సైకిల్ పోయిందని ఆత్మహత్య చేసుకోవాలనుకుని..
జన్నారం : సైకిల్ ఎవరో ఎత్తుకెళ్లారు. ఎదైనా పని చేసి డబ్బులు సంపాదించి తిరిగి సైకిల్ కొనుక్కోవాలనే పట్టుదలతో వచ్చిన విద్యార్థి తీరుకు మెచ్చి సొంత డబ్బులతొ సైకిల్ కొనిచ్చాడో సామాజిక కార్యకర్త. అయితే ఈ క్రమంలో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డాడని తెలుసుకున్న స్థానిక ఎస్సై ఆయనకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. ఇంద్రవెల్లి మండలం కొండపూర్ గ్రామానికి చెందిన బట్టి రాజన్న, లక్ష్మిల కుమారుడు అంకూస్. అంకూస్ ఉట్నూర్ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ ద్వీతీయ సంవత్సరం చదువుతున్నాడు. రెండు కిలోమీటర్ల దూరంలో గల మేనెజ్మెంట్ హాస్టల్లో ఉంటున్నాడు.
ఇటీవల ఉట్నూర్‌లో జరిగిన గిరి ఉత్సవ్ కార్యక్రమంలో అంకుల్ సైకిల్ దొంగలు ఎత్తుకెళ్లారు. అయితే సైకిల్ కొనడం తల్లిదండ్రులకు భారమవుతుందనే ఉద్దేశ్యంతో తాను హాస్టల్ నుంచి జన్నారం వరకు పని కోసం వచ్చినట్లు వెళ్లాడు. పని చేసి సైకిల్ కొనుక్కోవాలని, నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో జన్నారంలో నీటి ప్లాంట్ నడిపిస్తున్న సామాజిక కార్యకర్త భూమాచారి వద్దకు వచ్చి ఎదైనా పని ఇప్పించాలని కోరాడు. లేకుంటే తనకు ఆత్మహత్యే శరణ్యమని వేడుకున్నాడు. అయితే పూర్తి వివరాలు కోరగా అంకుల్ జరిగిన విషయం తెలిపాడు. ఆయన మానవతా హృదయంతో స్పందించి సొంత డబ్బులతో సైకిల్ కొనిచ్చాడు. ఎస్సై ప్రసాద్ సమక్ష్యంలో సైకిల్‌ను ఆ విద్యార్థికి అందజేశారు. విద్యార్థికి ఎస్సై కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా భూమాచారిని ఎస్సై అభినందించారు.