Bhanucandar
-
నంబర్ వన్ విద్యార్థి
డ్రగ్స్‌కు బానిసైన ఓ యువకుణ్ణి గురువు ఎలా దారిలో పెట్టాడనే కథతో రూపొందనున్న సినిమా ‘స్టూడెంట్ నెం.1’. కృష్ణచైతన్య, భానుచందర్, భానుప్రియ ముఖ్యతారలుగా రవికిరణ్ దర్శకత్వంలో కె.ఎల్.ఎన్. ప్రసాద్ నిర్మించనున్న ఈ సినిమా ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు కెమేరా స్విచ్చాన్ చేయగా, భానుచందర్ క్లాప్ ఇచ్చారు. దేవీప్రసాద్ గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘డ్రగ్స్ మాఫియా, మదర్ సెంటిమెంట్ నేపథ్యంలో తీస్తోన్న చిత్రమిది. ఈ నెలాఖరున చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అన్నారు రవికిరణ్. ‘‘నేను ఎన్టీఆర్ ఫ్యాన్. నా సినిమాకి ఆయన సినిమా టైటిల్ పెట్టడం హ్యాపీగా ఉంది’’ అన్నారు హీరో కృష్ణచైతన్య. నాజర్, ‘తాగుబోతు’ రమేశ్, తనికెళ్ల, అజయ్ ఘోష్ నటించనున్న ఈ చిత్రానికి మాటలు: గోపీకిరణ్, సంగీతం: తలారి శ్రీనివాస్. -
ఆ 40 రోజుల కథ!
ఏసుక్రీస్తు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘తొలికిరణం’. జాన్‌బాబు దర్శకత్వంలో పీడీ రాజు, భానుచందర్, అభినయ ముఖ్యతారలుగా సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఏసుక్రీస్తు పునరుత్థాన దశలో 40 రోజుల పాటు భక్తులతోటే ఉన్నారు. ఆ 40 రోజుల్లో క్రీస్తు ఏం చేశాడన్నదనేది కథ. ఆర్.పి.పట్నాయక్ సంగీతం అందించారు. క్రిస్మస్ సందర్భంగా విడుదల చేసిన పాటకు మంచి స్పందన లభిస్తోంది. గుడ్‌ఫ్రైడే వేళ మార్చి 25న రిలీజ్ చేయనున్నాం’’ అని తెలిపారు. -
శ్రీహరికి ఈ సినిమా అంకితం
‘‘శ్రీహరి కెరీర్లో ‘శివకేశవ్’ ఓ అద్భుతం. ఆయనే బ్రతికి ఉంటే... హీరోగా సెకండ్ ఇన్నింగ్స్‌కి బంగారు బాట వేసేదీ సినిమా. ఆ స్థాయిలో విజృంభించి నటించారు శ్రీహరి’’ అని నిర్మాత బానూరు నాగరాజు(జడ్చర్ల) అన్నారు. స్వర్గీయ శ్రీహరి, భానుచందర్ తనయుడు జయంత్ కథానాయకులుగా రూపొందిన చిత్రం ‘శివకేశవ్’. సంజన, గుర్లిన్‌చోప్రా, శ్వేతాబసు ప్రసాద్ హీరోయిన్లు. ఆర్వీ సుబ్రమణ్యం దర్శకుడు. ఈ సినిమా ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం నాగరాజు విలేకరులతో ముచ్చటించారు. అనుకున్న దానికంటే సినిమా బాగా వచ్చిందని, గత కొన్నాళ్లుగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా విడుదలకు జాప్యం జరిగిందని నాగరాజు చెప్పారు. జయంత్ నటన ఆకట్టుకుంటుందని, గుర్లిన్ చోప్రా, సంజన, శ్వేతాబసు ప్రసాద్ గ్లామర్ ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ అని ఆయన తెలిపారు. శ్రీహరికి ఈ చిత్రాన్ని అంకితమిస్తున్నామని, శ్రీను వైట్ల శిష్యుడు వెంకటేశ్ రెబ్బా దర్శకత్వంలో ‘నాక్కొంచెం టైమ్ కావాలి’ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించనున్నామని నాగరాజు తెలిపారు.