Bhimagani Sudhakar Goud
-
‘నంది’ బాధ్యత పెంచింది
భీమగాని సుధాకర్ గౌడ్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన బాలల చిత్రం ‘ఆదిత్య.. క్రియేటివ్ జీనియస్’. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది పురస్కారాల్లో 2014కి ఉత్తమ బాలల చిత్ర దర్శకుడిగా సుధాకర్ గౌడ్ ఎంపికయ్యారు. ‘‘సాధారణంగా బాలల చిత్రాలకు అవార్డులు ఇస్తుంటారు. కానీ, బాలల చిత్రదర్శకుడిగా నాకు పురస్కారం దక్కడం మరింత ఆనందంగా ఉంది. 19వ అంతర్జాతీయ బాలల చిత్రోత్సవాల్లో పురస్కారం గెల్చుకున్న ఏకైక చిత్రం మాదే. గతేడాది సెప్టెంబర్లో జరిగిన ఇండీవుడ్ చిత్రోత్సవంలోనూ అవార్డు వచ్చింది. నంది అవార్డు నా బాధ్యతను పెంచింది. భవిష్యత్లో మరిన్ని బాలల చిత్రాలు తీస్తా’’ అన్నారు. -
ఆదిత్య లాంటి సినిమాలు అరుదు
బాల్యంలోనే విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని పెంపొందిస్తే వాళ్లు మంచి పౌరులుగా ఎదుగుతారనే కథాంశంతో స్వీయదర్శకత్వంలో భీమగాని సుధాకర్ గౌడ్ నిర్మించిన చిత్రం ‘ఆదిత్య’. ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోన్న అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాల్లో ఈ చిత్రం ప్రదర్శనకు ఎంపికైంది. సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ - ‘‘అబ్దుల్ కలాం స్ఫూర్తితో బాలలు శాస్త్రజ్ఞులుగా ఎదగాలనీ, దేశాభివృద్ధికి వివిధ రంగాల పరిశోధనల్లో కూడా రాణించాలని చెప్పే చిత్రం ఇది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆదిత్యలాంటి ప్రతిభ గల విద్యార్థులు ఉంటారని ఈ చిత్రంలో చూపించాం. ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వినోదపు పన్ను మినహాయింపునిచ్చాయి. ఈ చిత్రాన్ని చూసిన పలువురు ఐఏయస్ ఆఫీసర్లు మంచి కథాంశం అని అభినందించారు. ఆదిత్య లాంటి సినిమాలు అరుదుగా వస్తాయి’’ అన్నారు.