‘గురుకులం’లో మృత్యుఘంటికలు
అవి సరస్వతీ నిలయూలు.. బాలబాలికలకు విద్యాబుద్ధులు నేర్పి ఉన్నత స్థానంలో నిలబెట్టాల్సిన గురుకులాలు.. బడుగు, బలహీన వర్గాల చిన్నారులకు ఆశ్రయం కల్పిస్తూ పాఠాలు బోధిస్తున్న వసతి గృహాలు.. ఇంతటి ప్రాముఖ్యమున్న సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. వరుస ఆత్మహత్యలు, బాలికలపై అత్యాచారాలు ఉలికిపాటుకు గురిచేస్తున్నాయి. పెదపాడు మండలం వట్లూరులోని గురుకుల పాఠశాల హాస్టల్లో నెల వ్యవధిలో ఇద్దరు అమ్మాయిలు ఆత్మహత్యలకు పాల్పడటం కలవరపాటుకు గురిచేస్తోంది. వసతి గృహాల్లో కొరవడిన పర్యవేక్షణ విద్యార్థుల తల్లిదండ్రులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అధికారుల అలస్వతమే ఇందుకు కారణమని వామపక్ష నేతలు మండిపడుతున్నారు.
- ఏలూరు (వన్‌టౌన్)
ఏలూరు శివారు జాతీయ రహదారి పక్కన ఉన్న వట్లూరు గురుకుల పాఠశాలలో వరుస ఆత్మహత్యలపై పలు అనుమానాలు రేకెత్తుతున్నారుు. ఇక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. గతనెలలో చింతలపూడికి చెందిన రుక్మిణీబాయి బలవన్మరణానికి పాల్పడగా బుధవారం మరో పసిమొగ్గ రచన ఆత్మహత్య చేసుకుంది. నాలుగు నెలల క్రితం ఇదే హాస్టల్లో ఓ చిన్నారి మరిగే సాంబారులో పడిపోగా గుట్టుచప్పుడు కాకుండా సిబ్బంది ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఏదైనా సంఘటన జరిగిన తర్వాత హడావుడిగా అధికారులు రావడం రెండు రోజులు తూతూమంత్రంగా తనిఖీలు నిర్వహించడం సాధారణమై పోయింది. ప్రస్తుత జేడీ శోభారాణి ఒక్కసారి కూడా ఇక్కడ హాస్టల్‌ను తనిఖీ చేయలేదని పలువురు అంటున్నారు.
పెరుగుతున్న అకృత్యాలు
కొన్నేళ్ల క్రితం ఏలూరు అమీనాపేటలోని బాలికల వసతి గృహంలో ఒక బాలిక బిడ్డకు జన్మనివ్వగా పుట్టిన శిశువును పక్కనే ఉన్న మురుగు కాల్వలో పడేసింది. అదే వసతి గృహంలో రాత్రి కాపలాదారుడిగా ఉండే ఓ వ్యక్తి ఓ ఇంటర్మీడియెట్ విద్యార్థినిని లోబర్చుకుని గర్భిణిని చేశాడు. ఈ సంఘటనలు అప్పట్లో సంచలనం రేకెత్తించారుు. బుట్టాయగూడెం బాలికల వసతి గృహంలో గతేడాది ముగ్గురు బాలికలపై వసతి గృహ సిబ్బంది అత్యాచారానికి పాల్పడి వ్యభిచార వృత్తిలో దింపేం దుకు ప్రయత్నించారు. ఆయూ సంఘటనలపై అధికారులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకున్నా రు. ఇలా సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో అకృత్యాలు, బాలికల ఆత్మహత్యలకు పాల్పడటం వంటి ఘటనలు తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.
అన్ని కోణాల్లో దర్యాప్తు : డీఎస్పీ
రచన ఆత్మహత్యపై దర్యాప్తు అధికారిగా వ్యవహరిస్తున్న ఏలూరు డీఎస్పీ కేజీవీ సరిత మాట్లాడుతూ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో విచారణ సాగుతుందని చెప్పారు. బాలికలు ప్రతి చిన్న విషయానికి కుంగిపోకుండా ఉండేందుకు వారానికి ఓసారి మానసిక వైద్య నిపుణులతో ప్రత్యేక తరగతులు నిర్వహించాలని అభిప్రాయపడ్డారు. ఎవరైనా అకృత్యాలకు పాల్పడితే ప్రతిఘటించి అధికారుల దృష్టికి తీసుకురావాలని బాలికలకు ఆమె సూచించారు. హాస్టల్ ప్రాంగణం చిట్టడవిని తలపించేలా ఉందని, ఊరి చివర ఉండటం శ్రేయస్కరం కాదని అన్నారు. విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని డీఎస్పీ చెప్పారు.