లాభాల్లో ముగిసిన మార్కెట్లు
ఎన్నో ఒడిదుడుకుల పయనం అనంతరం మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 47.79 పాయింట్ల లాభంతో 26643.24 వద్ద, నిఫ్టీ 12.75 పాయింట్ల లాభంతో 8192.25 వద్ద క్లోజ్ అయ్యాయి. కోల్ ఇండియా, బీహెచ్ఈఎల్, యాక్సిస్ బ్యాంకు, గెయిల్, ఐసీఐసీఐ బ్యాంకు టాప్ గెయినర్లుగా లాభాలు పండించగా.. భారతీ ఎయిర్టెల్, హీరో మోటోకార్ప్, టాటా మోటార్స్, టాటా స్టీల్, విప్రోలు నష్టాలు గడించాయి. ఆయిల్, గ్యాస్ షేర్లు నేటి మార్కెట్లో మంచి ప్రదర్శనను కనబరిచాయి. నిఫ్టీలో టాప్ గెయినర్‌గా నిలిచిన బీహెచ్ఈఎల్ 3 శాతం పెరిగి, రూ.126.10 వద్ద ట్రేడ్ అయింది. ఐటీ, ఆటో స్టాక్స్ మినహా మిగతా రంగాల సూచీలు నేడు లాభాల్లోనే ముగిశాయి.
ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ సేవల సంస్థలైన ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా, విప్రో చైర్మన్ అజీం ప్రేమ్ జీలు తమ సంస్థలోని ఉద్యోగులకు రాసిన లేఖలతో ఆ కంపెనీ షేర్లు గజగజలాడాయి. మార్నింగ్ ట్రేడ్‌లో 1.4 శాతం పడిపోయిన ఇన్ఫోసిస్ షేర్లు, చివరికి కొంత కోలుకుని 0.60 శాతం నష్టంతో రూ.995.05 వద్ద ముగిసింది. విప్రో సైతం 0.81 శాతం నష్టంతో క్లోజ్ అయింది. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 0.07 పైసల బలహీనపడి 68.30గా నమోదైంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధర కూడా 92 రూపాయల నష్టంలో 27,478గా ట్రేడ్ అయింది.