భైంసాలో అల్లరిమూకలు తగలబెట్టిన బైక్‌లను పరిశీలిస్తున్న పోలీసులు
నిర్మల్/భైంసా, సాక్షి, హైదరాబాద్: నిర్మల్ జిల్లా భైంసా పట్టణం సోమవారం అట్టుడికిపోయింది. 2 వర్గాల మధ్య తలెత్తిన చిన్న వివాదం రాళ్ల దాడులు, వాహనాల ధ్వంసం, గృహ దహనాలకు దారితీసింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం సాయంత్రం వరకూ ఈ దాడులు కొనసాగాయి. దీంతో పట్టణంలో భీతావహ వాతావరణం ఏర్పడింది.
అగ్గిరాజేసిన వివాదం...
భైంసాలోని కోర్బా గల్లీలో ఆదివారం రాత్రి ఓ వర్గానికి చెందిన యువకుడు బైక్‌పై పెద్ద శబ్దం చేస్తూ ఇష్టానుసారంగా వెళ్లడంతో స్థానికులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి వెళ్లిపోయిన అతను కాసేపటికి తన వర్గం వారిని వెంటబెట్టుకొని వచ్చి ఒక వర్గానికి చెందిన ఇళ్లు, ఆస్తులు లక్ష్యంగా రాళ్ల దాడికి పాల్పడ్డారు. పలు ఇళ్లకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ఓ ఇల్లు పూర్తిగా కాలిపోగా 15 ఇళ్లు ధ్వంసమయ్యాయి. అల్లరిమూకలు 24 ద్విచక్ర వాహనాలు, ఓ కారు, ఆటో మరికొన్ని వాహనాలపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఇళ్లలోంచి సిలిండర్లు, వస్తు సామగ్రిని రోడ్డుపై పడేసి తగులబెట్టారు.
ఆదివారం రాత్రి ప్రారంభమైన దాడులు సోమవారం పట్టణమంతా విస్తరించాయి. ఒక వర్గం చేసిన దాడికి మరో వర్గం వారు ప్రతీకారంతో ప్రతి దాడులకు దిగారు. అల్లరి మూకలను కట్టడి చేసేందుకు వచ్చిన నిర్మల్ ఎస్పీ శశిధర్ రాజుతోపాటు భైంసా డీఎస్పీ నర్సింగ్‌రావు, సీఐ వేణుగోపాలరావు, ముథోల్ ఎస్సై అశోక్, ఐదుగురు కానిస్టేబుళ్లు సైతం రాళ్ల దాడిలో గాయపడ్డారు. పరిస్థితి చేయిదాటడంతో నార్త్ జోన్ ఐజీ నాగిరెడ్డి, సీఐడీ ఐజీ ప్రమోద్ కుమార్, రామగుండం పోలీసు కమిషనర్ సత్యనారాయణ, సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్, ఆదిలాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల ఎస్పీలు విష్ణు వారియర్, శ్వేతారెడ్డి, రాహుల్ హెగ్డే హుటాహుటిన భైంసా చేరుకున్నారు.
ఆదిలాబాద్, కామారెడ్డి, మంచిర్యాల, సిరిసిల్ల, రామగుండం, జగిత్యాల, సిద్దిపేట జిల్లాల నుంచి పోలీసు బలగాలను రప్పించారు. సోమవారం సాయంత్రం ఆర్‌ఏఎఫ్ దళాలు రావడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. భైంసాలో బుధవారం వరకు 144 సెక్షన్ విధించారు.
బిక్కుబిక్కుమంటూ..
కొన్నేళ్లపాటు ప్రశాంతంగా ఉన్న పట్టణం ఉద్రిక్తంగా మారడంతో భైంసావాసులు భయంభయంగా గడుపుతున్నారు. 100 మందికిపైగా మహిళలు, పిల్లలు ప్రార్థనా మందిరంలో తలదాచుకున్నారు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మంచినీళ్లు లేకుండా బిక్కుబిక్కుమంటూ గడిపారు. తమ కళ్ల ముందే ఇళ్లు, ఆస్తులు, ధ్వంసం కావడంతో పలువురు నిరాశ్రయులయ్యారు. పలువురు ఇళ్లకు తాళాలు వేసి బంధువుల ఊళ్లకు వెళ్లిపోయారు.
బాధితులను ఆదుకుంటాం: కలెక్టర్
దాడులు జరిగిన ప్రాంతాల్లో ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, నిర్మల్ కలెక్టర్ ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ భాస్కర్‌రావు పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. బాధితులను ఆదుకుంటామన్నారు.
డీజీపీ ఆగ్రహం!
తొలి నుంచీ సున్నిత ప్రాంతమైన భైంసాలో మున్సిపల్ ఎన్నికల వేళ హింస చెలరేగడంపై డీజీపీ మహేందర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఘటన పూర్వాపరాలతో పూర్తి నివేదిక సమర్పించాలని నిర్మల్ ఎస్పీ శశిధర్ రాజును డీజీపీ ఆదేశించారని సమాచారం.
భైంసా ఎన్నిక వాయిదా వేయాలి: బీజేపీ
భైంసా మున్సిపాలిటీ ఎన్నికను వాయిదా వేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డికి బీజేపీ విజ్ఞప్తి చేసింది. శాంతియుత వాతావరణంలో, స్వేచ్ఛగా మరో తేదీన ఎన్నిక నిర్వహణకు చర్యలు తీసుకోవా లని కోరింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి బృందం సోమవారం నాగిరెడ్డిని కలసి వినతిపత్రం సమర్పించింది.
దాడులు ఎంఐఎం పనే: కె.లక్ష్మణ్
నిర్మల్ జిల్లా భైంసాలో ఎంఐఎం గూండాలు హిందువులను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడ్డారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆరోపించారు. రాష్ట్రంలో మత కలహాలు సృష్టించేందుకు టీఆర్‌ఎస్, ఎంఐ ఎం కుట్రపన్నుతున్నట్లు ఘటనలు రుజువు చేస్తున్నాయన్నారు.
బాధ్యులపై చర్యలు తీసుకోవాలి: ఒవైసీ
బైంసా ఘటన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సీఎం కేసీఆర్, డీజీపీలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ట్వీట్ చేశారు. నిర్మల్‌లో జరిగిన తబ్లిక్ ఇజ్తేమాకు వెళ్లొస్తున్న వారిపై దాడి జరగడం అమానుషమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment