bhainsa town
-
పతంగులు ఎగరేస్తూ విద్యుత్ షాక్‌కు గురైన బాలుడు
భైంసా: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని రామ్‌నగర్ కాలనీకి చెందిన అభిలాష్ అనే బాలుడు పతంగులు ఎగరేస్తూ విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాపాయస్థితిలో కొట్టిమిట్టాడుతున్నాడు. సంక్రాంతి పండుగ కావడంతో స్నేహితులతో కలిసి గాలిపటాలు ఎగరేస్తున్న అభిలాష్.. విద్యుత్ తీగలకు గాలిపటం తట్టుకోవడంతో దాన్ని విడిపించే క్రమంలో విద్యుత్ షాక్‌కు గురై తీవ్రగాయాలపాలయ్యాడు. ఇది గమనించిన ఇరుగుపొరుగు వారు బాలుడిని సమీపంలోని ఏరియా అసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం బాలుడిని హైదరాబాద్‌కు తరలించారు. సంక్రాంతి పండుగ కావడంతో స్నేహితులతో కలిసి ఇంటి డాబాపై గాలిపటాలు ఎగరేస్తున్న అభిలాష్.. విద్యుదాఘాతానికి గురై పక్కనే ఉన్న రేకుల షెడ్డుపై పడిపోయాడు. విద్యుత్ తీగలు బాలుడికి అతుక్కుపోవడంతో తీవ్ర రక్తస్రావమై, చావుబతుల మధ్య కొట్టిమిట్టాడాడు. కరెంటు తీగలు రేకులపైనే ఉండటంతో బాలుడిని కాపాడే సాహసం ఎవ్వరూ చేయలేకపోయారు. దయనీయ పరిస్థితిలో బాలుడు రోదిస్తున్న తీరు చుట్టుపక్కల వారని కలచి వేసింది. కాగా, అభిలాష్ విద్యుత్ షాక్‌కు గురైన సమయంలో ఇంట్లో తల్లిదండ్రులు కూడా లేరు. -
భైంసా ప్రశాంతం
భైంసా/భైంసాటౌన్: నిర్మల్ జిల్లా భైంసాలో మంగళవారం ప్రశాంత వాతావరణం నెలకొంది. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్ పికెటింగ్‌లు ఏర్పాటు చేశారు. కోర్బగల్లి, ఖాజిగల్లి, గుజిరిగల్లి ప్రాంతాల్లో స్థానికులు ఇళ్లకు మూకుమ్మడిగా తాళాలు వేసి బంధువుల ఇంటికి వెళ్లిపోయారు. మంగళవారం రాత్రి సమయంలో ప్రశాంత వాతావరణం ఉందనుకున్నలోపే కుభీర్ చౌరస్తా వద్ద పార్కింగ్‌లో నిలిపి ఉన్న టాటా ఏస్ వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేశారు. పట్టణంలో 144 సెక్షన్ కొనసాగుతోంది. ఆంక్షల నేపథ్యంలో ఇతరులను అనుమతించడం లేదు. 2 రోజులుగా ప్రతిరోజు రాత్రి 7 నుంచి ఉదయం 7 వరకు కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. భైంసాకు చేరుకునే మార్గాల్లోనూ నిఘా పటిష్టం చేశారు. మరోవైపు భైంసా అల్లర్లకు కారకులైన 30 మందికి పైగా అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అల్లర్ల కారణంగా రూ.2 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. భైంసాలో చోటు చేసుకున్న పరిణామాలపై కలెక్టర్ ప్రశాంతి ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు. కాగా, మంగళవారం ఉదయం ఎన్నికల ప్రత్యేక పరిశీలకురాలు శృతి ఓజా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఇక్కడి పరిస్థితులపై ఎన్నికల కమిషన్‌కు నివేదిక పంపించారు. -
అట్టుడికిన భైంసా
నిర్మల్/భైంసా, సాక్షి, హైదరాబాద్: నిర్మల్ జిల్లా భైంసా పట్టణం సోమవారం అట్టుడికిపోయింది. 2 వర్గాల మధ్య తలెత్తిన చిన్న వివాదం రాళ్ల దాడులు, వాహనాల ధ్వంసం, గృహ దహనాలకు దారితీసింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం సాయంత్రం వరకూ ఈ దాడులు కొనసాగాయి. దీంతో పట్టణంలో భీతావహ వాతావరణం ఏర్పడింది. అగ్గిరాజేసిన వివాదం... భైంసాలోని కోర్బా గల్లీలో ఆదివారం రాత్రి ఓ వర్గానికి చెందిన యువకుడు బైక్‌పై పెద్ద శబ్దం చేస్తూ ఇష్టానుసారంగా వెళ్లడంతో స్థానికులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి వెళ్లిపోయిన అతను కాసేపటికి తన వర్గం వారిని వెంటబెట్టుకొని వచ్చి ఒక వర్గానికి చెందిన ఇళ్లు, ఆస్తులు లక్ష్యంగా రాళ్ల దాడికి పాల్పడ్డారు. పలు ఇళ్లకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ఓ ఇల్లు పూర్తిగా కాలిపోగా 15 ఇళ్లు ధ్వంసమయ్యాయి. అల్లరిమూకలు 24 ద్విచక్ర వాహనాలు, ఓ కారు, ఆటో మరికొన్ని వాహనాలపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఇళ్లలోంచి సిలిండర్లు, వస్తు సామగ్రిని రోడ్డుపై పడేసి తగులబెట్టారు. ఆదివారం రాత్రి ప్రారంభమైన దాడులు సోమవారం పట్టణమంతా విస్తరించాయి. ఒక వర్గం చేసిన దాడికి మరో వర్గం వారు ప్రతీకారంతో ప్రతి దాడులకు దిగారు. అల్లరి మూకలను కట్టడి చేసేందుకు వచ్చిన నిర్మల్ ఎస్పీ శశిధర్ రాజుతోపాటు భైంసా డీఎస్పీ నర్సింగ్‌రావు, సీఐ వేణుగోపాలరావు, ముథోల్ ఎస్సై అశోక్, ఐదుగురు కానిస్టేబుళ్లు సైతం రాళ్ల దాడిలో గాయపడ్డారు. పరిస్థితి చేయిదాటడంతో నార్త్ జోన్ ఐజీ నాగిరెడ్డి, సీఐడీ ఐజీ ప్రమోద్ కుమార్, రామగుండం పోలీసు కమిషనర్ సత్యనారాయణ, సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్, ఆదిలాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల ఎస్పీలు విష్ణు వారియర్, శ్వేతారెడ్డి, రాహుల్ హెగ్డే హుటాహుటిన భైంసా చేరుకున్నారు. ఆదిలాబాద్, కామారెడ్డి, మంచిర్యాల, సిరిసిల్ల, రామగుండం, జగిత్యాల, సిద్దిపేట జిల్లాల నుంచి పోలీసు బలగాలను రప్పించారు. సోమవారం సాయంత్రం ఆర్ఏఎఫ్ దళాలు రావడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. భైంసాలో బుధవారం వరకు 144 సెక్షన్ విధించారు. బిక్కుబిక్కుమంటూ.. కొన్నేళ్లపాటు ప్రశాంతంగా ఉన్న పట్టణం ఉద్రిక్తంగా మారడంతో భైంసావాసులు భయంభయంగా గడుపుతున్నారు. 100 మందికిపైగా మహిళలు, పిల్లలు ప్రార్థనా మందిరంలో తలదాచుకున్నారు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మంచినీళ్లు లేకుండా బిక్కుబిక్కుమంటూ గడిపారు. తమ కళ్ల ముందే ఇళ్లు, ఆస్తులు, ధ్వంసం కావడంతో పలువురు నిరాశ్రయులయ్యారు. పలువురు ఇళ్లకు తాళాలు వేసి బంధువుల ఊళ్లకు వెళ్లిపోయారు. బాధితులను ఆదుకుంటాం: కలెక్టర్ దాడులు జరిగిన ప్రాంతాల్లో ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, నిర్మల్ కలెక్టర్ ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ భాస్కర్‌రావు పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. బాధితులను ఆదుకుంటామన్నారు. డీజీపీ ఆగ్రహం! తొలి నుంచీ సున్నిత ప్రాంతమైన భైంసాలో మున్సిపల్ ఎన్నికల వేళ హింస చెలరేగడంపై డీజీపీ మహేందర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఘటన పూర్వాపరాలతో పూర్తి నివేదిక సమర్పించాలని నిర్మల్ ఎస్పీ శశిధర్ రాజును డీజీపీ ఆదేశించారని సమాచారం. భైంసా ఎన్నిక వాయిదా వేయాలి: బీజేపీ భైంసా మున్సిపాలిటీ ఎన్నికను వాయిదా వేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డికి బీజేపీ విజ్ఞప్తి చేసింది. శాంతియుత వాతావరణంలో, స్వేచ్ఛగా మరో తేదీన ఎన్నిక నిర్వహణకు చర్యలు తీసుకోవా లని కోరింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి బృందం సోమవారం నాగిరెడ్డిని కలసి వినతిపత్రం సమర్పించింది. దాడులు ఎంఐఎం పనే: కె.లక్ష్మణ్ నిర్మల్ జిల్లా భైంసాలో ఎంఐఎం గూండాలు హిందువులను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడ్డారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆరోపించారు. రాష్ట్రంలో మత కలహాలు సృష్టించేందుకు టీఆర్ఎస్, ఎంఐ ఎం కుట్రపన్నుతున్నట్లు ఘటనలు రుజువు చేస్తున్నాయన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి: ఒవైసీ బైంసా ఘటన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సీఎం కేసీఆర్, డీజీపీలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ట్వీట్ చేశారు. నిర్మల్‌లో జరిగిన తబ్లిక్ ఇజ్తేమాకు వెళ్లొస్తున్న వారిపై దాడి జరగడం అమానుషమన్నారు. -
గణేశ్ ఉత్సవాలకు 127 ఏళ్లు
భైంసా (ముథోల్): దేశంలో ఆంగ్లేయుల పాలన కొనసాగుతున్నకాలమది. స్వాతంత్రం కోసం జాతీయ నాయకులు పోరాడుతున్నారు. బాలగంగాధర్ తిలక్ సైతం అదేబాటలో నడిచాడు. అందరినీ సమైక్యంగా కలుపుకుపోవాలన్న ఆలోచనతో ముందుకు కదిలాడు. ఆ రోజుల్లో ఆంగ్లేయులు సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చేవారు కాదు. నలుగురు ఒక చోట కలుసుకునే అవకాశంలేదు. ఆ రోజుల్లో ఇళ్లలోనే గణపతి పూజలు జరిగేవి. అలాకాకుండా ఏటా గణేశ్ విగ్రహాలను ప్రతిష్టిస్తే అంతా కలిసి ఒకేచోట ఉత్సవాలు జరుపుకుంటారని అనుకుని ఆ దిశగా అడుగులు వేశాడు. 1893లో బాలగంగాధర్ తిలక్ మహారాష్ట్రలోని పుణేలో శ్రీ కస్బ గణపతిని ప్రతిష్టించి ఉత్సవాలను ప్రారంభించాడు. అప్పటి నుంచి 127 ఏళ్లుగా ఉత్సవాలు కొనసాగుతున్నాయి. కుభీర్‌కు వచ్చి... ఆ సమయంలో ముథోల్ ప్రాంతం నైజాం పరిపాలనలో ఉండేది. ముథోల్ ప్రాంతమంతా నాందేడ్ జిల్లా పరిధిలోకి వచ్చేది. బాలగంగాధర్ తిలక్ దేశమంతా పర్యటిస్తూ ఇప్పటి నిర్మల్ జిల్లాలోని ముథోల్ నియోజకవర్గ పరిధిలో గల కుభీర్‌కు చేరుకున్నారు. అప్పుడు కుభీర్‌ను పాలించే యశ్వంత్‌రావుదేశ్‌ముఖ్‌కు బాలగంగాధర్‌తిలక్ దగ్గరి బంధువు. 1905లోనే భైంసాకు వచ్చిన బాలగంగాధర్‌తిలక్ పట్టణానికి చెందిన నారాయణ్‌వాగ్‌తో సమావేశమయ్యారు. అప్పుడే కుభీర్‌లో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అప్పట్లో కుభీర్‌నుపాలించే యశ్వంత్‌రావుదేశ్‌ముఖ్ గణేశ్ ఉత్సవాలను నిర్వహించేవారు. 1950 నుంచి 40ఏళ్లపాటు కుభీర్‌కు చెందిన వైద్యనాథ్ ఉత్సవాల నిర్వాహణను చూసుకున్నారు. నేడు గ్రామస్తులు ఈ ఉత్సవాలను కొనసాగిస్తున్నారు. భైంసా పట్టణంలో 101 ఏళ్లుగా.. భైంసాలో 1919లో సార్వజనిక్ గణేశ్ మండలి ఆధ్వర్యంలో గోపాలకృష్ణ మందిరంలో మొదటిసారిగా నారాయణ వాగ్ సమక్షంలో ఉత్సవాలు ప్రారంభించారు.101 ఏళ్ళుగా గోపా లకృష్ణ మందిరంలో గణేశ్ ఉత్సవాలు ఇంకా కొనసాగుతున్నాయి. నిమజ్జనం రోజున ఇక్కడే పూజలు చేసి శోభాయాత్ర ప్రారంభిస్తారు. 1921లో హతిగణేశ్ మండలి ఉత్సవాలను ప్రారంభించింది. నేడు భైంసా పట్టణంలో 100కు పైగా మండళ్లు గణేశ్ ఉత్సవాలను జరుపుకుంటున్నాయి. అప్పట్లో అంతా కలిసి భజనలు చేస్తూ ఒకేచోట ఉత్సవాలు చేసుకునేవారు. నేడు గణేశ్ మండళ్ల సంఖ్య 100కు పైగానే చేరింది. ఫోటోలు ‘సాక్షి’కి పంపండి... నవరాత్రుల పాటు ఆ దేవదేవుడిని కొలవడానికి మీరు ఏర్పాటు చేసే అపురూపమైన మట్టి ప్రతిమల ఫోటోలను ‘సాక్షి’ పంపించండి. మీ సామాజిక కర్తవ్యాన్ని నలుగురికి తెలియజేసి అందరికీ స్పూర్తిగా నిలవండి. మీ నగరంలో, మీ ఊరిలో, మీ వీధిలో, మీ గల్లీలో, మీ ఇంట్లో ఎక్కడైనా సరే వినాయకుడి మట్టి ప్రతిమల ఫోటోలను మొబైల్ ద్వారా మాకు పంపించండి. ఫోటోతో పాటు ఎక్కడ నెలకొల్పిందీ, పేరు, ఊరు, వీధి, ఫోన్ నంబర్ వంటి పూర్తి వివరాలతో lordganapati@sakshi.comకు మెయిల్ ద్వారా పంపించండి. వాటిని మేము www.sakshi.com వెబ్సైట్లో ప్రచురిస్తాం. ఇంకెందుకు ఆలస్యం... ప్రకృతిని కాపాడుకుందాం. నలుగురికి ఆదర్శంగా నిలుద్దాం. -
అటెన్షన్
- నేడు బక్రీద్, గణేష్ నిమజ్జనోత్సవం - భైంసాలో భారీ బందోబస్తు - అడుగడుగునా పోలీసుల తనిఖీలు - ప్రత్యేక బలగాల మొహరింపు - ఏర్పాట్లపై దృష్టి సారించిన అధికారులు భైంసా/భైంసారూరల్ : భైంసా పట్టణంలో శుక్రవారం జరిగే పండుగల నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ముస్లింల బక్రీద్, హిందువులు నిర్వహించే గణేష్ నిమజ్జనోత్సవం ఒకే రోజు కావడంతో భారీగా పోలీసు బలగాలను మొహరించారు. ప్రత్యేక దృష్టి సారించి నిఘా ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ తరుణ్‌జోషి బందోబస్తు ఏర్పాట్లపై ఆదిలాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. భైంసా పట్టణ సమీపంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టుకు ఆనుకుని ఉన్న బీయాపాని గుట్టపై ఈద్గా వద్ద వేలాది మంది ముస్లింలు ప్రార్థన నిర్వహించనున్నారు. ఇప్పటికే మున్సిపల్ అధికారులు ప్రార్థనల కోసం ఏర్పాట్లను పూర్తి చేశారు. ప్రార్థన స్థలాల వద్ద పోలీసులు బాంబు, డాగ్‌స్క్వాడ్ బృందాలతో తనిఖీలు చేపట్టారు. మరోవైపు పక్కనే ఉన్న గడ్డెన్నవాగు ప్రాజెక్టులో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. భారీ బందోబస్తు... భైంసా పట్టణంలో 107 గణేష్ మండళ్ల ఆధ్వర్యంలో వినాయకులను ప్రతిష్టించారు. పట్టణంలో నిమజ్జన శోభాయాత్ర కోసం రూట్‌మ్యాప్ తయారుచేశారు. నిమజ్జన శోభాయాత్ర వెళ్లే ప్రధాన మార్గాల్లో విద్యుత్ లైన్లు సరిచేశారు. రోడ్లపైనే గుంతలు పూడ్చివేశారు. శోభాయాత్ర మార్గంతోపాటు పట్టణంలోని ప్రధాన వీధులు, సమస్యాత్మక ప్రాంతాలు, చౌక్ల వద్ద పోలీసులు ఇప్పటికే 31 సీసీ కెమెరాలు బిగించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేలా డీఎస్పీ కార్యాలయంలో కంట్రోల్‌రూం ఏర్పాటు చేశారు. ఎస్పీ తరుణ్‌జోషి ఆధ్వర్యంలో భైంసా బందోబస్తును చేపట్టనున్నారు. వజ్రా వాహనాన్ని అందుబాటులో ఉంచారు. భైంసా పట్టణాన్ని రెండు జోన్లుగా విభజించారు. తొమ్మిది సెక్టార్లుగా చేసి 12 పోలీస్ పికెటింగ్‌లు ఏర్పాటు చేశారు. భైంసా పట్టణానికి చేరుకునే అన్ని మార్గాల్లోనూ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. నాలుగు చెక్‌పోస్టులు, నాలుగు పెట్రోలింగ్ వాహనాలతో పట్టణ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. తొమ్మిది సెక్టార్లలో పది పెట్రోలింగ్ వాహనాలు తనిఖీ చేయనున్నాయి. ఏర్పాట్లలో అధికారులు.. గణేష్ నిమజ్జనోత్సవం కోసం మున్సిపల్, రెవెన్యూ, అగ్నిమాపక శాఖ, వైద్యశాఖ, ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్మల్ ఆర్డీఓ శివలింగయ్య గడ్డెన్నవాగు ప్రాజెక్టు వద్ద గురువారం సాయంత్రం ఏర్పాట్లను పర్యవేక్షించారు. గడ్డెన్నవాగు ప్రాజెక్టులో నిమజ్జనం కోసం రెండు గుంతలను 50 అడుగులలోతుగా తవ్వించారు. భారీ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు క్రేన్లు తెప్పిస్తున్నారు. భైంసా డీఎస్పీ అందె రాములు నరసింహకల్యాణ మండపంలో బందోబస్తుకు వచ్చి న పోలీసు సిబ్బందితో సమావేశమయ్యారు. నిమజ్జనోత్సవం ప్రశాంతంగా జరిగేలా కృషి చేయాలని సూచించారు. ఏర్పాట్లు పూర్తి.. నిమజ్జనోత్సవం కోసం ఏర్పాట్లు పూర్తిచేశారు. గణేష్ మండళ్లను సన్మానం చేసేందుకు హిందూవాహిని పురాణాబజార్‌లో వేదికను ఏర్పాటు చేసింది. శోభాయాత్ర మార్గాల్లో కాషాయ జెండాలు రెపరెపలాడుతున్నాయి. -
నిఘా నేత్రం
కుంటాల/భైంసా రూరల్ : భైంసా పట్టణంలో ప్రతిష్టించిన వినాయకులకు తొమ్మిది రోజులు భక్తిశ్రద్ధలతో పూజలు జరిపిన పట్టణవాసులు శనివారం నిమజ్జనం చేయనున్నారు. పట్టణ సమీపంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టులో నిమజ్జనం కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. గడ్డెన్నవాగు ప్రాజెక్టు వద్ద ప్రత్యేకంగా భారీకేడ్లను ఏర్పాటు చేశారు. ప్రత్యేక క్రెయిన్ తీసుకొచ్చి భారీ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఉత్సవాలపై నిఘా భైంసా పట్టణంలో గణేశ్ నిమజ్జనం సందర్భంగా పోలీసులు ఉత్సవాలపై ప్రత్యేక దృష్టిసారించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎనిమిది సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేక పికెటింగ్‌లు వేశారు. పెట్రోలింగ్ నిర్వహిస్తు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. శోభాయాత్ర నిర్వహించే ప్రధాన రహదారుల్లోని విద్యుత్ తీగలను, కేబుల్ తీగలతో ప్రమాదం లేకుండా జాగ్రత్త చర్యలు పాటించాలని ట్రాన్స్‌కో సిబ్బందికి ఇప్పటికే అధికారులు సూచించారు. భారీ బందోబస్తు శనివారం భైంసా పట్టణంలో నిమజ్జనోత్స వం సందర్భంగా భైంసా డీఎస్పీ గిరిధర్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డీఎస్పీ మాట్లాడుతూ ప్రజలు శాంతియుతంగా నిమజ్జనోత్సవాలను జరుపుకోవాలని పేర్కొన్నారు. ఇందుకోసం డీఎస్పీ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామాల్లోని, పట్టణంలోని బెల్టుషాపులు, మద్యం దుకాణాలు మూసివేయించారు. సమావేశాలతో.. ఇప్పటికే పట్టణంలో శాంతి, ఉత్సవ కమిటీ, గణేశ్ మండలీలు, యువజన సంఘాలవారితో పోలీసులు ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. పండుగలు శాంతియుతంగా జరుపుకోవాలని నిమజ్జనోత్సవ శోభాయాత్ర ప్రశాంతంగా కొనసాగేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని విన్నవించారు. నిమజ్జనోత్సవం సందర్భంగా ప్రత్యేక బృందాలను మండపాల వద్ద ఏర్పాటు చేసి సమాచారాన్ని తెలుకుంటూ ఉన్నత అధికారులకు చేరవేస్తున్నారు. ఏర్పాట్లలో.. నిమజ్జనోత్సవం కోసం పట్టణంలో మున్సిపల్ వైఎస్ చైర్మన్ జాబిర్‌అహ్మద్, మున్సిపల్ కమిషనర్ ప్రభాకర్‌లు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. రోడ్లపై మొరం వేసినా అధికారులు గడ్డెన్నవాగు ప్రాజెక్టు వద్ద ప్రత్యేక బారికేడ్లను కట్టారు. క్రేన్ ద్వారా ప్రాజెక్టులో విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గణేశ్ మండళ్ల సభ్యులు నిమజ్జనోత్సవ శోభాయాత్ర కోసం ట్రాక్టర్లను సిద్ధం చేసుకుంటున్నారు. మండళ్ల సభ్యులు ప్రత్యేక జనరేటర్లను తెప్పించుకున్నారు. గణేశ్ నిమజ్జనోత్సవం సందర్భంగా పట్టణానికి ఇప్పటికే ప్రత్యేక బ్యాండ్ మేళాలు చేరుకున్నాయి. భజన మండళ్ల సభ్యులు, కోలాటాలు వేసేవారు నిమజ్జనోత్సవ శోభాయాత్రకు సిద్ధమవుతున్నారు. శోభాయాత్ర భైంసా పట్టణంలో ఎప్పటిలాగే మొదట గోపాలకృష్ణ మందిరంలోని సార్వజనిక్ గణేశ్ వద్ద, గణేశ్‌నగర్‌లోని మున్నూరుకాపు సంఘ భవనంలో ప్రతిష్టించే వినాయకుని వద్ద జిల్లా ఎస్పీ గజరావు భూపాల్ పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభిస్తారు. అనంతరం పూజలు చేసి శోభాయాత్రను ప్రారంభిస్తారు. శోభయాత్ర గణేశ్నగర్మీదుగా కోర్వగల్లి, పంజేషాచౌక్ మీదుగా వస్తాయి. నిర్మల్ చౌరస్తాలో ప్రతిష్టించిన వినాయకులు బస్టాండ్ మీదుగా మున్సిపల్ కార్యాలయం నుంచి పంజేషాచౌక్ చేరుకుంటాయి. పంజేషాచౌక్ చేరుకున్న వినాయక నిమజ్జన శోభాయాత్ర కిసాన్‌గల్లి చేరుకుంటుంది. కిసాన్గల్లిలో ప్రతిష్టించిన వినాయకులను పురాణాబజార్ మీదుగా టీటీడీ కల్యాణ మండపం, కుభీర్ రోడ్డుగుండా తీసుకెళ్లి గడ్డెన్నవాగు ప్రాజెక్టులో నిమజ్జనం చేస్తారు.