కలెక్టర్ వ్యాఖ్యలపై వివరణ కోరిన హెచ్చార్సీ
హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ వివరణ కోరింది. ఈ ఘటన పూర్వాపరాలను నివేదించాలంటూ డీజీపీ, సీఎస్‌లను ఆదేశించింది. బ్రాహ్మణ కల్చర్‌పై కలెక్టర్ ఎ.మురళి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారంటూ కొందరు బ్రాహ్మణ సంఘాల నాయకులు సోమవారం హెచ్చార్సీని ఆశ్రయించారు. తమ మనోభావాలను కలెక్టర్ దెబ్బతీశారని, అటవీ జంతువులను చంపాలంటూ గ్రామస్తులను కోరారని ఫిర్యాదు చేశారు.
అంతకుముందు వారు రాష్ట్ర ఛీప్ సెక్రటరీ ఎస్.పి.సింగ్‌ను కూడా కలిశారు. కలెక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ పూర్వకాలంలో మనుషులు అడవి పంది మాంసం తినేవారని.. బ్రాహ్మణ కల్చర్ వచ్చిన తర్వాత ఆహారపు అలవాట్లు మారాయంటూ కామెంట్ చేశారు. తన మాటలపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగటంతో కలెక్టర్ మురళి క్షమాపణ చెప్పిన విషయం తెలిసిందే.