‘బోండా’కు బీజేపీ చురక
సాక్షి, హైదరాబాద్: ఇచ్చిన మాటకు కట్టుబడి నిర్ణీత సమయానికే ప్రతిపక్ష నేత ప్రసంగాన్ని ముగించడం మంచి సంప్రదాయమని, దీనిని విమర్శించడం తప్పంటూ టీడీపీ సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావుకు బీజేపీ శాసనసభాపక్షనేత విష్ణుకుమార్‌రాజు చురకంటించారు. విద్యుత్తు చార్జీల పెంపుపై మాట్లాడేందుకు మైకు ఇవ్వాలంటూ ఉదయం నుంచి సభను స్తంభింపజేసిన ప్రతిపక్షనేత ఇప్పుడు మైకు ఇస్తే 25 నిమిషాల్లోపే ముగించారని జగన్‌నుద్దేశించి టీడీపీ సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు. దీనికి స్పందించిన విష్ణుకుమార్‌రాజు.. ‘‘నేనే ప్రతిపక్ష నేతతో సంప్రదింపులు జరిపాను. సభ జరుపుకుందామని, సామరస్యపూర్వకంగా చర్చించుకుందామని విజ్ఞప్తి చేశాను. దీనికి ప్రతిపక్షం, అధికారపక్షం అంగీకరించాయి. చెప్పిన మాటకు కట్టుబడి ఇచ్చిన సమయానికే విపక్షనేత ప్రసంగాన్ని కూడా ముగించారు. ఇది మంచి సంప్రదాయం. దీనిని గుర్తించకుండా ఇలా మాట్లాడటం తగదు. మాట్లాడాలంటే విపక్ష నేత కూడా మూడుగంటలైనా మాట్లాడగలరు. కావాలంటే సభను మధ్యాహ్నం పెట్టండి. రేపు పెట్టండి.. ఎల్లుండి పెట్టండి.. మాట్లాడుకుందాం.. చర్చించుకుందాం..’’ అంటూ బోండానుద్దేశించి ఆయన కాసింత కోపంగా వ్యాఖ్యానించారు.