మోడీపై సీడీ... రగిలిన వేడి
న్యూఢిల్లీ: ఎన్నికల సమయంలో బీజేపీని ఇరుకున పెట్టేలా మూడేళ్ల నాటి ఓ సీడీని కాంగ్రెస్ గురువారం విడుదల చేసి వేడిని రగిల్చింది. బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీపై పార్టీ సీనియర్ నేత ఉమాభారతి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు అందులో ఉంది. గుజరాత్‌ను అభివృద్ధి చేశానంటున్న మోడీ మాటలు బూటకమని, ఆయనో విధ్వంసకారుడని ఉమాభారతి అందులో ఘాటుగా విమర్శించారు.
బీజేపీతో తెగతెంపుల అనంతరం భారతీయ జనశక్తి పార్టీని స్థాపించాక ఉమాభారతి 2011లో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘గుజరాత్లో హిందువులు ఇంతగా భయపడటం నేనెప్పుడూ చూడలేదు. అక్కడ భయం గూడుకట్టుకుని ఉంది. ఆయన(మోడీ) 1973 నుంచి నాకు తెలుసు. ఆయన వికాస పురుషుడు కాదు.. వినాశ పురుషుడు. మోడీ నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించాలి’ అని ఉమా అందులో పేర్కొన్నారు.