మా గురించి ఎమ్మెల్యే అనిత ఎలా చెబుతారు?
అమరావతి: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనిత వ్యాఖ్యలపై రిషితేశ్వరి తండ్రి మురళీకృష్ణ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అసెంబ్లీలో తమ గురించి ఎమ్మెల్యే అనిత ఎందుకు మాట్లాడారో అర్థం కాలేదన్నారు. రిషితేశ్వరి చనిపోయాక తాము సంతృప్తిగా ఉన్నామనడం సమంజసం కాదన్నారు. తన కుమార్తె మరణం తర్వాత ఎమ్మెల్యే అనిత ఏ రోజు తమని కలవలేదని, కనీసం ఫోన్ కూడా చేయలేదని మురళీకృష్ణ తెలిపారు.
కూతురు చనిపోయాక తాము పుట్టెడు బాధలో ఉంటే...తామంతా సంతోషంగా ఉన్నామని టీడీపీ ఎమ్మెల్యే అనిత సభలో చెప్పడం సమంజసం కాదన్నారు. ఆమె సభలో అలా ఎందుకు చెప్పిందో అర్థం కావడం లేదని వాపోయారు. అసెంబ్లీ సమావేశాల్లో తమలాంటి పేదళ్లను లాగొద్దని రిషితేశ్వరి తండ్రి అన్నారు. రిషితేశ్వరి మృతి తరువాత ఏ రోజు తమను అనిత పరామర్శించలేదన్నారు. రిషితేశ్వరి ఆత్మహత్యకు కారణమైనవారికి ఇంకా శిక్ష పడలేదని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి విచారణ చేయాలని కోరినప్పటికీ ఇప్పటివరకూ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయలేదన్నారు.
కాగా మంగళవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మహిళలకు రక్షణ అంశాన్ని ప్రస్తావించారు. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో మహిళలపై చోటుచేసుకున్న దాడులు, ఆ దాడుల్లో నిందితులకు టీడీపీ నేతలు అండగా నిలిచిన వైనాన్ని ప్రస్తావించారు.
ఈ సందర్భంగా ఆమె ఎమ్మార్వో వనజాక్షిపై టీడీపీ విప్ చింతమనేని ప్రభాకర్ చేసిన దాడి, ఆచార్య నాగార్జున వర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న రిషితేశ్వరి, ఆ ఆత్మహత్యకు కారణమైన వర్సిటీ ప్రొఫెసర్ బాబురావుకు టీడీపీ అండ, సీఎం చంద్రబాబు సభకు దళిత సర్పంచ్‌ను హాజరుకానివ్వకుండా అడ్డుకున్న వైనంపై పత్రికల్లో వచ్చిన కథనాలను ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి సభ దృష్టికి తీసుకువచ్చారు.
దీనిపై టీడీపీ వంగలపూడి అనిత మాట్లాడుతూ టీడీపీ పాలనలో మహిళలకు రక్షణ ఉందని సమర్థించుకున్నారు. రిషితేశ్వరి ఘటనలో చంద్రబాబు సర్కారు న్యాయం చేసిందని బాధితురాలి తల్లిదండ్రులే చెప్పారని ఆమె చెప్పుకొచ్చారు. పైపెచ్చు రిషితేశ్వరి తల్లిదండ్రులు తమకు న్యాయం జరిగిందంటూ మంత్రి గంటా శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలుపుతూ మెసేజ్ చేశారంటూ చెప్పడం కొసమెరుపు. అయితే ఆ న్యాయం ఏ విధంగా జరిగిందన్న విషయాన్ని మాత్రం అనిత ప్రస్తావించకపోవడం గమనార్హం. రిషితేశ్వరి చనిపోయిన బాధను వాళ్ల తల్లిదండ్రులే మరిచిపోతుంటే ప్రతిపక్షం పదే పదే గుర్తు చేస్తోందంటూ ఎద్దేవా చేశారు.
అయితే రిషితేశ్వరి ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులు, వాటి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారనే దానిపై ఎమ్మెల్యే అనిత ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఈ తరహా చర్యలకు పాల్పడుతున్న విద్యార్థులకు వత్తాసు పలికిన ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్ బాబురావుపై చర్యలు ఎందుకు తీసుకోలేదన్న విషయాన్ని మాత్రం ఆమె ప్రస్తావించలేదు.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అనిత వ్యాఖ్యలను రిషితేశ్వరి తండ్రి మురళీకృష్ణ అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా నాగార్జున యూనివర్సిటీలో చోటుచేసుకున్న అమానవీయ సంఘటనల ఫలితంగా తీవ్ర అవమాన భారంతో 2014 జూన్ 14న రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.