భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగి నేటికి 39 ఏళ్లు. 1984, డిసెంబర్ 2,3 తేదీల మధ్య రాత్రి జరిగిన ఈ గ్యాస్ లీక్ ఘటనలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. నేటికీ మధ్యప్రదేశ్‌లోని భోపాల్ ప్రజలు నాటి ఘటన మిగిల్చిన విషాదాన్ని దిగమింగుతూనే కాలం వెళ్లదీస్తున్నారు.
ప్రపంచంలోనే భారీ పారిశ్రామిక దుర్ఘటనగా పేరొందిన భోపాల్ ఉదంతపు గాయాలు 39 ఏళ్లు గడిచినా మానలేదు. ఈ గ్యాస్ దుర్ఘటనలో వేలాది మంది మృతిచెందారు. వారి పిల్లలు, మనుమలు ఇప్పటికీ ఈ విష వాయువు ప్రభావాలను ఎదుర్కొంటూనే ఉన్నారు. ప్రభుత్వాలు అందించిన సాయం ఎందుకూ సరిపోలేదు. నాడు గ్యాస్ దుర్ఘటన జరిగిన ప్రదేశంలో విషపూరిత వ్యర్థాలు నేటికీ కనిపిస్తాయి. ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఈ విషపూరిత వ్యర్థాలను కాల్చడం సాధ్యం కావడం లేదు. ఈ దుర్ఘటనకు బలై, న్యాయ పోరాటానికి దిగిన చాలామంది ఈ లోకం నుండి నిష్క్రమించారు. ఈ ఉదంతంలో బాధ్యులను శిక్షించాలనే అంశం ఇంకా కోర్టుల్లో పెండింగ్‌లోనే ఉంది.
భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో 15 వేల మందికి పైగా జనం ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం దరిమిలా నగరం మృతదేహాలతో నిండిపోయింది. 1979లో మిథైల్ ఐసోసైనైడ్ ఉత్పత్తి కోసం ఇక్కడ ఒక కర్మాగారం ఏర్పాటయ్యింది. అయితే ఈ పరిశ్రమ యాజమాన్యం తగిన భద్రతా ఏర్పాట్లు చేయలేదు. డిసెంబర్ 2, 3వ తేదీ రాత్రి ఫ్యాక్టరీలోని ఏ 610 నంబర్ ట్యాంక్‌లో నీరు లీకైంది. మిథైల్ ఐసోసైనేట్‌లో నీరు కలవడంతో ట్యాంకులోపల ఉష్ణోగ్రత పెరిగింది. ఆ తర్వాత విషవాయువు వాతావరణంలోకి వ్యాపించించింది. 45 నిమిషాల వ్యవధిలోనే దాదాపు 30 మెట్రిక్ టన్నుల గ్యాస్ లీకైనట్లు సమాచారం. ఈ వాయువు నగరమంతటా వ్యాపించింది. ఈ విషవాయువుల బారినపడి 15 వేల మందికి పైగా జనం మృత్యువాత పడ్డారు.
అయితే ఈ ప్రమాదం నుంచి బయటపడిన వారు కూడా విష వాయువు ప్రభావం నుంచి తప్పించుకోలేకపోయారు. వైకల్యం రూపంలో వారిని, వారి తరాలను వెంటాడుతోంది. ఈ విష వాయువు ప్రభావంతో మరణించిన వారి అధికారిక సంఖ్య ఇంకా అందుబాటులో లేదు. అధికారిక మరణాల సంఖ్య మొదట్లో 2259గా నివేదించారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం 3,787 మంది గ్యాస్ బారిన పడినట్లు నిర్ధారించింది. ఇతర అంచనాల ప్రకారం ఎనిమిది వేల మంది మరణించారు. మరో ఎనిమిది వేల మంది గ్యాస్ సంబంధిత వ్యాధులతో కన్నుమూశారని వివిధ నివేదికలు చెబుతున్నాయి.
ఇది కూడా చదవండి: రెబల్స్, స్వతంత్రుల టచ్‌లో బీజేపీ, కాంగ్రెస్ నేతలు?
Comments
Please login to add a commentAdd a comment