ఎన్నో ప్రశ్నలు... మరెన్నో అనుమానాలు! | Biscuit Factory Fire Accident In Kankipadu | Sakshi
Sakshi News home page

ఎన్నో ప్రశ్నలూ... మరెన్నో అనుమానాలూ!

Published Sun, Aug 11 2019 12:13 PM | Last Updated on Sun, Aug 11 2019 12:13 PM

Biscuit Factory Fire Accident In Kankipadu - Sakshi

కంకిపాడు వద్ద అగ్ని ప్రమాదానికి గురైన గోదాము (ఫైల్‌) 

సాక్షి, కంకిపాడు (కృష్ణా) : గోదాము అగ్ని ప్రమాదం వ్యవహారంపై ఇంకా స్పష్టత లేదు. ప్రమాదంలో జరిగిన నష్టం ఎంత?, ప్రమాదానికి గల కారణాలు? ఏవీ తేలలేదు. అగ్నిమాపక శాఖకు పోలీసు శాఖ నుంచి నివేదిక చేరలేదు. పోలీసు శాఖకు బాధితులు స్పష్టమైన ఫిర్యాదు ఇవ్వలేదు. దీంతో విచారణ ఎంత వరకూ వచ్చిందంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే.. అన్న చందంగా ఉంది. వివరాల్లోకి వెళితే...

మండలంలోని ప్రొద్దుటూరు శివారు కొణతనపాడులో బ్రిటానియా ఇండస్ట్రీస్, బ్రిటానియా డెయిరీలు శ్రీ వీవీఎన్‌ఎస్‌ లాజిస్టిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో నడుస్తున్నాయి. గత మే ఆఖరులో అందుబాటులోకి వచ్చిన ఈ గోదాములో బ్రి టానియా సంస్థ ఉత్పత్తులను నిల్వ చేశారు. ఈనెల 3వ తేదీ తెల్లవారుజామున గోదాము అగ్నిప్రమాదానికి గురైంది. సెక్యూరిటీ సిబ్బంది ప్రమాదాన్ని గుర్తించి కంపెనీ ప్రతినిధులు, అగ్నిమాపక శాఖకు సమాచారం తెలిపే లోపే మంటలు గోదామును చుట్టుముట్టాయి. గోదా ము పూర్తిగా కాలిపోయింది. అందులో నిల్వ ఉంచిన బ్రిటానియా ఉత్పత్తులు మసయ్యాయి. 

తేలని విచారణ..
ప్రమాదంలో రూ.4 కోట్లకుపైగా నష్టం వాటిల్లి ఉంటుందని ప్రాథమిక అంచనా. అయితే దీనిపై స్పష్టత లేదు. గోదాము ప్రాంగణాన్ని ఆ శాఖ డైరెక్టర్‌ జయరాం నాయక్, జిల్లా అగ్నిమాపక అధికారి అవినాష్‌ జయసింహ, ఇతర సిబ్బంది సందర్శించారు. అగ్నిమాపక శాఖ నుంచి ఎలాంటి అనుమతులు పొందలేదని డైరెక్టర్‌ జయరాం నాయక్‌ వెల్లడించారు. దీంతో పాటుగా అగ్నిప్రమాద నివారణకు ముందస్తు జాగ్రత్తలు కూడా ఏవీ చేపట్టలేదని వెల్ల డించారు. నిర్లక్ష్యంతో వ్యవహరించారన్నది స్పష్టమైంది. ఇదిలా ఉంటే గోదాము నిర్మాణానికి సంబంధించి సీఆర్‌డీఏకు ప్రతిపాదనలు పంపారు. అయితే గోదాము నిర్మాణం అనంతరం ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ను ఆ సంస్థలు పొందలేదు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌తోనే ఉత్పత్తులను గోదాములో భద్రపరచటానికి అవకాశం ఉంది.

ఈ సర్టిఫికెట్‌ లేకుండా గోదామును ప్రారంభించి అందులో సరుకు నిల్వ చేయటం నిబంధనలకు విరుద్ధం. గోదాముకు అతి సమీపంలో రెండు అపార్టుమెంట్లలో పలువురు ప్రజలు నివాసం ఉంటున్నారు. గోదాము ఏర్పాటుకు సంబంధించి ఎన్‌వోసీ కూడా పంచాయతీ నుంచి తీసుకోలేదు. సీఆర్‌డీఏ సర్టిఫికెట్‌ అనంతరం ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఆ సర్టిఫికెట్‌ రాలేదని, పలుమార్లు కబురు పంపినా స్పందన లేదని పంచాయతీ పూర్వ కార్యదర్శి లక్ష్మీ శివకృష్ణ ‘సాక్షి’కి తెలిపారు. 

కారణాలు తెలపని వైనం..
ఇదిలా ఉంటే బ్రిటానియా సంస్థ మాత్రం రూ.4 కోట్లు విలువైన సరుకు ప్రమాదంలో దగ్ధమైందని అగ్నిమాపక శాఖ అధికారులకు స్పష్టం చేసింది. అయితే ప్రమాదం ఎలా జరిగింది? అందుకు గల కారణాలు ఏంటి? అన్నది నేటికీ తేలలేదు. విద్యుత్‌ షార్టు సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం జరిగిందని తొలుత ప్రచారం జరిగింది. అయితే ప్రమాదం జరిగిన ముందు రోజు రాత్రి గోదాములో వెల్డింగ్‌ పనులు జరిగాయని, అందులో ఏవైనా నిప్పురవ్వలు పడటంతో అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 

ఈ వ్యవహారంపై విచారణ సాగిస్తున్నట్లు అగ్నిమాపక శాఖ చెబుతోంది. అయితే పోలీసు శాఖ నుంచి ఎఫ్‌ఐఆర్‌ నమోదై, తద్వారా అగ్నిమాపక శాఖకు నివేదిక చేరాలి. నేటి వరకూ కంకిపాడు పోలీసు స్టేషన్‌లో ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాలేదు. సంబంధిత ప్రతినిధులు పోలీసు స్టేషన్‌కు వచ్చి సరుకు నిల్వ, ప్రమాదంపై స్పష్టమైన ఫిర్యాదు ఇవ్వలేదని పోలీసు శాఖ చెబుతోంది. అయితే అగ్నిమాపక అధికారులు మాత్రం పోలీసు శాఖను ఆశ్రయించారని, వారం రోజుల్లో నివేదిక వస్తుందని, తద్వారా ప్రమాదంపై స్పష్టమైన వివరణ ఇస్తామని చెబుతున్నారు. ఈ రెండు శాఖల నడుమ వ్యక్తమవుతున్న వేర్వేరు ప్రకటనలు మొత్తంగా అగ్ని ప్రమాదం అంశంపై అనుమానాలు వ్యక్తం అయ్యేలా చేస్తున్నాయి.

అగ్ని ప్రమాదంలో గోదాము, అందులో నిల్వ చేసిన సరుకు మాత్రమే కాలిపోయాయి. అదే గోదాములో కానీ, పక్కనే ఉన్న అపార్టుమెంటు వాసులకు పొగ వల్ల ఏదైనా ప్రమాదం వాటిల్లితే దానికి బాధ్యులు ఎవరు?, చర్యలు ఏం తీసుకునేవారు? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై ఎస్‌ఐ షరీఫ్‌ను వివరణ కోరగా ప్రమాదం జరగ్గానే గోదాము వద్దకు వెళితే అక్కడ సిబ్బంది నుంచి సహకారం అందలేదన్నారు. తర్వాత స్టేషన్‌కు వచ్చి స్పష్టమైన ఫిర్యాదు చేయలేదన్నారు. పూర్తి వివరాలతో ఫిర్యాదు ఇవ్వమని సూచించామని, నేటికీ ఫిర్యాదు తమకు అందలేదని వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement