బిస్వాల్ చిత్రం.. రైల్వే స్టేషన్లకు జీవం!
భారతీయులకు, రైళ్లకు విడదీయరాని అనుబంధం ఉంది. అందుకే భారతీయ చిత్రాల్లో రైళ్లకు ప్రముఖ స్థానం కల్పించారు. సినిమాల తర్వాత అంతటి స్థాయిలో రైల్వేకు పేరు తీసుకొచ్చింది మాత్రం బిజయ్ బిస్వాలే అంటారు నాగ్పూర్ డివిజన్లో అతనితో కలసి పనిచేసినవారు. రైల్వేలో చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న బిస్వాల్.. తన వృత్తిని ఎంత గా ప్రేమించారో ఆయన గీసిన చిత్రాలను చూసి చెప్పొచ్చు. నిజంగా పెయింటింగేనా.. అనిపించేంత సహజంగా ఉంటాయా చిత్రాలు. చల్లగా కురుస్తున్న చిరుజల్లుల్లో ట్రైన్ కోసం పరుగుపెట్టే ప్రయాణికుల్ని బిస్వాల్ కుంచె చిత్రిస్తుంటే చూసి తరించిపోవాల్సిందే.
ప్రత్యేకించి ఎవరి దగ్గరా శిష్యరికం చేయని బిస్వాల్.. చిన్ననాటి నుంచే చిత్రలేఖనం వైపు ఆకర్షితుడయ్యాడు. ఓ వైపు చిత్రాలు గీస్తూనే మరోవైపు రైల్వేలో ఉద్యోగం సంపాదించాడు. 2011 నుంచి మాత్రం చిత్రలేఖనంపై ఆయన అభిప్రాయం మారిపోయింది. రోజూ సాధన చేయడం మొదలుపెట్టాడు. ఆ కళపై ఎంతటి పట్టు సాధించాడంటే.. అతడి పెయింటింగ్లను చూసి మన కళ్లను మనమే నమ్మలేనంత స్థాయికి ఎదిగాడు. దేశవ్యాప్తంగా తన చిత్రాలను ప్రదర్శిస్తున్నాడు. ఆయన కోరిక సిమ్లావంటి ప్రాంతాల్లో పర్యటించాలని.. అక్కడి చిన్న చిన్న స్టేషన్లను చిత్రించాలని!