Bhopal gas leak
-
Bhopal Gas Tragedy: ప్రపంచం మరువలేని విషాదమిది..
భోపాల్: 1984, డిసెంబరు 3.. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ప్రపంచం మరువలేని విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనకు నేటికి 40 ఏళ్లు.. ఇన్నేళ్లు దాటినా ఈ దుర్ఘటన ఆనవాళ్లు ఈనాటికీ వెంటాడుతూనే ఉన్నాయి.యూనియన్ కార్బైడ్ ప్లాంట్ నుంచి విషపూరిత వాయువు మిథైల్ ఐసోసైనేట్ (ఎంఐసీ) లీక్ అయిన ఘటన భారతదేశ చరిత్రలో అత్యంత ఘోరమైన పారిశ్రామిక ప్రమాదాలలో ఒకటిగా నిలిచింది. ఆ రోజు రాత్రి భోపాల్‌లోని జనం గాఢ నిద్రలో ఉండగా మృత్యువు విషవాయువు రూపంలో రెక్కలు విప్పి, లెక్కలేనంతమందిని కబళించింది. నాటి భయానక దృశ్యాలు నేటికీ చాలామంది కళ్లముందు మెదులుతుంటాయి.ఆ రోజు ఏం జరిగింది?భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ సంస్థలో నాడు పనిచేసిన ఒక అధికారి తన అనుభవాన్ని వివరిస్తూ.. ‘1984, డిసెంబర్ 3 మాకు ఎప్పటిలానే తెల్లారింది. ఉదయం 8 గంటలకు ఇంటి నుంచి బయలుదేరి, ఫ్యాక్టరీకి వెళ్లేందుకు బస్సు కోసం వేచి చూస్తున్నాను. ఆ సమయంలో ఫ్యాక్టరీ నుండి విడుదలైన విష వాయువు నగరాన్ని కమ్మేసిందని నాకు తెలియదు. మేం బస్సు కోసం ఎదురుచూస్తుండగా అక్కడున్న ఒక వ్యక్తి.. గ్యాస్ లీక్ అయ్యిందని, దాని వల్ల చాలా మంది చనిపోయారని చెప్పడంతో షాక్ అయ్యాను’ అని తెలిపారు.సీనియర్ ప్రెస్ ఫోటోగ్రాఫర్ అనుభవంలో..భోపాల్‌కు చెందిన సీనియర్ ప్రెస్ ఫోటోగ్రాఫర్ గోపాల్ జైన్ తన ఇంటికి వచ్చిన ఒక బంధువు చేతిపై హఠాత్తుగా వచ్చిన ఎర్రని వాపును చూసి షాక్ అయ్యారు. పాత భోపాల్ ప్రాంతమంతా పొగతో కమ్ముకుందని ఆ మహిళ అతనికి చెప్పింది. ఉదయం హమీదియా హాస్పిటల్ చుట్టూ మృతదేహాలు చెల్లాచెదురుగా పడటంతో అతనికి జరిగినదేమిటో అర్థం అయ్యింది. నాటి పరిస్థితిని గుర్తుచేసుకున్న జైన్ మాట్లాడుతూ ‘ఉదయం నేను ఆసుపత్రికి చేరుకున్నప్పుడు, అక్కడి పరిస్థితి భయానకంగా ఉంది. మృతదేహాలు కుప్పలుగా పడివున్నాయి. అక్కడ గుమిగూడిన జనం తమవారి కోసం వెదుకుతున్నారు. యూనియన్ కార్బైడ్ ప్లాంట్ నుండి గ్యాస్ లీక్ అయిన కారణంగా ఈ దారుణం చోటు చేసుకున్నదని తెలిసింది’ అని అన్నారు.నాటి ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ దుర్ఘటనలో 5,474 మంది ప్రాణాలు కోల్పోగా, ఐదు లక్షల మందికి పైగా జనం గ్యాస్ విషపూరిత ప్రభావాలకు గురయ్యారు. ఈ ఘటన జరిగి నాలుగు దశాబ్దాలు గడిచినా దాని నాటి గాయం ఇంకా మానలేదు. గ్యాస్ లీకేజీ కారణంగా వేలాది మంది జనం అనారోగ్యం పాలయ్యారు. నాటి విషవాయువు ప్రభావం తరతరాలుగా వెంటాడుతూనే ఉంది. ఇది కూడా చదవండి: లండన్‌లో రేడియో జాకీగా రాణిస్తున్న హైదరాబాదీ -
భోపాల్ గ్యాస్ లీకేజీపై వెబ్ సిరీస్.. ఓటీటీలో ఎప్పుడు? ఎక్కడంటే?
భోపాల్ గ్యాస్ లీక్.. ప్రపంచంలోనే అతిపెద్ద పారిశ్రామిక విపత్తు. 1984 డిసెంబర్ 2, 3 తేదీలలో మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో గల యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్(యూసీఐఎల్) ప్లాంట్‌లో గ్యాస్ లీకేజీ ప్రమాదం సంభవించింది. మిథైల్ ఐసోసైనైడ్ అనే విషపూరిత రసాయనం విడుదలవడంతో చాలామంది ఊపిరాడక చనిపోయారు, వేలమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ గ్యాస్ లీకేజీ మరో 6 లక్షల మందిపై ప్రభావం చూపించింది. ఈ విషపూరిత రసాయన ప్రభావం కొన్ని తరాల పాటు కనిపించింది. ఈ దుర్ఘటన జరిగి దాదాపు 39 ఏళ్లు కావస్తోంది. ఈ సంఘటనను ఆధారంగా చేసుకుని ఓ వెబ్ సిరీస్ రూపుదిద్దుకుంటోంది. అదే 'ద రైల్వే మెన్'. ఆర్ మాధవన్, కేకే మీనన్, దివ్యేందు, బాబిల్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ నాలుగు భాగాలుగా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సిరీస్ ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటిస్తూ వీడియో రిలీజ్ చేశారు. భోపాల్ గ్యాస్ లీక్ జరిగినప్పుడు రైల్వే ఉద్యోగులు సహృదయంతో అక్కడి వారికి సాయం చేసేందుకు వెళ్లారు. వందలమంది ప్రాణాలు కాపాడారు. దాన్ని ఈ సిరీస్‌లో చూపించబోతున్నామని డైరెక్టర్ శివ్ రావలి తెలిపాడు. ఈ థ్రిల్లర్ సిరీస్ నవంబర్ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. చదవండి: వెంకటేశ్ కూతురి నిశ్చితార్థం.. చిరంజీవి, మహేశ్ బాబు హాజరు -
‘భోపాల్ గ్యాస్’బాధితులకు స్మార్ట్ కార్డులు
భోపాల్: భారత చరిత్రలోనే భయానక విషాదంగా భావించే భోపాల్ గ్యాస్ లీకేజీ ప్రమాదం జరిగి 33 ఏళ్లు కావాస్తున్నా బాధితులకు అరకొర సాయమే అందుతోంది. విశపూరిత వాయువులు పీల్చి, ఇప్పటికీ అనారోగ్యంతో బాధపడుతోన్న 30 వేల మందికి బాధితులకు స్మార్ట్ కార్డులు మంజూరుచేశామని భోపాల్ గ్యాస్ బాధితుల పునరావాస శాఖ(మధ్యప్రదేశ్) మంత్రి విశ్వాస్ సారంగ్ శనివారం మీడియాకు చెప్పారు. బాధితుడు లేదా బాధితురాలికి ఎదుర్కొంటున్న జబ్బు, వారికి అందిస్తున్న చికిత్సా విధానం తదితర వివరాలన్నీ స్మార్ట్ కార్డులో పొందుపర్చామని మంత్రి తెలిపారు. భోపాల్ మెమోరియల్ హాస్పిటల్, పునరావాస శాఖలు సుహృద్భావంతో బాధితులను ఆదుకుంటాయని అన్నారు. భోపాల్ పట్టణంలోని ఆరు ఆసుపత్రుల్లో గ్యాస్ ప్రమాద బాధితులకు చికిత్స అందిస్తున్నామని, ఇప్పటి వరకు సుమారు రూ.11.43 కోట్ల రూపాయలను ఖర్చుచేశామని మంత్రి విశ్వాస్ తెలిపారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో పురుగుమందులు తయారుచేసే యూనియన్ కార్బైడ్ పరిశ్రమ నుంచి 1984 డిసెంబర్ 2 అర్ధరాత్రి మిథైల్ ఐసో సయనైడ్ అనే విషరసాయనం లీకైన ఘటనలో 25 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. విషవాయువును పీల్చి ఐదు లక్షల మందికిపైగా భయంకరమైన వ్యాధుల బారినపడ్డారు. ఆ బాధితులు వారి పిల్లలు కలిపి సుమారు లక్షమంది నేటికీ రకరకాల అనారోగ్యాలతో బాధపడుతున్నారు. భోపాల్ గ్యాస్ లీకేజీ బాధితుల పునరావాస శాఖ పేరుతో మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేసిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం.. బాధితుల కోసం అమలవుతోన్న కార్యక్రమాలను పర్యవేక్షిస్తోంది.