boppana
-
పేస్ జంటకు నిరాశ
పుణే: భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ కొత్త ఏడాదిని ఓటమితో ప్రారంభించాడు. స్వదేశంలో జరిగే ఏకైక ఏటీపీ-250 టోర్నమెంట్ టాటా ఓపెన్‌లో తన భాగస్వామి పురవ్ రాజాతో కలిసి బరిలోకి దిగిన పేస్‌కు తొలి రౌండ్లోనే ఓటమి ఎదురైంది. భారత్‌కే చెందిన రోహన్ బోపన్న-జీవన్ నెదున్‌చెజియాన్ జంట 6-3, 6-2తో పేస్-పురవ్ జోడీని అలవోకగా ఓడించింది. 57 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న ద్వయం నాలుగు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి జంట సర్వీస్‌ను నాలుగు సార్లు బ్రేక్ చేసింది. ఈ గెలుపుతో బోపన్న జంట క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాళ్లకు మిశ్రమ ఫలితాలు లభించాయి. యూకీ బాంబ్రీ రెండో రౌండ్లోకి ప్రవేశించగా... సుమీత్ నాగల్ వెనుదిరిగాడు. తొలి రౌండ్లో యూకీ 6-3, 6-4తో అర్జున్ ఖడేపై గెలుపొందగా... క్వాలిఫయర్ సుమీత్ 3-6, 3-6తో ఇల్యా ఇవష్కా (బెలారస్) చేతిలో ఓడిపోయాడు. -
ఆటను ఆపేశారు
‘ఈ రోజు కోర్టులో గుడ్డు పడేస్తే ఆమ్లెట్ అయ్యేది’ - బోపన్న అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఎట్టకేలకు ఆస్ట్రేలియా ఓపెన్ నిర్వాహకులు మ్యాచ్‌లను ఆపేశారు. గత రెండు రోజుల నుంచి ఆటగాళ్లు చేసిన విజ్ఞప్తులకు తోడు గురువారం మధ్యాహ్నం 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే రాడ్ లేవర్ ఎరెనా, హిసెన్సీ ఎరెనా కోర్టులను రూఫ్‌తో కప్పేసి మ్యాచ్‌లను నిర్వహించగా, బయటి కోర్టుల్లో జరగాల్సిన మ్యాచ్‌లను మాత్రం సాయంత్రం ఐదింటి వరకు సస్పెండ్ చేశారు. దీంతో షెడ్యూల్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. అధిక వేడిమిని భరించలేక గత రెండు రోజుల్లో 10 మంది ఆటగాళ్లు మ్యాచ్‌ల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా లెప్చెంకో (అమెరికా) ఎండను భరించలేక ఐస్ప్యాక్పై పడిపోయింది. దీంతో వైద్య బృందం ఆమె పల్స్, బీపీని చెక్ చేసి చికిత్స చేశారు. ఉదయం 11 గంటలకే ఉష్ణోగ్రత 38 డిగ్రీలకు చేరడంతో ప్లేయర్లు ఐస్ప్యాక్లను ధరించి ఎనర్జీ డ్రింక్స్ అధికంగా సేవించారు. కొసమెరుపు ఏమిటంటే... గురువారం సాయంత్రం చిరుజల్లులు పడటం. శుక్రవారం కూడా ఎండ తీవ్రత ఎక్కువగానే ఉంటుందని వాతావరణ నివేదిక.