bhuvanagiri MP
-
ఎంపీ కోమటిరెడ్డికి అవమానం: సీఎం కేసీఆర్ సభకు అందని ఆహ్వానం
సాక్షి, న్యూఢిల్లీ: తన నియోజకవర్గ పరిధిలో నిర్వ హించిన అభివృద్ధి కార్యక్రమాలపై తనకు సమా చారం ఇవ్వకుండా ప్రొటోకాల్ ఉల్లంఘించిన అధి కారులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంగళవారం లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు ఫిర్యాదు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారని తెలిపారు. కార్యక్రమానికి తనకు సమాచారం ఇవ్వలేదన్నారు. కేంద్రమంత్రులను కలిసిన కోమటిరెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఆయన కార్యాలయంలో కోమటిరెడ్డి కలిశారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పలు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుల కోసం విజ్ఞప్తులు అందించారు. అనంతరం కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీని కలిసి తుర్కయంజాల్ మున్సిపాలిటీ ప్రాంత అభివృద్ధి గురించి విన్నవించారు. రోడ్డు కోసం వారిని బుజ్జగిస్తున్నారు తన ఎర్రవెల్లి ఫాంహౌస్‌కు వెళ్లే రోడ్డును వాసాలమర్రి గ్రామస్తులు అడ్డుకున్నందుకే సీఎం కేసీఆర్ అక్కడి ప్రజలను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారని కోమటిరెడ్డి విమర్శించారు. అందుకే వారికి అర చేతిలో వైకుంఠం చూపెడుతున్నారన్నారు. వాసాలమర్రి కార్యక్రమానికి తననెందుకు ఆహ్వానించలేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. -
భువనగిరి బరిలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
సాక్షి, యాదాద్రి : భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేసింది. సోమవారం అర్ధరాత్రి ఈమేరకు ఏఐసీసీ విడుదల చేసిన రెండో జాబితాలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేరు ప్రకటించింది. అనూహ్య మలుపుల నడుమ భువనగిరి అభ్యర్థి పేరు ఖరారు అయ్యింది. భువనగిరి టికెట్ కోసం 30 మంది అధిష్టానానికి దరఖాస్తు చేసుకున్నారు. పీసీసీ నుంచి ఏఐసీసీకి వెళ్లిన జాబితాతో సంబంధం లేకుండా అధిష్టానం కోమటిరెడ్డి పేరును ఖరారు చేసింది. కోమటిరెడ్డికి టికెట్ రావడం వెనుక ఆయన సోదరుడు, భువనగిరి మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నడిపిన మంత్రాంగం పనిచేసిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గానికి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి టికెట్ ఖరారు చేసింది అధిష్టానం. దీంతో జిల్లాలోని రెండు లోక్‌సభ స్థానాలకు బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపినట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. బలమైన అభ్యర్థిగా రంగంలోకి.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి బలమైన అభ్యర్థిగా పార్టీ రంగంలోకి దించింది. కొన్ని రోజులుగా భువనగిరి నుంచి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి బీసీ సామాజిక వర్గానికి చెందిన మధుయాష్కి పోటీ చేస్తారని ప్రచారం సాగింది. మధుయాష్కి కోమటిరెడ్డి సోదరుల అండదండలతోనే ఇక్కడి నుంచి పోటీ చేయడానికి సిద్ధం అయ్యారన్న ప్రచారం కూడా సాగింది. అయితే ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో నల్లగొండ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వెంకట్‌రెడ్డి లోక్‌సభ ఎన్నికల్లో నల్లగొండ నుంచి పోటీ చేస్తానని అధిష్టానం తనకు టికెట్ ఇవ్వాలని అభ్యర్థించారు. కోమటిరెడ్డితోపాటు నల్లగొండ నుంచి పోటీ చేయడానికి సీఎల్పీనేత జానారెడ్డి, రేవంత్‌రెడ్డి అనుచరుడు సూర్యాపేటకు చెందిన పటేల్ రమేష్‌రెడ్డి తమకు టికెట్ కావాలని అధిష్టానాన్ని కోరారు. నల్లగొండ నుంచి గులాబీ బాస్ కేసీఆర్ పోటీ చేయబోతున్నారన్న ప్రచారం సాగుతున్న నేపథ్యంలో అక్కడి నుంచి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని అధిష్టానం రంగంలోకి దింపింది. మరోవైపు భువనగిరి నియోజకవర్గంలో బలమైన అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి టికెట్ ఇవ్వడం ద్వారా విజయం దక్కించుకోవచ్చన్న ప్లాన్‌ను సిద్ధం చేసింది. కేంద్రంలో రాహుల్‌గాంధీ ప్రధాని కావాలంటే ప్రతి ఎంపీ సీటు ఎంతో ముఖ్యంగా భావిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రంలో ఎంపీ టికెట్ల కేటాయింపులో సీనియర్లకు ప్రాధాన్యం ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. 2009 లోక్‌సభ ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భువనగిరి లోక్‌సభకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు. అయితే 2014లో జరిగిన ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ చేతిలో అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. స్వల్ప మెజార్టీతో ఓటమి పాలైనప్పటికీ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2015 జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా గెలుపొందిన రాజగోపాల్‌రెడ్డి, 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో పాటు నకిరేకల్ నియోజకవర్గంలో తమ అనుచరుడు చిరుమర్తి లింగయ్యను ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. భువనగిరి, ఆలేరు, జనగామ, తుంగతుర్తి, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో కోమటిరెడ్డి సోదరులకు బలమైన శిష్యగణం ఉంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో భువనగిరి, ఆలేరు, జనగామ మినహా ఇబ్రహీంపట్నం, తుంగతుర్తిలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. గతంలో రాజగోపాల్‌రెడ్డి ఎంపీగా చేసిన సేవలు కూడా సానుకూలంగా కలిసి వస్తుందని భావిస్తున్నారు. భువనగిరి నుంచి అయతే విజయం సాధించవచ్చన్న ధీమాతో చివరి నిమిషంలో భువనగిరి నుంచి ఎంపీగా పోటీకి రంగంలోకి దిగారు. ఆశావహులకు దక్కని అవకాశం.. ఇక్కడి నుంచి పోటీ చేస్తానని కొంతకాలంగా కార్యకర్తల మధ్యన ఉంటున్న మధుయాష్కీ వెంకట్‌రెడ్డికి టికెట్ కేటాయించడంతో యథావిధిగా గతంలో ఎంపీగా పనిచేసిన నిజామాబాద్ లోక్‌సభ నుంచి పోటీ చేయాలని అధిష్టానం టికెట్ ఖరారు చేసింది. కాగా భువనగిరి అసెంబ్లీ సెగ్మెంట్‌కు చెందిన పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి భువనగిరి లోక్‌సభ నుంచి పోటీ చేయడానికి చాలా రోజుల నుంచి సిద్ధమవుతున్నారు. పార్లమెంట్ నియోజకవర్గంలో పలు సేవా, ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. అనూహ్యంగా శాసనసభ్యుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయాలని గూడూరు నారాయణరెడ్డికి అధిష్టానం టికెట్ కేటాయిం చింది. దీంతో ఆయన ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ వేశారు. టీడీపీతో కలిసి కాంగ్రెస్‌కు 21మంది ఎమ్మెల్యే సంఖ్యాబలం ఉండగా పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించడంతో తమ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో చేర్చుకోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి తప్పుకుంది. దీంతో ఆయనకు ఎంపీ టికెట్ దక్కలేదు. నాయకత్వంలో సమన్వయ లోపం.. పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ నాయకత్వంలో సమన్వయం లోపంఉంది. జనగామ, ఆలేరు, భువనగిరి, తుంగతుర్తి నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌లోని ఒక వర్గంలో ఉన్న అసంతృప్తి, ఇబ్బందులు కల్పించే అవకాశం ఉంది. అందరూ నాయకులను సమన్వయం చేయగలిగితే గెలుపు అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. కోమటిరెడ్డి బయోడేటా.. పేరు : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుటుంబ సభ్యులు : భార్య సబిత, కుమార్తె శ్రీనిధి పుట్టిన తేదీ : 23.05.1965 స్వస్థలం : బ్రాహ్మణవెల్లెంల, నార్కట్‌పల్లి మండలం, నల్లగొండ జిల్లా తల్లిదండ్రులు : పాపిరెడ్డి, సుశీలమ్మ రాజకీయ ప్రస్థానం : 1999, 2004, 2009, 2014లలో నల్లగొండ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగసాగర్లు ఎమ్మెల్యేగా గెలుపు, 2009 నుంచి 2014 వరకు రాష్ట్ర ఐటీ కమ్యూనికేషన్, క్రీడలు, ఉపరితల రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. 2014 శాసనసభ రద్దు వరకు సీఎల్పీ ఉపనేతగా పనిచేశారు. సకలజనుల సమ్మె సందర్భంగా తెలంగాణ కోసం జరుగుతున్న ఉద్యమంలో కోమటిరెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేశారు. దివంగత సీఎం వైఎస్ఆర్, కె.రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రి వర్గాల్లో మంత్రిగా రాష్ట్రానికి సేవలందించారు. కాగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. -
'కేసీఆర్ సూచనలకు ప్రధాని అధిక ప్రాధాన్యత'
హైదరాబాద్: నామినేటెడ్ పోస్టుల భర్తీలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేసినట్లు భువనగరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్ వెల్లడించారు. ఈ మేరకు కేసీఆర్‌కు లేఖ రాసినట్లు గౌడ్ శనివారం హైదరాబాద్‌లో తెలిపారు. ఉమ్మడి ప్రవేశ పరీక్షల వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం ఉండదని అన్నారు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలు జాతీయ స్థాయిలో జరిగే కామన్ మెడికల్ ఎగ్జామ్‌లో చేరాలని సూచించారు. కేంద్రంతో తమ ప్రభుత్వానికి ఎలాంటి ఘర్షణ లేదని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ చేసిన సూచనలకు ప్రధాని మోదీ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని బూర నర్సయ్య గౌడ్ గుర్తు చేశారు. -
ప్రజలకు అందుబాటులో ఉంటా..
జనగామ, న్యూస్‌లైన్ : తనను ఆదరించిన జనం రుణం తీర్చుకోలేనిది.. వారికి నిత్యం అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి పాటుపడతానని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. పార్లమెంట్ అభ్యర్థిగా గెలుపొందిన తదుపరి సోమవా రం ఆయన తొలిసారి జనగామకు వచ్చా రు. ఈ సందర్భంగా తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీఆర్ఎస్ను గెలిపించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. గతంలో తమ అభిమానాన్ని ఉద్యమం రూపంలో చూపిన ప్రజలు ఇప్పుడు ఓటు రూపంలో చూపి బ్రహ్మరథం పట్టారని పేర్కొన్నారు. గెలుపు ఆనందం కన్నా హామీల బాధ్యతలు ఎక్కువయ్యాయని, వాటిని నెరవేర్చడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని చెప్పా రు. కేబినెట్ ప్రారంభమైన వారం రోజుల్లో రైతు రుణాలు మాఫీ చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ఆయనకు అభినందనలు తెలిపారు. సమావేశంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బండా యాదగిరిరెడ్డి, నాయకులు కన్నా పరుశరాములు, రంగారెడ్డి, చేవెల్ల సంపత్, పసుల ఏబెల్, తిప్పారపు ఆనంద్, ఆలూరి రమేష్, ఆకునూరి వెంకన్న, నీల యాదగిరి తదితరులు పాల్గొన్నారు. -
సోనియాతోనే తెలంగాణ కల సాకారం
- విశ్వాసానికి.. విశ్వాసఘాతుకానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు - టీఆర్ఎస్ది కుటుంబ పాలన - ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి జనగామ, న్యూస్‌లైన్ : ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ దయతోనే 60 ఏళ్ల తెలంగాణ కల సాకారమైందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం జనగామలో రోడ్ షో చేపట్టారు. కాలనీల్లో కార్యకర్తలతో కలిసి ఓట్లను అభ్యర్థించారు. అనంతరం జనగామలోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తదుపరి జరుగుతున్న తొలి ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకమైనవన్నారు. తెలంగాణ ప్రజలు విశ్వాసం గల వారని నిరూపించుకునేందుకు ఈ ఎన్నికలు మంచి అవకాశమన్నారు. విశ్వాసానికి.. విశ్వాసఘాతుకానికి మధ్య జరుగుతున్న ఎన్నికల్లో తెలంగాణ వాదులు తమ నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరముందన్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన మాట మీద నిలబడే వ్యక్తి కాదన్నారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని.. తెలంగాణ ఏర్పాటు అనంతరం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని మాట తప్పారని అన్నారు. ఇద్దరు ఎంపీలున్న కేసీఆర్‌తో తెలంగాణ రాలేదన్నారు. టీఆర్ఎస్ది కుటుంబ పాలన అని ఆరోపించారు. సీమాంధ్రలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకు పోతుందని తెలిసినా సోని యా ఇచ్చిన మాటను నిలబెట్టుకుందన్నారు. అందుకోసం ఆమె రుణం తీర్చుకునేందుకు కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. జనగామ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాల లక్ష్మయ్యను, భువనగిరి ఎంపీ అభ్యర్థినైన తనను అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. పొన్నాలకు, తనకు మధ్య విభేదాలు ఉన్నాయన్న వాదనలో వాస్త వం లేదన్నారు. నిత్యం ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఎన్నికల్లో గెలుపునకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణలో బీసీ సీఎం అనడం పెద్ద డ్రామా అన్నారు. దమ్ముంటే సీమాంధ్రలో బీసీని సీఎం చేస్తానని బాబు చెప్పాలన్నారు. లక్ష ఇజ్జత్ పాస్‌లతో రికార్డు దేశ వ్యాప్తంగా రెండు లక్షల ఇజ్జత్(ట్రైన్) పాస్‌లు జారీ చేస్తే అందులో తన భువనగిరి నియోజకవర్గ పరిధిలోనే లక్ష పాసులు ఉన్నాయని అన్నారు. ఇది రికార్డు అన్నారు. అదేవిధంగా తన ఎంపీ నిధులు సరిపోకుంటే ప్రతీ గ్రామంలో సొంత ఖర్చులతో బోర్లు వేయించి తాగునీటిని అందించానని అన్నారు. తెలంగాణ కోసం 2009 నుంచి అలుపెరుగనిపోరాటం చేశానని చెప్పారు. ఎంపీగా మళ్లీ భారీ మెజారిటీతో గెలుపొందుతానని కొమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గెలిచిన వెంటనే భువనగిరి నుంచి వరంగల్ వరకు నాలుగు లేన్ల రోడ్డుకు శంకుస్థాపన చేస్తానని అన్నారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలో నెలకొన్న సమస్య ల పరిష్కారానికి చర్యలు చేపడుతానని పేర్కొన్నారు. జనగామ, భువనగిరి, ఆలేరు రైల్వేస్టేషన్లను మరింత ఆధునీ కరించేందుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తానన్నారు. సమావేశంలో మహేందర్‌రెడ్డి, వేమల్ల సత్యనారాయణరెడ్డి, కొమ్ము నర్సింగారావు, గుర్రపు బాలరాజు పాల్గొన్నారు.