శిరీష (ఫైల్)
సాక్షి, మంచిర్యాల(ఆదిలాబాద్): జిల్లా కేంద్రంలోని గోపాలవాడ శివారు రైల్వే ఏ క్యాబిన్ సమీపంలో నివాసం ఉంటున్న ట్రాన్స్‌జెండర్ బెజ్జం వెంకటేశ్ అలియాస్ శిరీష (24) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మంగళవారం స్థానికులు అందించిన సమాచారం మేరకు ఎస్సై కిరణ్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. స్థానికులు, ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా కేంద్రంలోని శ్రీనివాస్‌నగర్‌కు చెందిన బెజ్జం చంద్రయ్య, సత్యవతి దంపతుల నాలుగో కుమారుడు వెంకటేశ్ ఐదేళ్ల క్రితం ట్రాన్స్‌జెండర్‌గా మారి మంచిర్యాలకు చేరుకున్నాడు.
శిరీషగా పేరు మార్చుకున్న అనంతరం సామాజిక సేవల్లో పాల్గొంది. ఈ క్రమంలో ఇక్కడే ఇంటిని నిర్మించుకుంది. జనవరి 1 తర్వాత కనిపించకపోవడం, ఇంటి నుంచి వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని తలుపులు తీసి చూడగా బెడ్‌పై కుళ్లిన స్థితిలో శిరీష మృతదేహం ఉంది. దుర్గంధం వస్తుండటంతో నాలుగురోజుల క్రితమే మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
బంధువులకు సమాచారం అందించి, మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి స్నేహితురాలు పింకి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వెల్లడించారు.
పలు అనుమానాలు..
శనివారం రాత్రి వరకు చుట్టపక్కల వారితో చలాకీగా మాట్లాడిన శిరీష ఆ తర్వాత కనిపించలేదని స్థానికులు పేర్కొంటున్నారు. మంగళవారం శిరీష ఉంటున్న ఇంట్లో నుంచి వాసన రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇంట్లో బెడ్‌పై కూర్చోని, వెనుక వైపునకు వాలిపోయి ఉన్న స్థితిలో మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ముందు అన్నం ప్లేట్ ఉండటంతో అన్నంలో విషం కలుపుకుని ఆత్మహత్యకు పాల్పడిందా..? లేక ఎవరైనా మద్యం మత్తులో హత్య చేసి ఉంటారా..? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
సేవా కార్యక్రమాల్లో శిరీష..
అందరిలా కాకుండా శిరీష సొంతంగా వివాహది కార్యక్రమాలకు, డ్యాన్స్ ప్రోగ్రాంలకు, క్యాటరింగ్ పనులు చేసేందుకు వెళ్లేది. 2020లో కరోనా బారిన పడిన వారికి, నిరుపేదలకు బియ్యం, కూరగాయలు, నిత్యావసరాలు పంపిణీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment