భోపాల్: 1984, డిసెంబరు 3.. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ప్రపంచం మరువలేని విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనకు నేటికి 40 ఏళ్లు.. ఇన్నేళ్లు దాటినా ఈ దుర్ఘటన ఆనవాళ్లు ఈనాటికీ వెంటాడుతూనే ఉన్నాయి.
యూనియన్ కార్బైడ్ ప్లాంట్ నుంచి విషపూరిత వాయువు మిథైల్ ఐసోసైనేట్ (ఎంఐసీ) లీక్ అయిన ఘటన భారతదేశ చరిత్రలో అత్యంత ఘోరమైన పారిశ్రామిక ప్రమాదాలలో ఒకటిగా నిలిచింది. ఆ రోజు రాత్రి భోపాల్‌లోని జనం గాఢ నిద్రలో ఉండగా మృత్యువు విషవాయువు రూపంలో రెక్కలు విప్పి, లెక్కలేనంతమందిని కబళించింది. నాటి భయానక దృశ్యాలు నేటికీ చాలామంది కళ్లముందు మెదులుతుంటాయి.
ఆ రోజు ఏం జరిగింది?
భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ సంస్థలో నాడు పనిచేసిన ఒక అధికారి తన అనుభవాన్ని వివరిస్తూ.. ‘1984, డిసెంబర్ 3 మాకు ఎప్పటిలానే తెల్లారింది. ఉదయం 8 గంటలకు ఇంటి నుంచి బయలుదేరి, ఫ్యాక్టరీకి వెళ్లేందుకు బస్సు కోసం వేచి చూస్తున్నాను. ఆ సమయంలో ఫ్యాక్టరీ నుండి విడుదలైన విష వాయువు నగరాన్ని కమ్మేసిందని నాకు తెలియదు. మేం బస్సు కోసం ఎదురుచూస్తుండగా అక్కడున్న ఒక వ్యక్తి.. గ్యాస్ లీక్ అయ్యిందని, దాని వల్ల చాలా మంది చనిపోయారని చెప్పడంతో షాక్ అయ్యాను’ అని తెలిపారు.
సీనియర్ ప్రెస్ ఫోటోగ్రాఫర్ అనుభవంలో..
భోపాల్‌కు చెందిన సీనియర్ ప్రెస్ ఫోటోగ్రాఫర్ గోపాల్ జైన్ తన ఇంటికి వచ్చిన ఒక బంధువు చేతిపై హఠాత్తుగా వచ్చిన ఎర్రని వాపును చూసి షాక్ అయ్యారు. పాత భోపాల్ ప్రాంతమంతా పొగతో కమ్ముకుందని ఆ మహిళ అతనికి చెప్పింది. ఉదయం హమీదియా హాస్పిటల్ చుట్టూ మృతదేహాలు చెల్లాచెదురుగా పడటంతో అతనికి జరిగినదేమిటో అర్థం అయ్యింది. నాటి పరిస్థితిని గుర్తుచేసుకున్న జైన్ మాట్లాడుతూ ‘ఉదయం నేను ఆసుపత్రికి చేరుకున్నప్పుడు, అక్కడి పరిస్థితి భయానకంగా ఉంది. మృతదేహాలు కుప్పలుగా పడివున్నాయి. అక్కడ గుమిగూడిన జనం తమవారి కోసం వెదుకుతున్నారు. యూనియన్ కార్బైడ్ ప్లాంట్ నుండి గ్యాస్ లీక్ అయిన కారణంగా ఈ దారుణం చోటు చేసుకున్నదని తెలిసింది’ అని అన్నారు.
నాటి ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ దుర్ఘటనలో 5,474 మంది ప్రాణాలు కోల్పోగా, ఐదు లక్షల మందికి పైగా జనం గ్యాస్ విషపూరిత ప్రభావాలకు గురయ్యారు. ఈ ఘటన జరిగి నాలుగు దశాబ్దాలు గడిచినా దాని నాటి గాయం ఇంకా మానలేదు. గ్యాస్ లీకేజీ కారణంగా వేలాది మంది జనం అనారోగ్యం పాలయ్యారు. నాటి విషవాయువు ప్రభావం తరతరాలుగా వెంటాడుతూనే ఉంది.
ఇది కూడా చదవండి: లండన్‌లో రేడియో జాకీగా రాణిస్తున్న హైదరాబాదీ
Comments
Please login to add a commentAdd a comment