blackbuck hunting case
-
జర్నలిస్టుపై సల్మాన్ ఖాన్ ఫైర్..!
ముంబై : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న రేస్- 3 ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్లో భాగంగా సల్మాన్ మీడియాతో మాట్లాడారు. అయితే కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్‌కు ఐదు సంవత్సరాల శిక్ష విధిస్తూ కొన్ని రోజుల క్రితం జోధ్‌పూర్ కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయమై ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్న సల్మాన్‌కు కోపం తెప్పించింది. ‘కృష్ణజింకల కేసులో మీరు దోషిగా తేలిన సమయంలో.. మీ సినిమా నిర్మాతలు, వారి డబ్బు గురించి మీరు బాధపడ్డారా’ అంటూ జర్నలిస్టు ప్రశ్నించాడు. అయితే అతడు ప్రశ్న ముగించేలోగానే సల్మాన్ కౌంటర్ ఇచ్చాడు. ‘నేను జీవితాంతం అక్కడే(జైలు లోపలే) ఉంటాననుకున్నావా’ అంటూ సమాధానమిచ్చాడు. ఊహించని ఈ సమాధానానికి అవాక్కైన జర్నలిస్టు ‘అదేం లేదం’టూ సల్మాన్‌కు బదులిచ్చాడు. ‘థ్యాంక్యూ.. దాని గురించి నేనేం బాధ పడలేదం’టూ సల్మాన్ తిరిగి సమాధానమిచ్చాడు. కాగా కృష్ణ జింకలను వేటాడిన కేసులో ప్రస్తుతం బెయిలుపై విడుదలైన సల్మాన్ సినిమా షూటింగ్లలో పాల్గొంటున్నాడు. రెమో డిసౌజా దర్శకత్వంలో రూపొందుతున్న రేస్ 3 సినిమాలో సల్మాన్‌తో పాటు అనిల్ కపూర్, బాబీ డియోల్, జాక్వలిన్‌లు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా జూన్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
అనూహ్యం.. సల్మాన్ బెయిల్‌పై రంగంలోకి జడ్జి
జోధ్‌పూర్ : సల్మాన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌పై అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కృష్ణ జింకల వేటాడిన కేసులో సల్మాన్‌కు శిక్షలు ఖరారు చేసిన సెషన్స్ జడ్జి రవీంద్ర కుమార్ జోషిని బదిలీ చేస్తూ రాజస్థాన్ హైకోర్టు ఆదేశాలు వెలువరించింది. అయితే తన బదిలీ కంటే ముందుగానే ఆయన బెయిల్ పిటిషన్‌పై విచారణకు ముందుకు వచ్చారు. దీంతో బెయిల్ పిటిషన్‌పై నెలకొన్న అనిశ్చితి వీడిపోయింది. శనివారం ఉదయం హడావిడిగా కోర్టుకు హాజరైన జోషి.. బెయిల్ పిటిషన్‌పై దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు వాదనలు ముగియగా.. సల్మాన్ తరపు న్యాయవాది హస్తిమల్ సరస్వత్ వివరాలను మీడియాకు వివరించారు. బెయిల్ పిటిషన్‌పై వాదనలు పూర్తిగా వినిపించామని.. భోజన విరామ సమయం తర్వాత పిటిషన్‌పై జడ్జి తీర్పు వెలువరిస్తారని హస్తిమల్ మీడియాకు వివరించారు. దీంతో ఇప్పుడు మీడియా ఫోకస్ అంతా సల్మాన్‌కు బెయిల్ లభిస్తుందా? లేదా? అన్న దాని వైపు మళ్లింది . -
సల్మాన్ ఖాన్‌కు మరో షాక్
జోధ్‌పూర్ : బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు మరో షాక్ తగిలింది. ఆయన బెయిల్ పిటిషన్‌పై సంగ్దిగ్ధం నెలకొంది. శనివారం పిటిషన్ విచారణకు రావాల్సి ఉండగా.. రాజస్థాన్ హైకోర్టు అనూహ్య నిర్ణయం తీసుకుంది. జోధ్‌పూర్ జిల్లా మరియు సెషన్స్ జడ్జిని బదిలీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సల్మాన్ బెయిల్ పిటిషన్‌పై వాదనలు వింటున్న సెషన్స్ జడ్జి రవీంద్ర కుమార్ జోషితోపాటు రాష్ట్రవ్యాప్తంగా 87 మంది జడ్జిలను ట్రాన్స్ఫర్ చేస్తూ హైకోర్టు శుక్రవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేసింది. దీంతో సల్మాన్ బెయిల్ పిటిషన్ వాయిదా పడినట్లేనని.. ఆయన మరిన్ని రోజులు జైల్లోనే గడపాల్సి ఉంటుందని న్యాయ నిపుణలు చెబుతున్నారు. నిజానికి సల్మాన్‌కు శిక్ష ప్రకటించిన రోజే (గురువారం) బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే కేసుపై మరోసారి పూర్తి అధ్యయనం చేసిన తర్వాతే ఆయనకు బెయిల్ ఇవ్వాలా? వద్దా? అన్నది నిర్ధారిస్థానని జడ్జి జోషి తెలిపారు. ఈ నేపథ్యంలో శనివారం సల్మాన్‌కు బెయిల్ వస్తుందని అంతా భావించారు. (సల్మాన్‌కు శిక్ష హ్యాపీగా ఉంది : నటి) ప్రస్తుతం జోషి స్థానంలో చంద్ర కుమార్ సొంగారాను జడ్జిగా బదిలీ చేశారు. చంద్ర కుమార్ తీసుకునే నిర్ణయంపైనే సల్మాన్ బెయిల్ ఆధారపడి ఉంటుంది. ఈ విషయమై న్యాయమూర్తిని కలిసి విజ్ఞప్తి చేస్తామని సల్మాన్ తరపు న్యాయవాది చెబుతున్నారు. 1998లో హమ్ సాథ్ సాథ్ హై చిత్ర షూటింగ్ సందర్భంగా రెండు కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్‌పై మొత్తం మూడు కేసులు నమోదు అయ్యాయి. సుమారు 20 ఏళ్ల విచారణ తర్వాత జోధ్‌పూర్ సెషన్స్ కోర్టు సల్మాన్‌కు ఐదేళ్ల శిక్ష ఖరారు చేసిన సంగతి తెలిసిందే. (సల్మాన్ కేసు.. మతం రంగు) -
సల్మాన్ న్యాయవాదికి బెదిరింపులు
సాక్షి, జోధ్‌పూర్ : కృష్ణజింకను వేటాడిన కేసులో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు ఐదేళ్ల శిక్ష విధించిన క్రమంలో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై తీర్పును సెషన్స్ కోర్టు శుక్రవారానికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే బెయిల్ పిటిషన్‌పై విచారణ ప్రారంభమయ్యేందుకు కొద్ది నిమిషాల ముందు సల్మాన్ న్యాయవాది మహేష్ బోరా తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని వెల్లడించారు. ‘ సల్మాన్ ఖాన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ విచారణకు హాజరుకారాదని హెచ్చరిస్తూ నిన్న (గురువారం) తనకు పలు ఎస్ఎంఎస్లు, ఇంటర్నెట్ కాల్స్ వచ్చాయ’ని ఆయన తెలిపారు. ఈ కేసు నుంచి విరమించుకోవాలని తనపై ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు. కాగా, సల్మాన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై తీర్పును సెషన్స్ కోర్టు రిజర్వ్‌లో ఉంచడంతో ఆయన శుక్రవారం వరుసగా రెండో రోజు రాత్రి సెంట్రల్ జైల్లో గడపనున్నారు. బెయిల్ పిటిషన్ విచారణ నేపథ్యంలో సల్మాన్ సోదరిలు అల్విర, అర్పిత, బాడీగార్డ్ షేరా సెషన్స్ కోర్టుకు వచ్చారు. మరోవైపు సల్మాన్ సోదరులు అర్బాజ్ ఖాన్, సోహైల్ ఖాన్ త్వరలోనే జోధ్‌పూర్‌కు రానున్నారు. -
నేను హిందూ-ముస్లింని..!
సల్మాన్ ఖాన్ తన కులం, మతం విషయంలో కోర్టులో చెప్పిన విషయాలు.. పలువురికి విస్మయాన్ని కలిగించాయి. సల్మాన్ ఖాన్‌ను అతడి కులం గురించి అడిగితే.. తాను 'భారతీయుడిని' అని చెప్పాడు. భారతీయత అనేది కులం కాదని గట్టిగా చెప్పగా.. తాను 'హిందూ-ముస్లిం'ని అని జవాబిచ్చాడు. అదెలా కుదురుతుందని అడిగితే, తన తల్లి హిందువని, తండ్రి ముస్లిం అని తెలిపాడు. 1998లో సినిమా షూటింగ్ కోసం రాజస్థాన్ వెళ్లి, అక్కడ కృష్ణజింకను వేటాడిన కేసులో విచారణ కోసం సల్మాన్ ఖాన్ జోధ్‌పూర్ కోర్టుకు వెళ్లాడు. అతడిమీద మోపిన నేరాలను చదివి వినిపించేముందు కోర్టులో అతడి పేరు, కులం, వృత్తి తదితరాలు అడుగుతారు. దాని ప్రకారమే అడిగినప్పుడు సల్మాన్ ఇలాంటి సమాధానాలు ఇచ్చాడట!