
సాక్షి, అమరావతి: ప్రతిపక్షం లేకుండా చప్పగా సాగుతున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలు ఇష్టపడడంలేదు. సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకూ ఏడురోజులు సభ జరిగితే ఒక్కరోజు కూడా ఆ పార్టీ ఎమ్మెల్యేలు పూర్తిస్థాయిలో హాజరు కాలేదు. అదే పనిగా ప్రభుత్వ భజన చేస్తుండడం, చంద్రబాబు, మంత్రులు రోజూ చెప్పిన విషయాలనే ఊకదంపుడుగా చెబుతుండడంతో ఈ సమావేశాలకు అసలు ప్రాధాన్యత లేకుండాపోయింది. ఆ పార్టీకి అధికారికంగా 103 మంది సభ్యులుండగా వైఎస్సార్‌సీపీ నుంచి ఫిరాయించిన మరో 22 మంది అనధికారికంగా టీడీపీలో ఉన్నారు. మొత్తంగా 125 మంది ఆ పార్టీ తరఫున హాజరు కావాల్సివుండగా ప్రతిరోజూ 70–80 లోపే హాజరు ఉంటోంది. మధ్యలో రెండు, మూడు రోజులైతే కనీసం 40 మంది కూడా లేని పరిస్థితి.
ప్రశ్నోత్తరాల సమయంలో చాలా ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెప్పకుండా నోట్ చేసుకున్నామని, దీనిపై తగు చర్య తీసుకుంటామని చెప్పి కూర్చుంటున్నారు. సంబంధిత మంత్రులు కూడా సభలో ఉండడంలేదు. ఆ కారణంతోనే ఎమ్మెల్యేలు సభకు వచ్చేందుకు ఇష్టపడడంలేదు. సోమవారం జరిగిన జీరో అవర్‌లో సభ్యులు మరీ తక్కువగా ఉండడంతో చంద్రబాబు ఎమ్మెల్యేలను మంత్రులు, ఎమ్మెల్యేలను పిలిచి ప్రతిపక్షం లేకపోయినా సమావేశాలను సీరియస్‌గా తీసుకోవాలని తాను మొదటి నుంచి చెబుతున్నా ఎందుకు పట్టించుకోవడంలేదని అసహనం వ్యక్తం చేశారు. దీంతో మంగళవారం హాజరు శాతం కొంత పెరిగినా చంద్రబాబు సభలో ఉన్నంతవరకే కావడం విశేషం.