బిస్కెట్ల గోదాములో అగ్నిప్రమాదం | Big Fire Accident In Biscuit Factory In kankipadu | Sakshi
Sakshi News home page

బిస్కెట్ల గోదాములో అగ్నిప్రమాదం

Published Sun, Aug 4 2019 11:02 AM | Last Updated on Sun, Aug 4 2019 11:02 AM

Big Fire Accident In Biscuit Factory In kankipadu - Sakshi

గోదాములో అర్ధరాత్రి ఎగిసిపడుతున్న మంటలు, మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది 

సాక్షి, కంకిపాడు(కృష్ణా) : అగ్నికీలల ధాటికి సర్వం బూడిదైంది. కోట్ల రూపాయల ఆస్తి అగ్నికి అర్పణమైంది. మండలంలోని ప్రొద్దుటూరు శివారు కొణతనపాడు అడ్డరోడ్డు సమీపంలోని బిస్కెట్‌ గోదాములో శనివారం తెల్లవారుఝామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో రూ.4కోట్లుపైగా ఆస్తినష్టం వాటిల్లి ఉండొచ్చని అంచనా. వివరాల్లోకి వెళితే...కొణతనపాడు పరిధిలోని పంట పొలాల్లో జాతీయ రహదారి వెంబడి శ్రీ వీవీఎన్‌ఎస్‌ లాజిస్టిక్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌కు సంబంధించిన గోదాములు ఉన్నాయి. ఇందులో బ్రిటానియా ఇండస్ట్రీస్, బ్రిటానియా డైరీ నడుస్తున్నాయి. బ్రిటానియా ఉత్పత్తులను ఈ గోదాములో భద్రపరుస్తారు. ఈ ఏడాది మే ఆఖరున గోదామును ప్రారంభించి ఆ సంస్థకు చెందిన ఉత్పత్తులను గోదాములో నిల్వ చేస్తున్నారు. 

అర్ధరాత్రి ప్రమాదం... 
శుక్రవారం రాత్రి 7.30 గంటలు దాటాక కార్మికులు గోదాము షట్టర్లు దించి తాళాలు వేశారు. అర్ధ రాత్రి దాటాక గోదాములో మంటలు చెలరేగాయి. స్థానికంగా విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సిబ్బంది ప్రమాదాన్ని గుర్తించి సమీపంలో ఉన్న అపార్టుమెంటులో నివాసం ఉంటున్న కంప్యూటరు విభాగం సిబ్బందికి తెలిపారు. విషయం తెలుసుకున్న కంకిపాడు పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. గోదామును మంటలు చుట్టుముట్టాయి. ఎగిసిపడుతున్న మంటలు, బిస్కెట్‌లు«, ప్లాస్టిక్‌ దగ్ధమై నల్లని పొగ వెలువడింది. 

ఆరు ఫైర్‌ఇంజిన్ల ద్వారా అదుపు
వ్యాపిస్తున్న మంటలను అదుపుచేసేందుకు అగ్నిమాపక శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఆ శాఖ డైరెక్టర్‌ కె.జయరాం నాయక్, డీఎఫ్‌ఓ అవినాష్‌ జయసింహ, అసిస్టెంట్‌ డీఎఫ్‌ఓ అమర్లపూడి శేఖర్‌ల పర్యవేక్షణలో ఉయ్యూరు, ఆటోనగర్, విజయవాడ మెయిన్, గుడివాడ, పామర్రు, గన్నవరం ప్రాంతాలకు చెందిన అగ్ని మాపక వాహనాలు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపుచేసేందుకు యత్నించాయి. అయితే గోదాములో సరుకు నిల్వ చేసిన తరువాత చుట్టూ ఉన్న షట్టర్లకు తాళాలు వేశారు. మంటలు వ్యాపించటంతో షట్టర్ల తాళాలు తీయటం సాధ్యం కాలేదు. దీనికి తోడు ఎగిసిపడ్డ మంటలతో గోదాము పైకప్పు కమురుకుపోయి కూలిపోయింది. ఇనుప గడ్డర్లు సైతం ధ్వంసం అయ్యాయి. దీంతో గోదాము లోపల ఉన్న బిస్కెట్‌ బాక్సులుదగ్ధం కాకుండా నిరోధించటం సాథ్యం కాలేదు. తెల్లవారుఝామున 6 గంటలు దాటాక పొక్లెయిన్‌ సహాయంతో గోదాము గోడలను ధ్వంసం చేసి షట్టర్లను తొలగించటంతో అగ్నిమాపకసిబ్బంది మంటలను అదుపు చేయటానికి వీలు ఏర్పడింది. 

ప్రమాద కారణాలపై విచారణ
గోదాములో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవటంపై అగ్నిమాపక శాఖ విచారణ చేపట్టింది. విద్యుత్‌ షార్టు సర్క్యూటే ప్రమాదానికి కారణం అయి ఉంటుందన్న భావన వినిపిస్తుంది. అయితే శుక్రవారం రాత్రి వెల్డింగ్‌ పనులు గోదాములో జరిగాయని, పనులు పూర్తయ్యాక షట్టర్లు మూశారని తెలుస్తుంది. ఈ క్రమంలో ఏదైనా నిప్పు రవ్వలు బిస్కెట్‌ నిల్వలపై పడి క్రమేపీ రాజుకుని ప్రమాదం చోటుచేసుకుందా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గోదాము, అందులో నిల్వ ఉంచిన సరుకు సుమారుగా రూ.4 కోట్లపైగా నష్టం జరిగి ఉంటుందని అందులో పనిచేసే ఉద్యోగి ఒకరు చెప్పారు. కారణాలు, నష్టంపై వివరాలు సేకరిస్తున్నారు. 

నిర్లక్ష్యమే కొంప ముంచిందా ?
నిర్లక్ష్యం కొంప ముంచిందా? అంటే అవుననే అంటున్నారు అగ్నిమాపక శాఖ సిబ్బంది. గోదామును నిర్మించి ఈ ఏడాది మేలో ప్రారంభించారు. ఇంకా గోదాము విస్తరణ, వసతుల కల్పన పనులకు వెల్డిండ్‌ పనులు చేపట్టారు. గోదాము నిర్వహణపై సీఆర్‌డీఏ పరిశీలన కూడా మరో రెండు రోజుల్లో జరగాల్సి ఉంది. ఇది పూర్తికాకుండానే ప్రమాదంలో గోదాము దగ్ధమైంది. అగ్నిమాపక శాఖ నుంచి ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్తలు లేవని గుర్తించారు. ఆ శాఖ నుంచి అనుమతులు లేవని స్వయానా ఆ శాఖ డైరెక్టర్‌ జయరాం నాయక్, అసిస్టెంట్‌ డీఎఫ్‌ఓ శేఖర్‌లు వెల్లడించారు. దీన్ని బట్టి ప్రమాద తీవ్రత నివారణ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ప్రమాదం తీరుపై విచారణ సాగిస్తామని అధికారులు తెలియజేశారు. 

స్థానికుల ఆందోళన 
నివాస ప్రాంతాల నడుమ ఏర్పాటుచేసిన గోదాములో సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవటంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అర్థరాత్రి ఎగిసిపడ్డ మంటలను చూసి గోదాము సమీపంలో ఉన్న మూడు అపార్టుమెంట్లు, ఓ ప్రైవేటు కళాశాల వసతిగృహంలో విద్యార్థులు భీతిల్లారు. అగ్ని ప్రమాద నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే అగ్నిమాపక సిబ్బంది చొరవతో మంటలు అదుపులోకి రావటంతో వారంతా ఊపిరిపీల్చుకున్నారు.       

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement