బీవీజీ కాంట్రాక్ట్ రద్దుకు సభ్యుల డిమాండ్
బెంగళూరు, న్యూస్‌లైన్ : బృహత్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ) పరిధిలో చెత్త తొలగించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బీవీజీ కంపెనీని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలంటూ పాలికె కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. బుధవారం ఉదయం బీబీఎంపీ సర్వసభ్య సమావేశంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సమావేశం ప్రారంభం కాగానే సీనియర్ కార్పొరేటర్ సి.కె.రామ్మూర్తి సహా పలువురు కార్పొరేటర్లు నగరంలో చెత్త పేరుకుపోవడంపై మండిపడ్డారు.
చెత్త తొలగింపుల కాంట్రాక్ట్ తీసుకున్న బీవీజీ సంస్థ వైఖరి వల్ల బెంగళూరుకి చెడ్డపేరు వస్తోందని అసహనం వ్యక్తం చేశారు. గతంలో కూడా ఈ సంస్థ ఇలాగే ప్రవర్తిస్తే కాంట్రాక్ట్‌ను అప్పటి మేయర్ ఎస్.కె.నాగరాజు రద్దు చేశారని గుర్తు చేశారు. మళ్లీ అదే కంపెనీకి కాంట్రాక్ట్‌ను అప్పగించి నగర ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడడం సరికాదని హితవు పలికారు.
కార్పొరేటర్ యశోద కృష్ణప్ప మాట్లాడుతూ... తన వార్డులో చెత్త తొలగించడం లేదని స్వయంగా తానే ధర్నా చేసినా బీవీజీ ప్రతినిధులు స్పందించలేదని ఆరోపించారు. వెంటనే సంస్థ కాంట్రాక్ట్‌ను రద్దు చేయాలని ఈ సందర్భంగా పలువురు కార్పొరేటర్లు మూకుమ్మడిగా డిమాండ్ చేశారు. ఇదే సందర్భంగా బీబీఎంపీలో ఖాళీగా ఉన్న నాలుగు వేల పారిశుద్ధ కార్మికుల ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని కోరారు.
అనంతరం కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు మాట్లాడుతూ... ప్రజా సమస్యలు పరిష్కరించలేని ఈ బీజేపీ పాలన ఉన్నా, లేకున్నా ఒక్కటే నని ఎద్దేవా చేశారు. కేవలం అధికారం కోసం బీజేపీ నేతలు పాకులాడుతున్నారని దుయ్యబట్టారు. సమావేశం ప్రారంభంలో మాజీ మంత్రి, దివంగత ఎ.కృష్ణప్పకు సభ్యులు నివాళులర్పించారు.