బ్యాంకింగ్‌పై ఇంకా ప్రతికూలమే: మూడీస్
ముంబై: వృద్ధి అంచనాలు, అసెట్ క్వాలిటీపై ఆందోళన నేపథ్యంలో భారత బ్యాంకింగ్ రంగానికి ప్రతికూల అంచనాలను కొనసాగించాలని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ నిర్ణయించింది. ఆర్థికవృద్ధి బలహీనంగా ఉంటుం దని, ఇచ్చిన రుణాలు రాబట్టుకోవడం మరింత కష్టతరంగా మారొచ్చని, ఇందుకు కేటాయింపులు పెంచాల్సిరావడం వల్ల బ్యాంకుల లాభదాయకత క్షీణించగలదని ఈ నెగటివ్ అవుట్‌లుక్ సూచిస్తుం దని మూడీస్ పేర్కొంది. బ్యాంకింగ్ వ్యవస్థలో సుమారు 70% పైగా వాటా ఉండే ప్రభుత్వరంగ బ్యాంకులపైనే (పీఎస్బీ) ఈ నెగటివ్ అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇన్ఫ్రా రంగానికి అత్యధికంగా రుణాలిచ్చే పీఎస్‌బీల నిరర్థక ఆస్తుల పరిమాణం గణనీయంగా పెరిగిపోతుందని మూడీస్ పేర్కొంది. మరోవైపు, ప్రైవేట్‌రంగ బ్యాంకులు మెరుగైన మార్జిన్లతో పటిష్టమైన స్థానంలో ఉన్నాయని తెలిపింది. 2011 నవంబర్ నుంచి భారత బ్యాంకింగ్ రంగంపై మూడీస్ ప్రతికూల అంచనాలను కొనసాగిస్తోంది.