తీస్తూ చిక్కాడు
హైదరాబాద్: ఆటోలో ప్రయాణిస్తున్న యువతిని సెల్ఫోన్లో చిత్రీకరిస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడో యువకుడు. కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం ఈ ఘటన జరిగింది. ఎస్సై క్రాంతికుమార్ కథనం ప్రకారం... భాగ్యనగర్‌కాలనీకి వెళ్లేందుకు ఓ యువతి ఎల్లమ్మబండలో ఆటో ఎక్కింది. అదే ఆటో ఎక్కిన మెదక్ జిల్లాకు చెందిన వీరాస్వామి (25) తన సెల్‌ఫోన్ ద్వారా ఆమెను వీడియో తీయడం మొదలెట్టాడు. గమనించిన ఆటో డ్రైవర్ యువతికి విషయం చెప్పడంతో వీరాస్వామిని పట్టుకుని పోలీసులకు అప్పగించింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. -
10 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్
భాగ్యనగర్ కాలనీ (హైదరాబాద్) : పేకాట స్థావరంపై కూకట్పల్లి పోలీసులు మంగళవారం దాడి చేసి నిర్వాహకుడితో పాటు 10 మందిని అరెస్టు చేశారు. కూకట్పల్లి హెచ్ఎంటీ శాతవాహన నగర్‌లోని వాటర్ ట్యాంకర్ సమీపంలో కొంతమంది పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్ఐ క్రాంతి కుమార్ సిబ్బందితో ఆ స్థావరంపై దాడి చేసి నిర్వాహకుడు శ్రీనివాస్ సహా పదిమందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 9,900 నగదు, మూడు బైక్‌లు, 10 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. -
ట్రాఫిక్ వ్యవస్థ పటిష్టతకు చర్యలు
భాగ్యనగర్‌కాలనీ: ట్రాఫిక్ వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే ప్రజా రవాణా వ్యవస్థ సాఫీగా సాగుతుందని సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అన్నారు. కూకట్‌పల్లిలో రూ.16 లక్షలతో నూతనంగా నిర్మించిన సైబరాబాద్ ట్రాఫిక్ అదనపు ఉప కమిషనర్, ట్రాఫిక్ కూకట్పల్లి డివిజన్ సహాయ పోలీస్ కమిషనర్ భవనాన్ని బుధవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరైన మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు సరైన సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో గత ఏడాది నుంచి ట్రాఫిక్‌పై అనేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సైబరాబాద్ ట్రాఫిక్ విభాగంలో రెండు జోన్లుగా విభజించినట్టు చెప్పారు. ఈ భవన నిర్మాణానికి మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి రూ.6 లక్షలు విరాళం ఇవ్వగా మిగతా డబ్బును పోలీస్ వ్యవస్థ వెచ్చించిందన్నారు. మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ ట్రాఫిక్ పోలీసులకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటేనే ప్రజలకు మెరుగైన సేవలు అందిచవచ్చని తెలిపారు. కార్యక్రమంలో సైబరాబాద్ జాయింట్ కమిషనర్ వై.గంగాధర్, సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ అవినాష్ మహంతి, సైబరాబాద్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఎం.రామ్మోహన్రావు, కూకట్పల్లి ట్రాఫిక్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ పి.సంతోష్‌కుమార్, బాలానగర్ ట్రాఫిక్ ఏసీపీ శ్యాంసుందర్‌రెడ్డి, కూకట్పల్లి, బాలానగర్ ఏసీపీలు సాయిమనోహర్, నంద్యాల నర్సింహరెడ్డి పాల్గొన్నారు.