అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఎట్టకేలకు ఆస్ట్రేలియా ఓపెన్ నిర్వాహకులు మ్యాచ్‌లను ఆపేశారు.
‘ఈ రోజు కోర్టులో గుడ్డు పడేస్తే
ఆమ్లెట్ అయ్యేది’ - బోపన్న
అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఎట్టకేలకు ఆస్ట్రేలియా ఓపెన్ నిర్వాహకులు మ్యాచ్‌లను ఆపేశారు. గత రెండు రోజుల నుంచి ఆటగాళ్లు చేసిన విజ్ఞప్తులకు తోడు గురువారం మధ్యాహ్నం 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే రాడ్ లేవర్ ఎరెనా, హిసెన్సీ ఎరెనా కోర్టులను రూఫ్‌తో కప్పేసి మ్యాచ్‌లను నిర్వహించగా, బయటి కోర్టుల్లో జరగాల్సిన మ్యాచ్‌లను మాత్రం సాయంత్రం ఐదింటి వరకు సస్పెండ్ చేశారు.
దీంతో షెడ్యూల్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. అధిక వేడిమిని భరించలేక గత రెండు రోజుల్లో 10 మంది ఆటగాళ్లు మ్యాచ్‌ల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా లెప్‌చెంకో (అమెరికా) ఎండను భరించలేక ఐస్‌ప్యాక్‌పై పడిపోయింది. దీంతో వైద్య బృందం ఆమె పల్స్, బీపీని చెక్ చేసి చికిత్స చేశారు. ఉదయం 11 గంటలకే ఉష్ణోగ్రత 38 డిగ్రీలకు చేరడంతో ప్లేయర్లు ఐస్‌ప్యాక్‌లను ధరించి ఎనర్జీ డ్రింక్స్ అధికంగా సేవించారు. కొసమెరుపు ఏమిటంటే... గురువారం సాయంత్రం చిరుజల్లులు పడటం. శుక్రవారం కూడా ఎండ తీవ్రత ఎక్కువగానే ఉంటుందని వాతావరణ నివేదిక.