‘మీరు వెదుకుతున్న హంతకుణ్ని నేనే’
న్యూయార్క్: అమెరికాలో జాత్యహంకారం బుసలు కొడుతూనే ఉంది. మన్ హటన్ లో సోమవారం జరిగిన విద్వేష దాడిలో 66 ఏళ్ల నల్ల జాతీయుడు తిమోతి కాగ్ మాన్ ప్రాణాలు కోల్పోయాడు. జాత్యహంకారంతోనే తిమోతిని హత్య చేసినట్టు శ్వేతజాతీయుడు జేమ్స్ హారిస్ జాక్సన్ అంగీకరించాడు. బుధవారం ఉదయం టైమ్ స్క్వేర్ వద్ద హఠాత్తుగా అతడు ప్రత్యక్ష మయ్యాడు. ‘మీరు వెదుకుతున్న వ్యక్తిని నేనే. తిమోతి మరణానికి నేనే కారణం. తన జేబులో కత్తులు ఉన్నాయ’ని హల్ చల్ చేశాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
మేరీల్యాండ్ లోని బాల్టిమోర్ లో నివసిస్తున్న 28 ఏళ్ల జాక్సన్ హారిస్ నల్లజాతీయుల పట్ల గత పదేళ్లేగా విద్వేషం పెంచుకున్నాడని పోలీసులు తెలిపారు. నల్లజాతీయులను చంపాలన్న ఉద్దేశంతో మార్చి 17న బస్సెక్కి న్యూయార్క్ కు వచ్చాడని వెల్లడించారు. తిమోతిపై వెనుక నుంచి కత్తితో దాడి చేసి పలుమార్లు పొడిచాడని తెలిపారు. తీవ్ర గాయాలపాలైన తిమోతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడని, ఇది కచ్చితంగా జాత్యహంకార దాడి అని పోలీసులు పేర్కొన్నారు. ఘటనా స్థలం నుంచి జాక్సన్ పారిపోయిన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డు కావడంతో పోలీసుల ఎదుట అతడు లొంగిపోవాడు.