book released
-
"అపర భగీరథుడు వై.యస్.ఆర్" పుస్తకావిష్కరణ
-
ఘనంగా ‘స్త్రీ హృదయం’ పుస్తకావిష్కరణ
ప్రముఖ కవి, రచయిత, నటులు, సంగీతకారులు పెయ్యేటి రంగారావు కథల సంపుటి ‘స్త్రీ హృదయం’ను సామవేదం షణ్ముఖ శర్మ ఆవిష్కరించారు. ఆన్లైన్లో జూమ్ వేదికగా జూలై 16న ఆస్ట్రేలియా, అమెరికా, భారతదేశం నుంచి ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లక్ష్మీ నరేంద్ర ప్రార్థనా గీతంతో శుభారంభం చేయగా, విజయ గొల్లపూడి ఆస్ట్రేలియా, అమెరికా, హాంకాంగ్, న్యూజిలాండ్, భారతదేశం నుండి ప్రముఖులకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి సిడ్నీ నుంచి పోతుకూచి మూర్తి అధ్యక్షత వహించారు. ప్రారంభ ఉపన్యాసంలో వంశీ రామరాజు మాట్లాడుతూ..‘స్త్రీ హృదయ’ పెట్టడంలో ఇందులోని కథలకున్న ప్రాముఖ్యత తెలుస్తోందన్నారు. ‘పిల్లికి చెలగాటం కథ చదివానని, కథలో భావవ్యక్తీకరణ బాగుందన్నారు. ఇక్కడ స్థానికంగా తెలుగువారిని ప్రోత్సాహిస్తూ ఉంటానని, భావితరాలకి మన భాష, సంస్కృతి అందటం ముఖ్యమ’ని బ్లాక్ టౌన్ కౌన్సిలర్ లివింగ్ స్టన్ చెట్టిపల్లి అన్నారు. ప్రముఖ రచయిత్రి అత్తలూరి విజయలక్ష్మి మాట్లాడుతూ.. రచయిత స్త్రీ హృదయాన్ని లేత అరిటాకులో పెట్టి అందించారు. అంత సున్నితమైనది స్త్రీ హృదయం అన్నారు. రచయిత పెయ్యేటి రంగారావును ‘నవరస కథా సార్వభౌముడు’గా సినీగీత రచయిత భువనచంద్ర కొనియాడారు. సిడ్నీ తెలుగు అసోసియేషన్ అధ్యక్షురాలు శోభ వెన్నెలకంటి కథా రచయితకు శుభాకాంక్షలు తెలియచేసారు. సామవేదం షణ్ముఖశర్మ ఆశీస్సులతో నూతన పతాక వేదిక ‘సకల కళాదర్శిని, సిడ్నీ ఆస్ట్రేలియా’ లోగోను ఈ సందర్భంగా విడుదల చేసారు. ఈ వేదిక నెలకొల్పటంలో ముఖ్యోద్దేశ్యం సకల కళలకు ఈ వేదిక నిలయంగా కళాకారులని ప్రోత్సహించడమని విజయ గొల్లపూడి అన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సందేశాన్ని శ్రీదేవి సోమంచి చదివి వినిపించారు. తెలుగు తియ్యదనంతో పాటు జీవిత సత్యాలను ‘స్త్రీ హృదయం’ పుస్తకంలో ఆవిష్కరించారని సామవేదం షణ్ముఖ శర్మ పేర్కొన్నారు. ఇంకా నూతనంగా వెలసిన ‘సకల కళాదర్శిన’ ద్వారా ఎన్నో మంచి పనులు జరగాలని ఆకాంక్షించారు. కాలిఫోర్నియా నుంచి డా. రవి జంధ్యాల, సినీ రచయిత దివాకర బాబు, హాస్య రచయిత వంగూరి చిట్టెన్ రాజు, ప్రముఖ సాహితీవేత్త సుధామ, నవలా రచయిత్రి గంటి భానుమతి, రచయిత్రి తమిరిశ జానకి, సిడ్నీ నుంచి విజయ చావలి, న్యూజిలాండ్ నుంచి శ్రీలత మగతల, సోమంచి సుబ్భలక్ష్మి, శాక్రిమెంటో నుంచి తెలుగు వెలుగు మాసపత్రిక ప్రధాన సంపాదకులు వెంకట్ నాగం తదితరులు ఈ పుస్తకావిష్కరణలో పాలుపంచుకున్నారు. -
ఆ పదవి దక్కనందుకు ప్రణబ్ చింతించే ఉంటారు!
న్యూఢిల్లీ: ప్రధాని అయ్యేందుకు తనకన్నా, నాటి తన మంత్రివర్గ సహచరుడు ప్రణబ్ ముఖర్జీకే ఎక్కువ అర్హతలు ఉన్నాయని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు. 2004లో తాను ప్రధాని పదవి చేపట్టిన నాటి ఘటనలను గుర్తుచేసుకుంటూ మన్మోహన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘2004లో ప్రధానిగా సోనియాజీ నన్ను ఎంపిక చేసుకున్నప్పుడు.. ప్రణబ్ ముఖర్జీ కచ్చితంగా బాధపడే ఉంటారు. అలా బాధపడటం తప్పేంకాదు.. ఎందుకంటే నా కన్నా ప్రధాని పదవి చేపట్టేందుకు ఆయనకే ఎక్కువ అర్హత ఉంది.. అయితే, నేను ప్రధాని కావడంలో నా ప్రమేయమేమీ లేదని తనకూ తెలుసు’ అని మన్మోహన్ సింగ్ నవ్వుతూ పేర్కొన్నారు. రాష్ట్రపతిగానే కాకుండా, కేంద్రంలో పలు కీలక పదవులు సమర్ధవంతంగా నిర్వహించిన ప్రణబ్ ముఖర్జీ రాసిన ‘కొలిషన్ ఈయర్స్(సంకీర్ణ సంవత్సరాలు)’ పుస్తకావిష్కరణ సభలో మన్మోహన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. సహా ఆహూతులందరినీ ఒక్కసారిగా నవ్వుల్తో ముంచెత్తాయి. ప్రధానిగా తానున్న సమయంలో అత్యంత సమర్ధ సహచరుడు ప్రణబ్ ముఖర్జీనేనని ఈ సందర్భంగా మన్మోహన్ ప్రశంసించారు. తమ మధ్య నెలకొన్న సత్సంబంధాలతోనే ప్రభుత్వాన్ని సజావుగా నడిపామని పేర్కొన్నారు. ప్రణబ్ అత్యంత గౌరవనీయమైన పార్లమెంటేరియన్, కాంగ్రెస్ నాయకుడని వర్ణించిన మన్మోహన్...ఆయన సేవలు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయని అన్నారు. పార్టీలో, ప్రభుత్వంలో ఎప్పుడు సమస్యలు తలెత్తినా ప్రణబ్ వైపే చూసేవాళ్లమని గుర్తుచేశారు. ప్రణబ్ ఉద్దేశపూర్వకంగానే రాజకీయాల్లోకి రాగా, తాను మాత్రం మాజీ ప్రధాని పీవీ నరసింహరావు కోరగా అనుకోకుండా రాజకీయ నాయకుడినయ్యాయని అన్నారు. నేనే ప్రధాని అనుకున్నారు: ప్రణబ్ 2004 ఎన్నికల తరువాత ప్రధాని పదవిని చేపట్టడానికి సోనియా నిరాకరించడంతో తానే తదుపరి ప్రధాని అని అందరూ అనుకున్నారని ప్రణబ్ ఆ పుస్తకంలో రాశారు. ప్రధాని పదవి చేపట్టేందుకు సోనియా నిరాకరించాక అప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో.. పార్టీలో, పాలనలో అనుభవం ఉన్న రాజకీయ నేతనే ప్రధాని కావాలని కాంగ్రెస్‌లో ఏకాభిప్రాయం ఏర్పడిందని వెల్లడించారు. దాంతో, ఆ అర్హతలన్నీ ఉన్న తానే తదుపరి ప్రధాని అని అంతా అనుకున్నారన్నారు. మన్మోహన్ ప్రభుత్వంలో చేరడానికి తాను అయిష్టత వ్యక్తం చేస్తే సోనియా బలవంతం చేశారని ప్రణబ్ గుర్తు చేసుకున్నారు. అనేక అభిప్రాయాలకు వేదిక అయిన కాంగ్రెస్ పార్టీయే ఓ సంకీర్ణమని.. అందువల్ల పార్టీలో ఒక సంకీర్ణం, ప్రభుత్వంలో మరొకటి ఉండటం అసాధ్యమవుతుందని భావించామని.. కానీ యూపీఏ హయాంలో అది సాధ్యమైందని ప్రణబ్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. -
‘విప్లవ సూర్యుడు’ను ఆవిష్కరించిన అవినాష్ రెడ్డి
యలహంక : ప్రవాసాంధ్రుడు తక్కెడశీల జానీ తాను రాసిన ‘విప్లవ సూర్యుడు’ రెండో కవితల పుస్తకాన్ని కడప వైఎస్ఆర్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఆవిష్కరించారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల పట్టణంలోని వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో జానీ తన కుటుంబ సభ్యులతో కలిసి అవినాష్ రెడ్డిని కలిశారు. కవితల పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించి రచయిత జానీని అభినందించారు. పులివెందుల పట్టణానికి చెందిన జానీ బెంగళూరులోని కోరమంగళలో ప్రతి లిపి వెబ్సైట్లో తెలుగు విభాగం మేనేజర్‌గా పనిచేస్తున్నారు. తెలుగు కవితలపై చిన్నప్పటినుంచి మక్కువ పెంచుకుని ఎన్నో కవితలు రాశారు. కార్యక్రమంలో జానీ తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు. -
దర్శకుణ్ణి నమ్మిన ఏ హీరో చెడిపోలేదు
‘‘అదృష్టానికి అందరి అడ్రస్సులూ తెలుసు. ఎప్పుడు ఎవర్ని వరించాలో దానికి బాగా తెలుసు. దానికోసం ఎదురు చూడాల్సిన పనిలేదు. అందుకు నా జీవితమే ఓ ఉదాహరణ’’ అన్నారు దాసరి నారాయణరావు. ఆయన దర్శకత్వం వహించిన 150 సినిమాల సినీ ప్రస్థానంపై సీనియర్ పాత్రికేయుడు వినాయకరావు రచించిన ‘విశ్వవిజేత విజయగాథ’ పుస్తకావిష్కరణ శనివారం హైదరాబాద్‌లో జరిగింది. సూపర్‌స్టార్ కృష్ణ పుస్తకాన్ని ఆవిష్కరించి, తొలి ప్రతిని ప్రతాప్ ఆర్ట్స్ కె.రాఘవకు అందించారు. 3 లక్షల వెయ్యి నూటపదహార్లకు దాసరి కిరణ్‌కుమార్ వేలం పాటలో ఈ పుస్తకాన్ని సొంతం చేసుకున్నారు. అనంతరం దాసరి మాట్లాడుతూ-‘‘నా జీవితాన్ని తలచుకుంటే ఓ కలలా అనిపిస్తుంది. నాటకాలు వేసుకునే నేను మద్రాసు వెళ్లి ఆర్టిస్టుగా ప్రయత్నాలు చేసి వెనక్కి రావడం ఏంటి? కాలగమనంలో 150 సినిమాలకు రచన, దర్శకత్వం వహించడమేంటి?. ఈ రోజు నా పేరిట ఓ పుస్తకం వచ్చేస్థాయికి నేను చేరుకున్నానంటే... దానికి కారణం ప్రతాప్ ఆర్ట్స్ రాఘవగారు. ఆయన నన్ను నమ్మి అవకాశం ఇవ్వబట్టే ఈ రోజు ఇంత సాధించగలిగాను. దాదాపు అన్ని తరాల నటులతో, సాంకేతిక నిపుణులతో కలిసి పనిచేసే అదృష్టం నాకు దక్కింది. నేటి తరంవారికి నేను చెప్పేదొక్కటే. తనపై తొలిక్లాప్ కొట్టేవరకూ ఎన్టీఆర్ ‘బొబ్బిలిపులి’ కథ వినలేదు. దర్శకుణ్ణి అప్పట్లో అంతగా నమ్మేవారు. దర్శకుణ్ణి నమ్మిన ఏ హీరో చెడిపోలేదు. నేనే హీరో అనుకున్న ప్రతి హీరో నాశనమయ్యాడు. అది గుర్తుంచుకోండి. సినిమాకు ఎన్ని వసూళ్లు వచ్చాయన్నది ముఖ్యం కాదు. ఎన్నాళ్లు జనహృదయాల్లో సినిమా నిలిచిందనేది ముఖ్యం. ఇక ఈ పుస్తకం విషయానికొస్తే... ఇది నా జీవిత చరిత్ర కాదు. నా 150 సినిమాల వెనకున్న చరిత్ర ఇది. నా గురించి పుస్తకం రాస్తానని చాలామంది అడిగారు. కానీ వినాయకరావుపై నమ్మకంతో అతనికి ఈ బాధ్యత అప్పగించా. త్వరలో నా జీవిత చరిత్ర నేనే రాసుకోబోతున్నా’’ అని చెప్పారు. ‘‘ఈ పుస్తకం కోసం రెండేళ్లు శ్రమించాను. వందేళ్ల సినిమా చరిత్రలో దాసరి ఒక శకం’’ అని వినాయకరావు చెప్పారు. ఇంకా డి.రామానాయుడు, టి.సుబ్బిరామిరెడ్డి, కృష్ణంరాజు, మోహన్‌బాబు, పి.సి.రెడ్డి, కోడి రామకృష్ణ, రమేష్ ప్రసాద్, కోదండరామిరెడ్డి, జయసుధ, గీతాంజలి, సి.కల్యాణ్ తదితర సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో మాట్లాడారు.