తాండూరులో వింత శిశువు జననం
తాండూరు టౌన్, న్యూస్‌లైన్: తాండూరు మండల పరిధిలో ఓ వింత శిశువు జన్మించాడు. పొట్ట బయటే కాలేయం, పేగు భాగాలు ఉన్నాయి. ఈ సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. బాధితురాలి కుటుంబీకులు, వైద్యుల కథనం ప్రకారం.. తాండూరు మండలంలోని రుక్మాపూర్‌కు చెందిన బ్యాగరి నాగప్ప, సువర్ణ దంపతులు. రెండున్నరేళ్ల క్రితం మొదటి కాన్పులో సువర్ణ ఓ బాబుకు జన్మనిచ్చింది. రెండో కాన్పు కోసం సువర్ణ ఇటీవల పుట్టిల్లు చిట్టి ఘనాపూర్‌కు వచ్చింది. ఆమె గర్భంలో ఉన్న శిశువుకు నెలలు పూర్తిగా నిండలేదు. 8 నెలలు ఉండగానే శుక్రవారం తెల్లవారుజామున సువర్ణ సాధారణ ప్రసవంలో బాబుకు జన్మనిచ్చింది. కాగా పుట్టిన శిశువు కాలేయం, పేగు భాగాలు పొట్ట బయటే ఉన్నాయి. దీంతో ఆందోళనకు గురైన కుటుంబీకులు వెంటనే తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ైవె ద్యులు శిశువుకు ప్రాథమిక వైద్యం చేసి మెరుగైన చికిత్స కోసం నగరానికి తీసుకెళ్లాలని సూచించారు.
అరుదైన సంఘటన..
శిశువు కాలేయం, పేగు భాగాలు పొట్టబయటే ఉండి జన్మించడం చాలా అరుదైన సంఘటన అని జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ వెంకటరమణప్ప తెలిపారు. శిశువు పూర్తిగా నెలలు నిండక ముందే పుట్టడంతో పిండం సరిగా ఎదగక ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉందన్నారు. దీంతోపాటు మేనరిక వివాహాలు, శిశువు గర్భంలో ఉన్న సమయంలో గర్భిణులు తీసుకున్న కొన్ని రకాల మందుల వల్ల కూడా ఇలా జరిగే ఆస్కారం ఉంది. శిశువుకు ఆపరేషన్ చేసి బయట ఉన్న భాగాలను పొట్టలో అమర్చవచ్చు. కాగా శిశువు బతికే అవకాశం తక్కువగా ఉందని సూపరింటెండెంట్ పేర్కొన్నారు.