కిషన్ రెడ్డికి కీలక బాధ్యతలు!
హైదరాబాద్: అసెంబ్లీలో పాయింట్ టు పాయింట్ తీవ్ర స్వరంతో అధికారపక్షాన్ని నిలదేసేందుకు విపక్షంలో కొత్త గొంతుక చేరనుంది. ఆ స్వరం మరెవరిదోకాదు తెలంగాణ బీజేపీ 'మాజీ' అధ్యక్షుడు కిషన్ రెడ్డిది. అంబర్ పేట్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన కిషన్ రెడ్డిని బీజేఎల్పీ నేతగా నియమించేందుకు ఆ పార్టీ అన్నివిధాలా సన్నద్ధమైంది. ప్రస్తుతం ఆ పార్టీ ఎల్పీ నేతగా కొనసాగుతున్న డాక్టర్ కె. లక్ష్మణ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి గా నియమితులుకావటమే ఈ మార్పునకు ప్రధాన కారణం.
బీజేపీ సంస్థాగత నియమాల ప్రకారం ఒక వ్యక్తి జోడు పదవులు నిర్వహించడానికి వీలులేదు. లక్ష్మణ ఇప్పుడు పార్టీకి సారథ్యం వహిస్తారు కాబట్టి, అసెంబ్లీలో లెజి స్లేటివ్ పార్టీ నాయకత్వ బాధ్యతలు కిషన్ రెడ్డికి కట్టబెట్టాలని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తున్నది. పైగా ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యేలు అందరిలోకీ కిషన్ రెడ్డే సీనియర్ కావటం మరో సానుకూల అంశం. ఈ మేరకు ఆయన నియామక ఉత్తర్వులు ఒకటిరెండు రోజుల్లో వెలువడతాయని సమాచారం. కిషన్ రెడ్డికి గతంలోనూ బీజేఎల్పీ నేతగా పనిచేసిన అనుభవం ఉంది. పార్టీ కొత్త అధ్యక్షడిగా ఎంపికైన లక్షణ్ హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీని బలీయమైన శక్తిగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తానన్నారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ నేతలు లక్షణ్ కు శుభాకాంక్షలు తెలిపారు.