నిఘా నేత్రం | all arrangements are done for ganesh immersion | Sakshi
Sakshi News home page

నిఘా నేత్రం

Published Fri, Sep 5 2014 11:38 PM | Last Updated on Sat, Sep 2 2017 12:55 PM

all arrangements are done for ganesh immersion

కుంటాల/భైంసా రూరల్ : భైంసా పట్టణంలో ప్రతిష్టించిన వినాయకులకు తొమ్మిది రోజులు భక్తిశ్రద్ధలతో పూజలు జరిపిన పట్టణవాసులు శనివారం నిమజ్జనం చేయనున్నారు. పట్టణ సమీపంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టులో నిమజ్జనం కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. గడ్డెన్నవాగు ప్రాజెక్టు వద్ద ప్రత్యేకంగా భారీకేడ్లను ఏర్పాటు చేశారు. ప్రత్యేక క్రెయిన్ తీసుకొచ్చి భారీ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.
 
ఉత్సవాలపై నిఘా
భైంసా పట్టణంలో గణేశ్ నిమజ్జనం సందర్భంగా పోలీసులు ఉత్సవాలపై ప్రత్యేక దృష్టిసారించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎనిమిది సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేక పికెటింగ్‌లు వేశారు. పెట్రోలింగ్ నిర్వహిస్తు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. శోభాయాత్ర నిర్వహించే ప్రధాన రహదారుల్లోని విద్యుత్ తీగలను, కేబుల్ తీగలతో ప్రమాదం లేకుండా జాగ్రత్త చర్యలు పాటించాలని ట్రాన్స్‌కో సిబ్బందికి ఇప్పటికే అధికారులు సూచించారు.
 
భారీ బందోబస్తు
శనివారం భైంసా పట్టణంలో నిమజ్జనోత్స వం సందర్భంగా భైంసా డీఎస్పీ గిరిధర్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డీఎస్పీ మాట్లాడుతూ ప్రజలు శాంతియుతంగా నిమజ్జనోత్సవాలను జరుపుకోవాలని పేర్కొన్నారు. ఇందుకోసం డీఎస్పీ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామాల్లోని, పట్టణంలోని బెల్టుషాపులు, మద్యం దుకాణాలు మూసివేయించారు.
 
సమావేశాలతో..
ఇప్పటికే పట్టణంలో శాంతి, ఉత్సవ కమిటీ, గణేశ్ మండలీలు, యువజన సంఘాలవారితో పోలీసులు ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. పండుగలు శాంతియుతంగా జరుపుకోవాలని నిమజ్జనోత్సవ శోభాయాత్ర ప్రశాంతంగా కొనసాగేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని విన్నవించారు.  నిమజ్జనోత్సవం సందర్భంగా ప్రత్యేక బృందాలను మండపాల వద్ద ఏర్పాటు చేసి సమాచారాన్ని తెలుకుంటూ ఉన్నత అధికారులకు చేరవేస్తున్నారు.
 
ఏర్పాట్లలో..
నిమజ్జనోత్సవం కోసం పట్టణంలో మున్సిపల్ వైఎస్ చైర్మన్ జాబిర్‌అహ్మద్, మున్సిపల్ కమిషనర్ ప్రభాకర్‌లు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. రోడ్లపై మొరం వేసినా అధికారులు గడ్డెన్నవాగు ప్రాజెక్టు వద్ద ప్రత్యేక బారికేడ్లను కట్టారు. క్రేన్ ద్వారా ప్రాజెక్టులో విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గణేశ్ మండళ్ల సభ్యులు నిమజ్జనోత్సవ శోభాయాత్ర కోసం ట్రాక్టర్లను సిద్ధం చేసుకుంటున్నారు. మండళ్ల సభ్యులు ప్రత్యేక జనరేటర్‌లను తెప్పించుకున్నారు. గణేశ్ నిమజ్జనోత్సవం సందర్భంగా పట్టణానికి ఇప్పటికే ప్రత్యేక బ్యాండ్ మేళాలు చేరుకున్నాయి. భజన మండళ్ల సభ్యులు, కోలాటాలు వేసేవారు నిమజ్జనోత్సవ శోభాయాత్రకు సిద్ధమవుతున్నారు.
 
శోభాయాత్ర
భైంసా పట్టణంలో ఎప్పటిలాగే మొదట గోపాలకృష్ణ మందిరంలోని సార్వజనిక్ గణేశ్ వద్ద, గణేశ్‌నగర్‌లోని మున్నూరుకాపు సంఘ భవనంలో ప్రతిష్టించే వినాయకుని వద్ద జిల్లా ఎస్పీ గజరావు భూపాల్ పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభిస్తారు. అనంతరం పూజలు చేసి శోభాయాత్రను ప్రారంభిస్తారు. శోభయాత్ర గణేశ్‌నగర్‌మీదుగా కోర్వగల్లి, పంజేషాచౌక్ మీదుగా వస్తాయి. నిర్మల్ చౌరస్తాలో ప్రతిష్టించిన వినాయకులు బస్టాండ్ మీదుగా మున్సిపల్ కార్యాలయం నుంచి పంజేషాచౌక్ చేరుకుంటాయి. పంజేషాచౌక్ చేరుకున్న వినాయక నిమజ్జన శోభాయాత్ర కిసాన్‌గల్లి చేరుకుంటుంది. కిసాన్‌గల్లిలో ప్రతిష్టించిన వినాయకులను పురాణాబజార్ మీదుగా టీటీడీ కల్యాణ మండపం, కుభీర్ రోడ్డుగుండా తీసుకెళ్లి గడ్డెన్నవాగు ప్రాజెక్టులో నిమజ్జనం చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement