డబ్బుల్ పనులు
నగర పాలక సంస్థలో అడ్డగోలు వ్యవహారం
ఇష్టారాజ్యంగా బిల్లులు
రూ.10 కోట్ల నిధులకు ఎసరు!
కమిషనర్ సోమనారాయణ వెళ్లాక రూ.7 కోట్ల ‘అదనపు’ బిల్లులు
పాలకవర్గం తీరుపై సర్వత్రా విమర్శలు
ఇష్టారాజ్యం, బిల్లులు, రూ.కోట్లకు ఎసరు, billes, tender for crores, anantapur,
ఏ పనులకు ఎంత..
134 టెండర్ పనులు : రూ.4,25,95,247
59 నామినేషన్ పనులు : రూ.87,67,998
158 డిపార్ట్మెంటల్ పనులు : రూ.2,59,38,753
281 బాక్స్ టెండర్ పనులు : రూ 2.55 కోట్లు
అనంతపురం న్యూసిటీ : అనంతపురం నగర పాలక సంస్థలో రోజుకో అడ్డగోలు వ్యవహారం వెలుగు చూస్తోంది. అధికార పార్టీకి చెందిన కీలక నేతల అండదండలతో విచ్ఛలవిడిగా బిల్లులు పెడుతున్నారు.ఈ విషయంలో తమపై పాలకవర్గం నుంచి తీవ్ర ఒత్తిడి ఉందని సాక్షాత్తూ కమిషనర్ సురేంద్రబాబు చెప్పడం గమనార్హం. ఒకే పనికి రెండుసార్లు బిల్లులు పెట్టడం మరోసారి చర్చనీయాంశమవుతోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.10 కోట్ల బిల్లులు సిద్ధం చేయడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత నెలలో ఎఫ్ఏసీ కమిషనర్‌గా ఆర్.సోమనారాయణ ఉన్నప్పుడు టెండర్, డిపార్ట్మెంటల్, నామినేషన్ పనులకు సంబంధించి రూ.3 కోట్ల బిల్లులు సరిపోతాయని అధికారులు తెలిపారు. అయితే.. ఇప్పుడు మరో రూ 7 కోట్ల బిల్లులు సిద్ధం చేయడం దుమారం రేపుతోంది. క్షేత్రస్థాయిలో పనులు జరుగుతున్నాయా, లేదా అని పరిశీలించే నాథులే కరువయ్యారు. అధికార పార్టీ నేతల పెత్తనంతో కార్పొరేషన్ అధికారులు నిమ్మకుండిపోతున్నారు.
మట్టి దిబ్బల మాయ : నగర పాలక సంస్థ అధికారులు మట్టిదిబ్బల మాయ చేశారు. సీఎం పర్యటనల నేపథ్యంలో మట్టిదిబ్బల తొలగింపు పేరుతో రూ.25 లక్షల వరకు బిల్లులు పెట్టారు. బెంగళూరు రోడ్డులో చిన్న వంక డోర్ నంబర్ 28/4/604 వద్ద మట్టిదిబ్బల తొలగింపునకు రూ 2,14,860, అదే రోడ్డులో డోర్ నంబర్ 28/3/877 నుంచి 28/3/823 వరకు రూ.95,383తో రెండు బిల్లులు, సప్తగిరి సర్కిల్ నుంచి సూర్యానగర్ సర్కిల్ వరకు మట్టిదిబ్బలు తొలగించి జీఎస్బీ ఫిల్లింగ్ చేసేందుకు రూ.3,39,831, గీతా మందిరం నుంచి డీఆర్డీఏ కార్యాలయం వరకు మట్టిదిబ్బల తొలగింపునకు రూ.1,30,614, కళ్యాణదుర్గం బైపాస్ నుంచి రుద్రంపేట బైపాస్ రోడ్డు వరకు ఇరువైపులా పనులకు రూ.2,16,739, నడిమివంక నుంచి కళ్యాణదుర్గం రోడ్డు వరకు రూ. 2,65,449, తపోవనం నుంచి కళ్యాణదుర్గం బైపాస్ వరకు పనులకు రూ.2,40,826లతో బిల్లులు పెట్టారు. అలాగే పైడిలక్ష్మయ్య విగ్రహం నుంచి అపోలో హాస్పిటల్ వరకు డివైడర్ల ఏర్పాటుకు రూ.4,54,106, రవి పెట్రోల్ బంక్ వద్ద పూడికతీతకు రూ.2,93,277, పీటీసీ వద్ద పూడికను వైట్‌వాష్ చేయడానికి రూ.1,91,392, బళ్లారి జంక్షన్లో ఐరన్ గ్రిల్ వేయడానికి రూ.3,00,320, కేటీఆర్ ఫంక్షన్ హాల్ నుంచి ఆంజనేయస్వామి ఆలయం వరకు ఎడమవైపు ఎత్తుపల్లాలను తొలగించి.. ఆ మట్టిని ట్రాక్టర్ల ద్వారా వేరే ప్రాంతాలకు తరలించడం కోసం రూ.96,579తో రెండు బిల్లులు పెట్టారు. కడియం నుంచి నగరానికి చెట్లు తీసుకురావడానికి రవాణా ఖర్చు కింద రూ.4,34,574 చూపారు. వాస్తవానికి 20 ట్రిప్పులు తిరిగినా అంత పెద్దమొత్తంలో ఖర్చు కాదని నగరపాలక వర్గాలే అంటున్నాయి.
ప్రజాప్రతినిధుల అండే కారణమా!
నగరపాలక సంస్థలో విచ్ఛలవిడిగా బిల్లులు పెట్టడం వెనుక ఇద్దరు ప్రజాప్రతినిధుల అండే కారణమని తెలుస్తోంది. ఈ ఇరువురి నేతల అనుచరులు పోటాపోటీగా రూ.కోట్లలో బిల్లులు పెట్టారన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఎప్పుడూ పారదర్శకత అంటూ ప్రగల్భాలు పలికే ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌చౌదరి, మేయర్ స్వరూప ఈ అడ్డగోలు పనులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాల్సిందే.
బిల్లులు పాస్.. ఆపై వెనక్కు
ఎఫ్ఏసీ కమిషనర్‌గా ఉన్న ఆర్.సోమనారాయణ డిసెంబర్లో రిలీవ్ అయ్యారు. అనంతరం కమిషనర్‌గా సురేంద్రబాబు వచ్చారు. ఈయన వచ్చిన తర్వాత రూ.5 కోట్ల బిల్లులకు పాస్ ఆర్డర్ ఇచ్చారని తెలిసింది. తర్వాత ఆయనే డిపార్ట్మెంటల్, బాక్స్ టెండర్ పనులు సీజ్ చేస్తున్నామని ప్రకటించడం గమనార్హం. కొత్తగా ఎస్ఈగా బాధ్యతలు తీసుకున్న సత్యనారాయణ జాయినింగ్ రిపోర్టును కూడా ప్రభుత్వానికి పంపలేదని సమాచారం. బిల్లులు వేగంగా చేయాలనే ఉద్దేశంతో కొందరు ప్రజాప్రతినిధులు వెనుక ఉండి ఈ తతంగాన్ని నడుపుతున్నట్లు తెలుస్తోంది.