నైజీరియాలో తీవ్రవాదుల దాడి: 35 మంది మృతి
నైజీరియాలోఈశాన్య రాష్ట్రమైన బోర్నోలోని వివిధ ప్రాంతాల్లో తీవ్రవాదులు జరిపిన దాడిలో మొత్తం 35 మంది మరణించారని మిలటరీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ సాగిర్ ముస వెల్లడించారని స్థానిక మీడియా మంగళవారం తెలిపింది. బామా పట్టణంలోని మొబైల్ బేస్ క్యాంప్‌పై ఆదివారం బొకొ హరం సంస్థకు చెందిన తీవ్రవాదులు దాడులకు తెగబడ్డారని పేర్కొంది. దాంతో పోలీసులు వెంటనే ఎదురుదాడికి దిగారు. దీంతో 17 మంది బొకొ హరం తీవ్రవాదులతోపాట ఓ పోలీసు మరణించారని చెప్పారు.
ఆ ఘటనలో ఇద్దరు సైనికులు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. అలాగే మౌలమ్ ఫటొరి ప్రాంతంలో నైజీరియా, చద్ద్ నుంచి వచ్చిన సైనికులతో ఏర్పాటు చేసిన బేస్ క్యాంప్‌పై అదే సంస్థకు చెందిన తీవ్రవాదులు మెరుపుదాడికి దిగారని చెప్పారు. ఆ ఘటనలో ఓ సైనికుడితోపాటు 15 మంది బొకొ హరం తీవ్రవాదులు మరణించారని ముస తెలిపారు.