BJLP leader
-
బీజేఎల్పీ నేత ఎవరు?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ శాసనసభాపక్షనేత ఎన్నికపై ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. శాసనసభ బడ్జెట్ సమావేశాలు దగ్గరపడుతున్నా, బీజేపీ నేతలు ఎటూ తేల్చలేకపోతున్నారు. గత డిసెంబర్లోనే కేంద్రహోంమంత్రి అమిత్‌షా రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడే బీజేఎల్పీ నేత ఎన్నిక ప్రక్రియ పూర్తవుతుందని అంతా భావించారు. అయితే అప్పుడు తగిన సమయం లేకపోవడంతో తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కొద్దిరోజులకు బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి తరుణ్‌చుగ్ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర నేతలు ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయసేకరణ నిర్వహించారు. ఢిల్లీలో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చర్చించాక బీజేఎల్పీ నేతను ప్రకటిస్తామన్నారు. ఇది జరిగి కొద్దిరోజులు గడుస్తున్నా బీజేఎల్పీనేత ఎవరన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నెల 8వ తేదీ నుంచి రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో బీజేఎల్పీనేతగా ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై రాజకీయంగా, పార్టీలో చర్చనీయాంశమవుతోంది. శాసనసభ కార్యకలాపాలపై అవగాహన, వివిధ అంశాలపై విషయ పరిజ్ఞానం, రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, అసెంబ్లీ వేదికపై చోటుచేసుకునే ఆయా పరిణామాలకు తగ్గట్టుగా చురుగ్గా స్పందించగలిగే వారికి ఈ బాధ్యతలు అప్పగించాలనే అభిప్రాయంతో పార్టీ నేతలున్నట్టు సమాచారం. ► వరుసగా మూడుసార్లు గెలవడంతోపాటు నగరం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యే టి.రాజాసింగ్ ఈ పదవి కోరుకుంటున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు సీఎం అభ్యర్థులను ఓడించిన కాటిపల్లి వెంకటరమణారెడ్డితోపాటు పాయల్ శంకర్, ధన్పాల్ సూర్యనారాయణగుప్తా, పైడి రాకేష్‌రెడ్డిలు కూడా బీజేఎల్పీ నేత పదవిని ఆశిస్తున్నారు. ► గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తే బీసీ నేతను సీఎం చేస్తామని నాయ కత్వం ప్రకటించిందని, కనీసం బీజేఎల్పీ నేతగా బీసీ ఎమ్మెల్యేకు అవకాశం కల్పించాలనే డిమాండ్ కూడా పార్టీలో అంతర్గతంగా వినిపిస్తోంది. ► ఈ నెల 8న బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఆ తర్వాత జరిగే బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశానికి వివిధ రాజకీయపక్షాల తరఫున నేతలు హాజరై ఎన్ని రోజులు సభ నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే నాటికి లేదా బీఏసీ భేటీ జరిగే నాటికి బీజేఎల్పీనేతను ఎన్నుకుంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.అయితే బీఏసీ భేటీకి శాసనసభాపక్షం ఎవరో ఒకరిని నామినేట్ చేసినా సరిపోతుందని, అందువల్ల దానితో బీజేఎల్పీనేత ఎన్నికకు ముడిపెట్టాల్సిన అవసరం లేదని మరికొందరు వాదిస్తున్నారు. -
కిషన్ రెడ్డికి కీలక బాధ్యతలు!
హైదరాబాద్: అసెంబ్లీలో పాయింట్ టు పాయింట్ తీవ్ర స్వరంతో అధికారపక్షాన్ని నిలదేసేందుకు విపక్షంలో కొత్త గొంతుక చేరనుంది. ఆ స్వరం మరెవరిదోకాదు తెలంగాణ బీజేపీ 'మాజీ' అధ్యక్షుడు కిషన్ రెడ్డిది. అంబర్ పేట్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన కిషన్ రెడ్డిని బీజేఎల్పీ నేతగా నియమించేందుకు ఆ పార్టీ అన్నివిధాలా సన్నద్ధమైంది. ప్రస్తుతం ఆ పార్టీ ఎల్పీ నేతగా కొనసాగుతున్న డాక్టర్ కె. లక్ష్మణ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి గా నియమితులుకావటమే ఈ మార్పునకు ప్రధాన కారణం. బీజేపీ సంస్థాగత నియమాల ప్రకారం ఒక వ్యక్తి జోడు పదవులు నిర్వహించడానికి వీలులేదు. లక్ష్మణ ఇప్పుడు పార్టీకి సారథ్యం వహిస్తారు కాబట్టి, అసెంబ్లీలో లెజి స్లేటివ్ పార్టీ నాయకత్వ బాధ్యతలు కిషన్ రెడ్డికి కట్టబెట్టాలని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తున్నది. పైగా ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యేలు అందరిలోకీ కిషన్ రెడ్డే సీనియర్ కావటం మరో సానుకూల అంశం. ఈ మేరకు ఆయన నియామక ఉత్తర్వులు ఒకటిరెండు రోజుల్లో వెలువడతాయని సమాచారం. కిషన్ రెడ్డికి గతంలోనూ బీజేఎల్పీ నేతగా పనిచేసిన అనుభవం ఉంది. పార్టీ కొత్త అధ్యక్షడిగా ఎంపికైన లక్షణ్ హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీని బలీయమైన శక్తిగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తానన్నారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ నేతలు లక్షణ్ కు శుభాకాంక్షలు తెలిపారు. -
‘బోండా’కు బీజేపీ చురక
సాక్షి, హైదరాబాద్: ఇచ్చిన మాటకు కట్టుబడి నిర్ణీత సమయానికే ప్రతిపక్ష నేత ప్రసంగాన్ని ముగించడం మంచి సంప్రదాయమని, దీనిని విమర్శించడం తప్పంటూ టీడీపీ సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావుకు బీజేపీ శాసనసభాపక్షనేత విష్ణుకుమార్‌రాజు చురకంటించారు. విద్యుత్తు చార్జీల పెంపుపై మాట్లాడేందుకు మైకు ఇవ్వాలంటూ ఉదయం నుంచి సభను స్తంభింపజేసిన ప్రతిపక్షనేత ఇప్పుడు మైకు ఇస్తే 25 నిమిషాల్లోపే ముగించారని జగన్‌నుద్దేశించి టీడీపీ సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు. దీనికి స్పందించిన విష్ణుకుమార్‌రాజు.. ‘‘నేనే ప్రతిపక్ష నేతతో సంప్రదింపులు జరిపాను. సభ జరుపుకుందామని, సామరస్యపూర్వకంగా చర్చించుకుందామని విజ్ఞప్తి చేశాను. దీనికి ప్రతిపక్షం, అధికారపక్షం అంగీకరించాయి. చెప్పిన మాటకు కట్టుబడి ఇచ్చిన సమయానికే విపక్షనేత ప్రసంగాన్ని కూడా ముగించారు. ఇది మంచి సంప్రదాయం. దీనిని గుర్తించకుండా ఇలా మాట్లాడటం తగదు. మాట్లాడాలంటే విపక్ష నేత కూడా మూడుగంటలైనా మాట్లాడగలరు. కావాలంటే సభను మధ్యాహ్నం పెట్టండి. రేపు పెట్టండి.. ఎల్లుండి పెట్టండి.. మాట్లాడుకుందాం.. చర్చించుకుందాం..’’ అంటూ బోండానుద్దేశించి ఆయన కాసింత కోపంగా వ్యాఖ్యానించారు. -
తెలంగాణ బీజేఎల్పీ నాయకుడిగా లక్ష్మణ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ శాసనసభ పక్ష నాయకుడిగా సీనియర్ నేత డాక్టర్ కె.లక్ష్మణ్ ఎంపికయ్యారు. సోమవారం తెలంగాణ బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ నేత జేపీ నద్దా పరిశీలకునిగా హాజరయ్యారు. శాసన సభ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ తెలంగాణలో ఐదు సీట్లను గెల్చుకుంది. లక్ష్మణ్‌తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తదితరులు ఎన్నికయ్యారు.