
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొత్త ఒరవడితో ముందుకెళ్లనుందా..? టీపీసీసీ అధ్యక్ష పదవి చుట్టూ తిరుగుతున్న వ్యవహారాన్ని తనదైన శైలిలో అధిష్టానం చేతిలోకి తెచ్చుకోనుందా..? తెలంగాణలోని నాయకులందరికీ సముచిత ప్రాధాన్యం ఇస్తూ పార్టీలో ఎలాంటి అసమ్మతి తలెత్తకుండా గుజరాత్ తరహా ప్రయోగానికి సిద్ధమవుతోందా..? అంటే అవుననే అంటున్నాయి ఏఐసీసీ వర్గాలు. గత కొన్ని రోజులుగా టీపీసీసీ అధ్యక్ష పదవిపై కొనసాగుతున్న సస్పెన్స్‌కు కొత్త ట్విస్ట్ ఇచ్చి తెరదింపే దిశలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా టీపీసీసీ అధ్యక్షుడితో పాటు ఆరు కమిటీలను కొత్త ఏడాదిలో ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. కొత్తగా అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసి, ఆ కమిటీ ఆధ్వర్యంలోనే ఇతర కమిటీలు పనిచేసేలా దిశానిర్దేశం చేయనుందనే చర్చ ఇప్పుడు గాంధీ భవన్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పదవులపై కొత్త సంవత్సరంలో స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు పార్టీలో సీనియర్లు ఎవరికి వారు టీపీసీసీ అధ్యక్షుని ఎంపికపై విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి అమ్ముడుపోయారనే ఆరోపణలు చేస్తున్నారు. బలహీనవర్గాలకు అధ్యక్ష పదవి ఇవ్వాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి అయితే తన పేరు జాబితాలో చేర్చకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పకడ్బందీ వ్యూహంతో ముందుకు..
తెలంగాణ ఇచ్చిన పార్టీగా రెండు దఫాలు రాష్ట్ర ప్రజల మన్ననలు పొందలేక పోయిన కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికలను జీవన్మరణ సమస్యగా భావిస్తోంది. ఆ ఎన్నికల్లో వచ్చే ఫలితాల ఆధారంగానే పార్టీకి తెలంగాణలో మనుగడ ఉంటుందనే ఆలోచనలో ఉన్న ఢిల్లీ పెద్దలు.. పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్లాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే 162 మంది నాయకుల అభిప్రాయాన్ని అధిష్టానం సేకరించింది. అయితే ఇందులో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం, ఫలానా నాయకుడికే పీసీసీ పగ్గాలు ఇవ్వాలనే వాదనలు పెరుగుతుండడంతో పార్టీకి నష్టం జరగకుండా ప్రత్యామ్నాయాలవైపు హైకమాండ్ దృష్టి పెట్టిందనే చర్చ జరుగుతోంది.
6 కమిటీలు.. అందరికీ పదవులు
రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బట్టి సాఫీగా పదవుల పందేరాన్ని పూర్తి చేయాలన్నది కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన. అందులో భాగంగానే టీపీసీసీ అధ్యక్ష పదవితోపాటు పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ, వ్యూహ, మేనిఫెస్టో, కార్యక్రమాల అమలు, మీడియా పబ్లిసిటీ, సమన్వయ సలహా కమిటీలను ఏర్పాటు చేసే దిశలో కసరత్తు చేస్తోంది. సలహా కమిటీ చైర్మన్‌గా పొన్నాల లక్ష్మయ్య, కో చైర్మన్‌గా జానారెడ్డిల పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇందులో దామోదర రాజనర్సింహ, వీహెచ్, షబ్బీర్ అలీ, గీతారెడ్డిలను నియమించనున్నట్టు తెలుస్తోంది. ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కలకు కీలక పదవులు కట్టబెట్టాలన్నది సోనియా ఆలోచన అని చర్చ జరుగుతోంది. ఒకరికి టీపీసీసీ పగ్గాలు ఇచ్చి మిగిలిన ఇద్దరికి ప్రచార కమిటీ చైర్మన్, ఏఐసీసీ పదవులు ఇస్తారనే చర్చ జరుగుతోంది. మధు యాష్కీగౌడ్, సంపత్‌లను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment