BIKE Light
-
బైక్ రైడ్ కావాలా? అయితే ‘రాపిడో’..!!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మెట్రో నగరాల్లో ఒక చోటు నుంచి ఇంకో చోటుకు ప్రయాణించాలంటే? బస్సు, క్యాబ్ లేదా ఆటో తప్పనిసరి. వీటి చార్జీలూ కాస్త ఎక్కువే.. పైగా ట్రాఫిక్ సమస్య! అందుబాటు ధరలో.. సులువైన, సురక్షితమైన ప్రయాణం చేయాలంటే? బైక్ కరెక్ట్!! అలా అని సొంతంగా బైక్‌లను కొని అద్దెకివ్వాలంటే.. పెద్ద మొత్తంలోనే పెట్టుబడి కావాలి. అందుకే కాస్త డిఫరెంట్‌గా ఆలోచించారు ఐఐటీ భువనేశ్వర్ పూర్వ విద్యార్థుల త్రయం. ఓలా, ఉబర్‌లా మాదిరి బైక్ షేరింగ్ సేవలను ప్రారంభించారు. మరిన్ని వివరాలు రాపిడో కో–ఫౌండర్ అరవింద్ సంక ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. మాది విజయవాడ దగ్గర్లోని తిరువూరు. ఐఐటీ భువనేశ్వర్‌లో ఇంజనీరింగ్ పూర్తయ్యాక.. ఫ్లిప్‌కార్ట్‌లో చేరా. సొంతగా కంపెనీ ప్రారంభించాలన్న ఆలోచనతో ఐఐటీలో స్నేహితులైన పవన్ గుంటుపల్లి, రిషికేష్ ఎస్‌ఆర్‌లతో కలిసి 2015 నవంబర్‌లో బెంగళూరు కేంద్రంగా రాపిడోను ప్రారంభించాం. కస్టమర్ల రిజిస్ట్రేషన్ కోసం ట్రూ కాలర్‌తో ఒప్పందం చేసుకున్నాం. యాప్‌ను డౌన్లోడ్ చేశాక.. రిజిస్టర్ విత్ ట్రూకాలర్ ఆప్షన్ ఎంచుకుంటే చాలు. మొబైల్ నంబర్, ప్రొఫైల్, ఓటీపీ ఏవీ అవసరం లేకుండా రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. రైడర్స్‌కు బీమా సౌకర్యం ఉంటుంది. కస్టమర్ యాప్‌లో లాగిన్ అయి.. చేరాల్సిన గమ్యాన్ని ఎంట్రీ చేయగానే.. దగ్గర్లో అందుబాటులో ఉన్న బైక్‌లు కనిపిస్తాయి. డ్రైవర్ ప్రొఫైల్, ధర వస్తుంది. ఒకే చేయగానే రైడర్ రెండు హెల్మెట్లతో మీ దగ్గరికొస్తాడు. గమ్యస్థానాన్ని చేరుకున్నాక నగదు గానీ వ్యాలెట్ ద్వారా గానీ చెల్లింపులు చేయాలి. అంధులు, మానసిక వికలాంగుల కోసం రీడీమ్ ఫీచర్‌ను జోడించాం. గమ్యస్థానాన్ని వాయిస్ రూపంలో పలికితే అది టెక్ట్స్‌గా మారుతుంది. దీంతో పాటూ బ్యాంక్ ఖాతా అనుసంధానంతో వాలెట్ ద్వారా చెల్లింపులు పూర్తవుతాయి. ఏపీ, తెలంగాణల్లో 15 లక్షల రైడ్స్.. ప్రస్తుతం 15 లక్షల మంది కస్టమర్లున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 4 లక్షల మంది. రోజుకు 40 వేల రైడ్స్. తెలుగు రాష్ట్రాల నుంచి 8 వేల వరకూ ఉంటాయి. నెలవారీ బైక్ పాస్ కూడా ఉంటుంది. నెలకు 50 ట్రిప్పులకు రూ.1,500 చార్జీ. కి.మీ.కు రూ.3 చార్జీ ఉంటుంది. ప్రతి రైడ్‌పై 15–20 శాతం డ్రైవర్ నుంచి కమిషన్ తీసుకుంటాం. జనవరి నాటికి రూ.10 కోట్ల నిధులు.. ప్రస్తుతం 200 మంది ఉద్యోగులున్నారు. జనవరి నాటికి రూ.10 కోట్ల నిధులను సమీకరించనున్నాం. ఇందులో పాత ఇన్వెస్టర్లతో పాటూ పలువురు వీసీలూ పాల్గొంటారు -
పగలైనా బండి లైట్ వెలగాల్సిందే
⇒ ఏప్రిల్ 1 నుంచి ద్విచక్ర వాహనాలకు తప్పనిసరి ⇒ కొత్త టెక్నాలజీతో సిద్ధమైన కంపెనీలు సాక్షి, అమరావతి: పగటి పూట రోడ్డుపైన ద్విచక్ర వాహనం లైట్ వెలుగుతుంటే ఎదురుగుండా వచ్చేవారు లైట్ వెలుగుతోందని చేతులతో సంజ్ఞ చేయడం.. వెంటనే లైటు ఆర్పడం వంటి అనుభవం ఎప్పుడో ఒకసారైనా మనకు ఎదురై ఉంటుంది. వచ్చే ఏప్రిల్ నుంచి ఎవరైనా చెప్పినా లైట్ ఆఫ్ చేయవద్దు. పగలైనా ద్విచక్ర వాహనం లైటు వెలగాల్సిందేనని కేంద్రం ఆదేశాలు జారీ చేయడమే ఇందుకు కారణం. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి విక్రయించే వాహనాల్లో ‘ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్ ఆన్ (ఏహెచ్‌వో)’ టెక్నాలజీని తప్పనిసరి చేస్తూ కేంద్ర రవాణ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం పాత వాహనాలకు వర్తించదు. ఇందుకు అనుగుణంగా ద్విచక్ర వాహన కంపెనీలు కొత్త వాహనాలను విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాయి. దీని వల్ల ఇక మీ బైక్‌లో హెడ్‌లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ ఉండదు. బండి ఇంజిన్ స్టార్టింగ్‌తోనే లైటు కూడా వెలుగుతుంది. బండి ఇంజిన్ ఆపితేనే లైట్ కూడా ఆగుతుంది. రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ఈ నిబంధనను అమలు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎందుకంటే.. కార్లు, ఇతర భారీ వాహనాలకు ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాలు సరిగా కనిపించకపోవడమే ప్రధాన కారణమని పలు నివేదికలు వెల్లడిస్తు న్నాయి. 2014లో జరిగిన ద్విచక్ర రోడ్డు ప్రమాదాల్లో 32,524 ఈ కారణంగానే జరిగినట్లు గణాంకాలు చెపుతున్నాయి. రహదారుల భద్రతపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ ప్రపంచ వ్యాప్తంగా అనుసరిస్తున్న విధానాలను పరిశీలించి ద్విచక్ర వాహనాల లైట్ పగటి పూటా వెలిగించాలని సూచనలు చేసింది. యూరప్, మలేషియా వంటి చాలా దేశాల్లో 2003 నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇష్టపడని వాహనదారులు పగలు కూడా బండి లైటు వెలిగే ఏహెచ్‌వో టెక్నాలజీపై కొనుగోళ్లుదారులు ఆసక్తి చూపించడం లేదు. రోడ్డు మీద వెళ్లినప్పుడు ప్రతీ ఒక్కరూ లైటు వెలుగుతోందని సంజ్ఞలు చేస్తారని, ఇది ఇబ్బందికరం అని ఒక కొనుగోలు దారుడు పేర్కొన్నారు. పగలు కూడా లైటు వెలగడం వల్ల బ్యాటరీ వినియోగం భారంగా మారుతుందని మరో కొనుగోలుదారుడు వాపోయారు. కానీ ఈ వాదనతో కంపెనీలు ఏకీభవిం చడం లేదు. ఇప్పుడు ఏహెచ్‌వో టెక్నాలజీతో బ్యాటరీతో సంబంధం లేకుండా నేరుగా ఏసీ సర్క్యూట్ ద్వారా లైట్లు వెలుగుతాయని, దీని వల్ల బ్యాటరీ జీవితకాలంపై ఎటువంటి ప్రభావం చూపదని ఆయా కంపెనీలు అంటున్నాయి. ఇప్పటికే 2017కి చెందిన కొత్త బండ్లన్నీ ఈ టెక్నాలజీతో విడుదల చేస్తున్నాయని, త్వరలోనే ఏప్రిల్ ఒకటవ తేదీ నాటికి అన్ని మోడల్స్ ఈ టెక్నాలజీతోనే వస్తాయని వరుణ్ మోటార్స్ ఈడీ సత్యనారాయణ తెలిపారు. ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు అవసరమైన కొత్త విధానాన్ని ఆహ్వానించడం అందరికీ మేలని పోలీస్, రవాణా శాఖల అధికారులు అభిప్రాయపడు తున్నారు.