మన కుమార్తెలు స్వేచ్ఛగా, ఆనందంగా ఉండాలి
అతి ప్రాచీన కాలం నుండి జీవితంలో అన్ని విషయాలలో స్త్రీ పురుషులను సమానంగా గౌరవించింది భారతీయ సంస్కృతి. భగవంతుని దివ్వరూపాన్ని అర్థనారీశ్వరరూపంలో సృజించటం ద్వారా ఈ సృష్టిని అంతటినీ రక్షించి పోషించటంలో స్త్రీ పురుషులకు గల సమాన భాగస్వామ్యాన్ని సూచించింది. ఆరోగ్యవంతమైన, ప్రగతిశీలమైన సమాజం కోసం స్త్రీలను, సమాజంలో వారి పాత్రను గౌరవించి తీరాలి.
ఈనాడు ప్రపంచంలో స్త్రీశిశు మరణాలలో అత్యధిక సగటు భారతదేశంలో నమోదు అవుతోంది. బాలికల ఆరోగ్య సంరక్షణ విషయంలో శ్రద్ధవహించకపోవటమే దీనికి ప్రధాన కారణం. మగపిల్లలతో పోలిస్తే, ఆడపిల్లలు అనారోగ్యానికి గురైనపుడు వైద్యుని వద్దకు తీసుకువెళ్ళటానికి ఆలస్యం జరుగుతోంది.
పురిటి మరణాలు తప్పించుకున్నా, ఆడశిశువులకు రోగనిరోధక శక్తి, పోషణ మగశిశువులకంటే తక్కువగా ఉన్నట్లు అనేక గణాంకాలు తెలియజేస్తున్నాయి. పసివారిని లైంగిక అకృత్యాలకు వాడుకోవటమనే అమానుషమైన విషయాన్ని మనం ఎదుర్కొనాల్సివస్తోంది. యాభై శాతానికి పైగా స్త్రీలకు విద్యాభ్యాసం లేకపోవటం మనం ఎదుర్కొంటున్న మరో పెద్ద సవాలు. ఇవన్నీ కేవలం స్త్రీ హక్కులకు సంబంధించిన విషయాలుగానే చూడరాదు. దీనిని మానవహక్కుల విషయంగా చూడాల్సి ఉంది. మనిషి మంచివాడు కావటానికి అతడి తల్లి పెంపకమే కారణమని ఒక సామెత ఉన్నది. ఆమె విలువలను పాదుకొల్పుతుంది. పునాదుల నుండి సమాజంలో పై స్థాయిల వరకూ ఉన్న మన పిల్లలలో మానవతా విలువలు, సకారాత్మక భావనలకు బీజాలు వేయటానికి ఇదే మంచి తరుణం.
భానుమతీ నరసింహన్
(రచయిత అంతర్జాతీయ మహిళా సమ్మేళనానికి ఛైర్ పర్సన్‌గా , ఆర్ట్ ఆఫ్ లివింగ్ మహిళా, శిశు సంక్షేమ కార్యక్రమాలకు డెరైక్టర్‌గా సేవలు అందిస్తున్నారు. www.artofliving.org