సాక్షి, యాదాద్రి : భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేసింది. సోమవారం అర్ధరాత్రి ఈమేరకు ఏఐసీసీ విడుదల చేసిన రెండో జాబితాలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేరు ప్రకటించింది. అనూహ్య మలుపుల నడుమ భువనగిరి అభ్యర్థి పేరు ఖరారు అయ్యింది. భువనగిరి టికెట్ కోసం 30 మంది అధిష్టానానికి దరఖాస్తు చేసుకున్నారు. పీసీసీ నుంచి ఏఐసీసీకి వెళ్లిన జాబితాతో సంబంధం లేకుండా అధిష్టానం కోమటిరెడ్డి పేరును ఖరారు చేసింది.
కోమటిరెడ్డికి టికెట్ రావడం వెనుక ఆయన సోదరుడు, భువనగిరి మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నడిపిన మంత్రాంగం పనిచేసిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గానికి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి టికెట్ ఖరారు చేసింది అధిష్టానం. దీంతో జిల్లాలోని రెండు లోక్‌సభ స్థానాలకు బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపినట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
బలమైన అభ్యర్థిగా రంగంలోకి..
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి బలమైన అభ్యర్థిగా పార్టీ రంగంలోకి దించింది. కొన్ని రోజులుగా భువనగిరి నుంచి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి బీసీ సామాజిక వర్గానికి చెందిన మధుయాష్కి పోటీ చేస్తారని ప్రచారం సాగింది. మధుయాష్కి కోమటిరెడ్డి సోదరుల అండదండలతోనే ఇక్కడి నుంచి పోటీ చేయడానికి సిద్ధం అయ్యారన్న ప్రచారం కూడా సాగింది.
అయితే ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో నల్లగొండ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వెంకట్‌రెడ్డి లోక్‌సభ ఎన్నికల్లో నల్లగొండ నుంచి పోటీ చేస్తానని అధిష్టానం తనకు టికెట్ ఇవ్వాలని అభ్యర్థించారు. కోమటిరెడ్డితోపాటు నల్లగొండ నుంచి పోటీ చేయడానికి సీఎల్‌పీనేత జానారెడ్డి, రేవంత్‌రెడ్డి అనుచరుడు సూర్యాపేటకు చెందిన పటేల్ రమేష్‌రెడ్డి తమకు టికెట్ కావాలని అధిష్టానాన్ని కోరారు.
నల్లగొండ నుంచి గులాబీ బాస్ కేసీఆర్ పోటీ చేయబోతున్నారన్న ప్రచారం సాగుతున్న నేపథ్యంలో అక్కడి నుంచి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని అధిష్టానం రంగంలోకి దింపింది. మరోవైపు భువనగిరి నియోజకవర్గంలో బలమైన అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి టికెట్ ఇవ్వడం ద్వారా విజయం దక్కించుకోవచ్చన్న ప్లాన్‌ను సిద్ధం చేసింది. కేంద్రంలో రాహుల్‌గాంధీ ప్రధాని కావాలంటే ప్రతి ఎంపీ సీటు ఎంతో ముఖ్యంగా భావిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రంలో ఎంపీ టికెట్ల కేటాయింపులో సీనియర్లకు ప్రాధాన్యం ఇచ్చినట్లు స్పష్టమవుతోంది.
2009 లోక్‌సభ ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భువనగిరి లోక్‌సభకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు. అయితే 2014లో జరిగిన ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ చేతిలో అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. స్వల్ప మెజార్టీతో ఓటమి పాలైనప్పటికీ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2015 జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా గెలుపొందిన రాజగోపాల్‌రెడ్డి, 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
దీంతో పాటు నకిరేకల్ నియోజకవర్గంలో తమ అనుచరుడు చిరుమర్తి లింగయ్యను ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. భువనగిరి, ఆలేరు, జనగామ, తుంగతుర్తి, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో కోమటిరెడ్డి సోదరులకు బలమైన శిష్యగణం ఉంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో భువనగిరి, ఆలేరు, జనగామ మినహా ఇబ్రహీంపట్నం, తుంగతుర్తిలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. గతంలో రాజగోపాల్‌రెడ్డి ఎంపీగా చేసిన సేవలు కూడా సానుకూలంగా కలిసి వస్తుందని భావిస్తున్నారు. భువనగిరి నుంచి అయతే విజయం సాధించవచ్చన్న ధీమాతో చివరి నిమిషంలో భువనగిరి నుంచి ఎంపీగా పోటీకి రంగంలోకి దిగారు.
ఆశావహులకు దక్కని అవకాశం..
ఇక్కడి నుంచి పోటీ చేస్తానని కొంతకాలంగా కార్యకర్తల మధ్యన ఉంటున్న మధుయాష్కీ వెంకట్‌రెడ్డికి టికెట్ కేటాయించడంతో యథావిధిగా గతంలో ఎంపీగా పనిచేసిన నిజామాబాద్ లోక్‌సభ నుంచి పోటీ చేయాలని అధిష్టానం టికెట్ ఖరారు చేసింది. కాగా భువనగిరి అసెంబ్లీ సెగ్మెంట్‌కు చెందిన పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి భువనగిరి లోక్‌సభ నుంచి పోటీ చేయడానికి చాలా రోజుల నుంచి సిద్ధమవుతున్నారు. పార్లమెంట్ నియోజకవర్గంలో పలు సేవా, ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. అనూహ్యంగా శాసనసభ్యుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయాలని గూడూరు నారాయణరెడ్డికి అధిష్టానం టికెట్ కేటాయిం చింది.
దీంతో ఆయన ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ వేశారు. టీడీపీతో కలిసి కాంగ్రెస్‌కు 21మంది ఎమ్మెల్యే సంఖ్యాబలం ఉండగా పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించడంతో తమ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి తప్పుకుంది. దీంతో ఆయనకు ఎంపీ టికెట్ దక్కలేదు.
నాయకత్వంలో సమన్వయ లోపం..
పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ నాయకత్వంలో సమన్వయం లోపంఉంది. జనగామ, ఆలేరు, భువనగిరి, తుంగతుర్తి నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌లోని ఒక వర్గంలో ఉన్న అసంతృప్తి, ఇబ్బందులు కల్పించే అవకాశం ఉంది. అందరూ నాయకులను సమన్వయం చేయగలిగితే గెలుపు అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.
కోమటిరెడ్డి బయోడేటా..
పేరు : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
కుటుంబ సభ్యులు : భార్య సబిత, కుమార్తె శ్రీనిధి
పుట్టిన తేదీ : 23.05.1965
స్వస్థలం : బ్రాహ్మణవెల్లెంల, నార్కట్‌పల్లి మండలం, నల్లగొండ జిల్లా
తల్లిదండ్రులు : పాపిరెడ్డి, సుశీలమ్మ
రాజకీయ ప్రస్థానం : 1999, 2004, 2009, 2014లలో నల్లగొండ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగసాగర్లు ఎమ్మెల్యేగా గెలుపు, 2009 నుంచి 2014 వరకు రాష్ట్ర ఐటీ కమ్యూనికేషన్, క్రీడలు, ఉపరితల రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. 2014 శాసనసభ రద్దు వరకు సీఎల్పీ ఉపనేతగా పనిచేశారు. సకలజనుల సమ్మె సందర్భంగా తెలంగాణ కోసం జరుగుతున్న ఉద్యమంలో కోమటిరెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేశారు. దివంగత సీఎం వైఎస్‌ఆర్, కె.రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రి వర్గాల్లో మంత్రిగా రాష్ట్రానికి సేవలందించారు. కాగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి టీఆర్‌ఎస్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment