biscuit house
-
ఎన్నో ప్రశ్నలు... మరెన్నో అనుమానాలు!
సాక్షి, కంకిపాడు (కృష్ణా) : గోదాము అగ్ని ప్రమాదం వ్యవహారంపై ఇంకా స్పష్టత లేదు. ప్రమాదంలో జరిగిన నష్టం ఎంత?, ప్రమాదానికి గల కారణాలు? ఏవీ తేలలేదు. అగ్నిమాపక శాఖకు పోలీసు శాఖ నుంచి నివేదిక చేరలేదు. పోలీసు శాఖకు బాధితులు స్పష్టమైన ఫిర్యాదు ఇవ్వలేదు. దీంతో విచారణ ఎంత వరకూ వచ్చిందంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే.. అన్న చందంగా ఉంది. వివరాల్లోకి వెళితే... మండలంలోని ప్రొద్దుటూరు శివారు కొణతనపాడులో బ్రిటానియా ఇండస్ట్రీస్, బ్రిటానియా డెయిరీలు శ్రీ వీవీఎన్‌ఎస్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో నడుస్తున్నాయి. గత మే ఆఖరులో అందుబాటులోకి వచ్చిన ఈ గోదాములో బ్రి టానియా సంస్థ ఉత్పత్తులను నిల్వ చేశారు. ఈనెల 3వ తేదీ తెల్లవారుజామున గోదాము అగ్నిప్రమాదానికి గురైంది. సెక్యూరిటీ సిబ్బంది ప్రమాదాన్ని గుర్తించి కంపెనీ ప్రతినిధులు, అగ్నిమాపక శాఖకు సమాచారం తెలిపే లోపే మంటలు గోదామును చుట్టుముట్టాయి. గోదా ము పూర్తిగా కాలిపోయింది. అందులో నిల్వ ఉంచిన బ్రిటానియా ఉత్పత్తులు మసయ్యాయి. తేలని విచారణ.. ప్రమాదంలో రూ.4 కోట్లకుపైగా నష్టం వాటిల్లి ఉంటుందని ప్రాథమిక అంచనా. అయితే దీనిపై స్పష్టత లేదు. గోదాము ప్రాంగణాన్ని ఆ శాఖ డైరెక్టర్ జయరాం నాయక్, జిల్లా అగ్నిమాపక అధికారి అవినాష్ జయసింహ, ఇతర సిబ్బంది సందర్శించారు. అగ్నిమాపక శాఖ నుంచి ఎలాంటి అనుమతులు పొందలేదని డైరెక్టర్ జయరాం నాయక్ వెల్లడించారు. దీంతో పాటుగా అగ్నిప్రమాద నివారణకు ముందస్తు జాగ్రత్తలు కూడా ఏవీ చేపట్టలేదని వెల్ల డించారు. నిర్లక్ష్యంతో వ్యవహరించారన్నది స్పష్టమైంది. ఇదిలా ఉంటే గోదాము నిర్మాణానికి సంబంధించి సీఆర్డీఏకు ప్రతిపాదనలు పంపారు. అయితే గోదాము నిర్మాణం అనంతరం ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ను ఆ సంస్థలు పొందలేదు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌తోనే ఉత్పత్తులను గోదాములో భద్రపరచటానికి అవకాశం ఉంది. ఈ సర్టిఫికెట్ లేకుండా గోదామును ప్రారంభించి అందులో సరుకు నిల్వ చేయటం నిబంధనలకు విరుద్ధం. గోదాముకు అతి సమీపంలో రెండు అపార్టుమెంట్లలో పలువురు ప్రజలు నివాసం ఉంటున్నారు. గోదాము ఏర్పాటుకు సంబంధించి ఎన్వోసీ కూడా పంచాయతీ నుంచి తీసుకోలేదు. సీఆర్డీఏ సర్టిఫికెట్ అనంతరం ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఆ సర్టిఫికెట్ రాలేదని, పలుమార్లు కబురు పంపినా స్పందన లేదని పంచాయతీ పూర్వ కార్యదర్శి లక్ష్మీ శివకృష్ణ ‘సాక్షి’కి తెలిపారు. కారణాలు తెలపని వైనం.. ఇదిలా ఉంటే బ్రిటానియా సంస్థ మాత్రం రూ.4 కోట్లు విలువైన సరుకు ప్రమాదంలో దగ్ధమైందని అగ్నిమాపక శాఖ అధికారులకు స్పష్టం చేసింది. అయితే ప్రమాదం ఎలా జరిగింది? అందుకు గల కారణాలు ఏంటి? అన్నది నేటికీ తేలలేదు. విద్యుత్ షార్టు సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని తొలుత ప్రచారం జరిగింది. అయితే ప్రమాదం జరిగిన ముందు రోజు రాత్రి గోదాములో వెల్డింగ్ పనులు జరిగాయని, అందులో ఏవైనా నిప్పురవ్వలు పడటంతో అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై విచారణ సాగిస్తున్నట్లు అగ్నిమాపక శాఖ చెబుతోంది. అయితే పోలీసు శాఖ నుంచి ఎఫ్ఐఆర్ నమోదై, తద్వారా అగ్నిమాపక శాఖకు నివేదిక చేరాలి. నేటి వరకూ కంకిపాడు పోలీసు స్టేషన్లో ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. సంబంధిత ప్రతినిధులు పోలీసు స్టేషన్‌కు వచ్చి సరుకు నిల్వ, ప్రమాదంపై స్పష్టమైన ఫిర్యాదు ఇవ్వలేదని పోలీసు శాఖ చెబుతోంది. అయితే అగ్నిమాపక అధికారులు మాత్రం పోలీసు శాఖను ఆశ్రయించారని, వారం రోజుల్లో నివేదిక వస్తుందని, తద్వారా ప్రమాదంపై స్పష్టమైన వివరణ ఇస్తామని చెబుతున్నారు. ఈ రెండు శాఖల నడుమ వ్యక్తమవుతున్న వేర్వేరు ప్రకటనలు మొత్తంగా అగ్ని ప్రమాదం అంశంపై అనుమానాలు వ్యక్తం అయ్యేలా చేస్తున్నాయి. అగ్ని ప్రమాదంలో గోదాము, అందులో నిల్వ చేసిన సరుకు మాత్రమే కాలిపోయాయి. అదే గోదాములో కానీ, పక్కనే ఉన్న అపార్టుమెంటు వాసులకు పొగ వల్ల ఏదైనా ప్రమాదం వాటిల్లితే దానికి బాధ్యులు ఎవరు?, చర్యలు ఏం తీసుకునేవారు? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై ఎస్ఐ షరీఫ్‌ను వివరణ కోరగా ప్రమాదం జరగ్గానే గోదాము వద్దకు వెళితే అక్కడ సిబ్బంది నుంచి సహకారం అందలేదన్నారు. తర్వాత స్టేషన్‌కు వచ్చి స్పష్టమైన ఫిర్యాదు చేయలేదన్నారు. పూర్తి వివరాలతో ఫిర్యాదు ఇవ్వమని సూచించామని, నేటికీ ఫిర్యాదు తమకు అందలేదని వివరించారు. -
బిస్కెట్ల గోదాములో అగ్నిప్రమాదం
సాక్షి, కంకిపాడు(కృష్ణా) : అగ్నికీలల ధాటికి సర్వం బూడిదైంది. కోట్ల రూపాయల ఆస్తి అగ్నికి అర్పణమైంది. మండలంలోని ప్రొద్దుటూరు శివారు కొణతనపాడు అడ్డరోడ్డు సమీపంలోని బిస్కెట్ గోదాములో శనివారం తెల్లవారుఝామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో రూ.4కోట్లుపైగా ఆస్తినష్టం వాటిల్లి ఉండొచ్చని అంచనా. వివరాల్లోకి వెళితే...కొణతనపాడు పరిధిలోని పంట పొలాల్లో జాతీయ రహదారి వెంబడి శ్రీ వీవీఎన్‌ఎస్ లాజిస్టిక్స్ ప్రైవేటు లిమిటెడ్‌కు సంబంధించిన గోదాములు ఉన్నాయి. ఇందులో బ్రిటానియా ఇండస్ట్రీస్, బ్రిటానియా డైరీ నడుస్తున్నాయి. బ్రిటానియా ఉత్పత్తులను ఈ గోదాములో భద్రపరుస్తారు. ఈ ఏడాది మే ఆఖరున గోదామును ప్రారంభించి ఆ సంస్థకు చెందిన ఉత్పత్తులను గోదాములో నిల్వ చేస్తున్నారు. అర్ధరాత్రి ప్రమాదం... శుక్రవారం రాత్రి 7.30 గంటలు దాటాక కార్మికులు గోదాము షట్టర్లు దించి తాళాలు వేశారు. అర్ధ రాత్రి దాటాక గోదాములో మంటలు చెలరేగాయి. స్థానికంగా విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సిబ్బంది ప్రమాదాన్ని గుర్తించి సమీపంలో ఉన్న అపార్టుమెంటులో నివాసం ఉంటున్న కంప్యూటరు విభాగం సిబ్బందికి తెలిపారు. విషయం తెలుసుకున్న కంకిపాడు పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. గోదామును మంటలు చుట్టుముట్టాయి. ఎగిసిపడుతున్న మంటలు, బిస్కెట్లు«, ప్లాస్టిక్ దగ్ధమై నల్లని పొగ వెలువడింది. ఆరు ఫైర్ఇంజిన్ల ద్వారా అదుపు వ్యాపిస్తున్న మంటలను అదుపుచేసేందుకు అగ్నిమాపక శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఆ శాఖ డైరెక్టర్ కె.జయరాం నాయక్, డీఎఫ్ఓ అవినాష్ జయసింహ, అసిస్టెంట్ డీఎఫ్ఓ అమర్లపూడి శేఖర్ల పర్యవేక్షణలో ఉయ్యూరు, ఆటోనగర్, విజయవాడ మెయిన్, గుడివాడ, పామర్రు, గన్నవరం ప్రాంతాలకు చెందిన అగ్ని మాపక వాహనాలు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపుచేసేందుకు యత్నించాయి. అయితే గోదాములో సరుకు నిల్వ చేసిన తరువాత చుట్టూ ఉన్న షట్టర్లకు తాళాలు వేశారు. మంటలు వ్యాపించటంతో షట్టర్ల తాళాలు తీయటం సాధ్యం కాలేదు. దీనికి తోడు ఎగిసిపడ్డ మంటలతో గోదాము పైకప్పు కమురుకుపోయి కూలిపోయింది. ఇనుప గడ్డర్లు సైతం ధ్వంసం అయ్యాయి. దీంతో గోదాము లోపల ఉన్న బిస్కెట్ బాక్సులుదగ్ధం కాకుండా నిరోధించటం సాథ్యం కాలేదు. తెల్లవారుఝామున 6 గంటలు దాటాక పొక్లెయిన్ సహాయంతో గోదాము గోడలను ధ్వంసం చేసి షట్టర్లను తొలగించటంతో అగ్నిమాపకసిబ్బంది మంటలను అదుపు చేయటానికి వీలు ఏర్పడింది. ప్రమాద కారణాలపై విచారణ గోదాములో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవటంపై అగ్నిమాపక శాఖ విచారణ చేపట్టింది. విద్యుత్ షార్టు సర్క్యూటే ప్రమాదానికి కారణం అయి ఉంటుందన్న భావన వినిపిస్తుంది. అయితే శుక్రవారం రాత్రి వెల్డింగ్ పనులు గోదాములో జరిగాయని, పనులు పూర్తయ్యాక షట్టర్లు మూశారని తెలుస్తుంది. ఈ క్రమంలో ఏదైనా నిప్పు రవ్వలు బిస్కెట్ నిల్వలపై పడి క్రమేపీ రాజుకుని ప్రమాదం చోటుచేసుకుందా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గోదాము, అందులో నిల్వ ఉంచిన సరుకు సుమారుగా రూ.4 కోట్లపైగా నష్టం జరిగి ఉంటుందని అందులో పనిచేసే ఉద్యోగి ఒకరు చెప్పారు. కారణాలు, నష్టంపై వివరాలు సేకరిస్తున్నారు. నిర్లక్ష్యమే కొంప ముంచిందా ? నిర్లక్ష్యం కొంప ముంచిందా? అంటే అవుననే అంటున్నారు అగ్నిమాపక శాఖ సిబ్బంది. గోదామును నిర్మించి ఈ ఏడాది మేలో ప్రారంభించారు. ఇంకా గోదాము విస్తరణ, వసతుల కల్పన పనులకు వెల్డిండ్ పనులు చేపట్టారు. గోదాము నిర్వహణపై సీఆర్డీఏ పరిశీలన కూడా మరో రెండు రోజుల్లో జరగాల్సి ఉంది. ఇది పూర్తికాకుండానే ప్రమాదంలో గోదాము దగ్ధమైంది. అగ్నిమాపక శాఖ నుంచి ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్తలు లేవని గుర్తించారు. ఆ శాఖ నుంచి అనుమతులు లేవని స్వయానా ఆ శాఖ డైరెక్టర్ జయరాం నాయక్, అసిస్టెంట్ డీఎఫ్ఓ శేఖర్లు వెల్లడించారు. దీన్ని బట్టి ప్రమాద తీవ్రత నివారణ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ప్రమాదం తీరుపై విచారణ సాగిస్తామని అధికారులు తెలియజేశారు. స్థానికుల ఆందోళన నివాస ప్రాంతాల నడుమ ఏర్పాటుచేసిన గోదాములో సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవటంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అర్థరాత్రి ఎగిసిపడ్డ మంటలను చూసి గోదాము సమీపంలో ఉన్న మూడు అపార్టుమెంట్లు, ఓ ప్రైవేటు కళాశాల వసతిగృహంలో విద్యార్థులు భీతిల్లారు. అగ్ని ప్రమాద నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే అగ్నిమాపక సిబ్బంది చొరవతో మంటలు అదుపులోకి రావటంతో వారంతా ఊపిరిపీల్చుకున్నారు. -
హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని బైరామల్‌గూడలో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. వివరాలు.. బైరామగూడలోని ఓ బిస్కెట్ గోడౌన్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఎగసిపడుతున్న మంటలను ఆర్పుతున్నారు. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. -
బిస్కెట్ హౌస్
‘కాదేదీ కవితకనర్హం’ అన్నారు శ్రీశ్రీ. కాదేదీ కట్టడానికనర్హం అంటున్నాడు చెఫ్ అడ్డెట్ల మహేష్. బిస్కెట్లతో ఆయన రూపొందించిన గృహ నమూనా అందరికీ నోరూరిస్తోంది. మహేష్ గచ్చిబౌలిలోని డాక్టర్ వైఎస్సార్ నిథమ్ స్కూల్ ఆఫ్ హాస్పిటాలిటీ విభాగంలో చెఫ్. దీని కోసం మొదట బటర్, మైదా, కోకో పౌడర్, జింజర్ పౌడర్, లిక్విడ్ గ్లూకోజ్‌తో జింజిర్ బిస్కెట్లను తయారు చేశాడు. ఐసింగ్ షుగర్, లెమన్ జూస్, కోడిగుడ్డు తెల్ల సొనతో బిస్కెట్లను అతికించేందుకు క్రీమ్‌ను సిద్ధం చేశాడు. ఈ క్రీమ్‌ను ఉపయోగించి ఒక్కో బిస్కెట్‌ను అతికించి ఇలా ఓ అందమైన ఇంటిని రూపొందించాడు. ఒక హాలు.. దాని ముందు ఇరువైపులా పోర్టికోలను ఏర్పాటు చేశాడు. దీంతోపాటు వంటగదిపై పొగ గొట్టాన్ని కూడా అమర్చాడు. దీనికి ‘జింజిర్ బ్రెడ్ హౌస్’గా నామకరణం చేశాడు. ఇది చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తయారీకి రెండు రోజులు పట్టిందని మహేష్ చెప్పాడు. - రాయదుర్గం