అటెన్షన్
- నేడు బక్రీద్, గణేష్ నిమజ్జనోత్సవం
- భైంసాలో భారీ బందోబస్తు
- అడుగడుగునా పోలీసుల తనిఖీలు
- ప్రత్యేక బలగాల మొహరింపు
- ఏర్పాట్లపై దృష్టి సారించిన అధికారులు
భైంసా/భైంసారూరల్ : భైంసా పట్టణంలో శుక్రవారం జరిగే పండుగల నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ముస్లింల బక్రీద్, హిందువులు నిర్వహించే గణేష్ నిమజ్జనోత్సవం ఒకే రోజు కావడంతో భారీగా పోలీసు బలగాలను మొహరించారు. ప్రత్యేక దృష్టి సారించి నిఘా ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ తరుణ్‌జోషి బందోబస్తు ఏర్పాట్లపై ఆదిలాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. భైంసా పట్టణ సమీపంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టుకు ఆనుకుని ఉన్న బీయాపాని గుట్టపై ఈద్గా వద్ద వేలాది మంది ముస్లింలు ప్రార్థన నిర్వహించనున్నారు. ఇప్పటికే మున్సిపల్ అధికారులు ప్రార్థనల కోసం ఏర్పాట్లను పూర్తి చేశారు. ప్రార్థన స్థలాల వద్ద పోలీసులు బాంబు, డాగ్‌స్క్వాడ్ బృందాలతో తనిఖీలు చేపట్టారు. మరోవైపు పక్కనే ఉన్న గడ్డెన్నవాగు ప్రాజెక్టులో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు.
భారీ బందోబస్తు...
భైంసా పట్టణంలో 107 గణేష్ మండళ్ల ఆధ్వర్యంలో వినాయకులను ప్రతిష్టించారు. పట్టణంలో నిమజ్జన శోభాయాత్ర కోసం రూట్‌మ్యాప్ తయారుచేశారు. నిమజ్జన శోభాయాత్ర వెళ్లే ప్రధాన మార్గాల్లో విద్యుత్ లైన్‌లు సరిచేశారు. రోడ్లపైనే గుంతలు పూడ్చివేశారు. శోభాయాత్ర మార్గంతోపాటు పట్టణంలోని ప్రధాన వీధులు, సమస్యాత్మక ప్రాంతాలు, చౌక్‌ల వద్ద పోలీసులు ఇప్పటికే 31 సీసీ కెమెరాలు బిగించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేలా డీఎస్పీ కార్యాలయంలో కంట్రోల్‌రూం ఏర్పాటు చేశారు. ఎస్పీ తరుణ్‌జోషి ఆధ్వర్యంలో భైంసా బందోబస్తును చేపట్టనున్నారు. వజ్రా వాహనాన్ని అందుబాటులో ఉంచారు. భైంసా పట్టణాన్ని రెండు జోన్లుగా విభజించారు. తొమ్మిది సెక్టార్‌లుగా చేసి 12 పోలీస్ పికెటింగ్‌లు ఏర్పాటు చేశారు. భైంసా పట్టణానికి చేరుకునే అన్ని మార్గాల్లోనూ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. నాలుగు చెక్‌పోస్టులు, నాలుగు పెట్రోలింగ్ వాహనాలతో పట్టణ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. తొమ్మిది సెక్టార్లలో పది పెట్రోలింగ్ వాహనాలు తనిఖీ చేయనున్నాయి.
ఏర్పాట్లలో అధికారులు..
గణేష్ నిమజ్జనోత్సవం కోసం మున్సిపల్, రెవెన్యూ, అగ్నిమాపక శాఖ, వైద్యశాఖ, ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్మల్ ఆర్డీఓ శివలింగయ్య గడ్డెన్నవాగు ప్రాజెక్టు వద్ద గురువారం సాయంత్రం ఏర్పాట్లను పర్యవేక్షించారు. గడ్డెన్నవాగు ప్రాజెక్టులో నిమజ్జనం కోసం రెండు గుంతలను 50 అడుగులలోతుగా తవ్వించారు. భారీ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు క్రేన్లు తెప్పిస్తున్నారు. భైంసా డీఎస్పీ అందె రాములు నరసింహకల్యాణ మండపంలో బందోబస్తుకు వచ్చి న పోలీసు సిబ్బందితో సమావేశమయ్యారు. నిమజ్జనోత్సవం ప్రశాంతంగా జరిగేలా కృషి చేయాలని సూచించారు.
ఏర్పాట్లు పూర్తి..
నిమజ్జనోత్సవం కోసం ఏర్పాట్లు పూర్తిచేశారు. గణేష్ మండళ్లను సన్మానం చేసేందుకు హిందూవాహిని పురాణాబజార్‌లో వేదికను ఏర్పాటు చేసింది. శోభాయాత్ర మార్గాల్లో కాషాయ జెండాలు రెపరెపలాడుతున్నాయి.