తెలంగాణ వచ్చే వరకూ అప్రమత్తంగా ఉండాలి
కేయూ క్యాంపస్, నూస్లైన్ : తెలంగాణ వనరులను వదులుకునేందుకు సిద్ధంగా లేని సీమాంధ్ర పెట్టుబడిదారులు, రాజకీయ పార్టీల నేతలు రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు అనేక కుట్రలు పన్నుతున్నారని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. ఈ నేపథ్యంలో సంపూర్ణ తెలంగాణ సాధించే వరకు ప్రజలందరూ అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరముందని ఆయన పేర్కొన్నారు. దివంగత ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్‌రావు మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ ప్రాసెస్ - ఇష్యూస్ అండ్ సొల్యూషన్స్’ అంశంపై కాకతీయ యూనివర్సిటీలోని సెనేట్హాల్లో శుక్రవారం సదస్సు ఏర్పాటుచేశారు. ఈ సదస్సు ముగింపు సభలో కోదండరాం ముఖ్యఅతిథిగా మాట్లాడారు.
తెలంగాణ ఉద్యమం విభిన్నమైనది..
1956వ సంవత్సరం తరువాత భాషా ప్రాతిపదిక రాష్ట్రాల ఏర్పాటు జరిగినా.. తెలంగాణ ఉద్యమం మాత్రం దోపిడీ, ఆధిపత్యానికి వ్యతి రేకంగా జరుగుతున్న.. అస్తిత్వ, ఆత్మగౌరవ పోరాటమని కోదండరాం అభివర్ణించారు. ఎ న్నో ఏళ్ల పోరాట ఫలితంగా తెలంగాణ ఏర్పడుతున్న తరుణంలో అడ్డుకునేందుకు యత్నిస్తున్న కొందరు.. అది సాధ్యం కాని పక్షంలో హైదరాబాద్‌లో ప్రత్యేక రక్షణ కావాలనే అంశాన్ని తెరపైకి తెచ్చారన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఇప్పటి వరకు పాల్గొన్న వారిపై వేల సంఖ్యలో కేసులు ఉండగా, సీమాంధ్రులపై మాత్రం కేసులు లేవన్నారు. అలాంటప్పుడు వారికి ఇంకా ఏం రక్షణ కావాలని ఆయన ప్రశ్నిం చారు. ఫెడరల్ వ్యవస్థలో రాజ్యాంగబద్దంగా రాష్ట్ర ఏర్పాటు జరుగుతుందని, ఆ స్ఫూర్తికి భి న్నంగా శాంతిభద్రతలను కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవాలంటూ సీమాంధ్రు లు చేస్తున్న డిమాండ్‌లో అర్థం లేదన్నారు. అధికారం అనేది సమష్టి ప్రయోజనాలను నెరవేర్చేదిగా ఉండాలే తప్ప ప్రత్యేకంగా రక్షణ కావాలని కోరడం సరికాదని ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు.
అన్యాయం జరిగింది తెలంగాణ ప్రజలకే...
ఇప్పటివరకు తెలంగాణ ప్రజలను అనేక రకాలుగా దోపిడీ చేసిన సీమాంధ్రులు.. ప్రస్తుతం సమన్యాయం లేకుండా విభజన జరుగుతోందని అసత్య ప్రచారం చేస్తున్నారని కోదండరాం ఆరోపించారు. గతంలో అన్ని పార్టీల వారు తెలంగాణకు అనుకూలంగా అభిప్రాయం చెప్పి ఇప్పుడు మాట మార్చారని విమర్శించారు. కాగా, రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టడంలో భాగంగా సందర్భానుసారంగా ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఎలక్ట్రిసిటీ జేఏసీ చైర్మన్ రఘు మా ట్లాడుతూ తెలంంగాణ ప్రాంతానికి న్యాయం గా రావాల్సిన విద్యుత్ వాటా 56 శాతం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి తాము నివేదించినట్లుగా వాటా రాని పక్షంలో ఇబ్బందులు ఎదురవుతాయన్నా రు.
ఈ మేరకు విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సదస్సులో తెలంగాణ జేఏసీ జిల్లా చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి, కేయూ ప్రొఫెసర్ సీతారామారావు, టీవీ వీ అధ్యక్షుడు శ్రీధర్దేశ్ పాండే, నల్సార్ యూ నివర్సిటీ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్, టీవీవీ జనరల్ సెక్రటరీ పిట్టల రవీందర్, ప్రొఫెసర్ రేవతి, ప్రొఫెసర్ హరినాథబాబు, అరుణ్‌కుమార్, ఓయూ రిటైర్డ్ ప్రొఫెసర్ రమా మెల్కొ టే, ప్రొఫెసర్ హరినాథ్‌బాబు, సంతోష్కుమా ర్, తెలంగాణ జేఏసీ జిల్లా చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి, ప్రొఫెసర్ నరేంద్రబాబు, ప్రొఫెసర్ రాంనాథ్కిషన్, ప్రొఫెసర్ సీతారాంనాయక్, డాక్టర్ జి.వీరన్న పాల్గొన్నారు.