ఇటలీని గెలిచారు
యూరో సెమీఫైనల్లో జర్మనీ
నరాలు తెగే ఉత్కంఠకు ఇది పరాకాష్ట.. కొదమ సింహాల్లాంటి జట్లు.. అన్నింటా సమ ఉజ్జీలే.. దీనికి తగ్గట్టుగానే మైదానంలో నువ్వా.. నేనా అనే రీతిలో జర్మనీ, ఇటలీల మధ్య జరిగిన యూరో క్వార్టర్ ఫైనల్ ఉర్రూతలూగించింది. నిర్ణీత సమయంలో ఫలితం తేలని ఈ మ్యాచ్ సుదీర్ఘ పెనాల్టీ షూటౌట్‌కి దారి తీసింది. ఓ యుద్ధంలా సాగిన ఈ పోరులో చివరికి జర్మనీ జట్టు తొలిసారిగా ఇటలీ కోటను బద్దలు కొట్టి సెమీస్‌కు చేరింది.
బోర్డియాక్స్: యూరో కప్‌లో ప్రపంచ చాంపియన్ జర్మనీ చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసుకుంది. ఎలాంటి మేజర్ టోర్నమెంట్లో ఎదురైనా తమను చావుదెబ్బ తీస్తున్న ఇటలీపై ప్రతీకారం తీర్చుకుని సెమీస్‌కు చేరుకుంది. శనివారం హోరాహోరీగా జరిగిన క్వార్టర్‌ఫైనల్స్ పెనాల్టీ షూటౌట్‌కు దారి తీయగా 6-5 తేడాతో జర్మనీ నెగ్గింది. దీంతో తొమ్మిదో ప్రయత్నంలో దిగ్విజయంగా తమ ‘ఇటలీ గాయాన్ని’ నయం చేసుకుంది.
120 నిమిషాల్లోనూ రెండు జట్ల నుంచి భీకర పోరు ఎదురుకావడంతో స్కోరు 1-1తో సమమైంది. మీసట్ ఓజిల్ (65వ నిమిషంలో) జర్మనీ నుంచి గోల్ చేయగా లియొనార్డో బోనుక్కి (78) పెనాల్టీ స్పాట్ ద్వారా ఇటలీకి గోల్ అందించాడు. ఇక ఆ తర్వాత హైడ్రామా కొనసాగిన షూటౌట్లో ముందుగా ఐదు ప్రయత్నాల్లో రెండు జట్లు 2-2తో సమంగా నిలిచాయి. ఆ తర్వాత వరుసగా నాలుగు ప్రయత్నాల్లో జర్మనీ సఫలం కాగా ఇటలీ మూడు సార్లు మాత్రమే లక్ష్యాన్ని చేరడంతో పరాజయం పాలైంది. ఓవరాల్‌గా ఇందులో 18 షూటౌట్లు నమోదు కావడం విశేషం.
వ్యూహం మార్చిన జర్మనీ: ఇటలీపై ఎలాగైనా ఈసారి పైచేయి సాధించాలనే కసితో ఉన్న జర్మనీ కోచ్ తమ సంప్రదాయ 4-3-3 కూర్పుతో కాకుండా 3-5-2తో బరిలోకి దించారు. దీంతో మిడ్‌ఫీల్డ్‌లో బంతిని ఎక్కువగా తమ ఆధీనంలోనే ఉంచుకుంది. 20వ నిమిషంలో ఇటలీ డిఫెన్స్‌ను తప్పిస్తూ హమ్మెల్స్ ఇచ్చిన పాస్‌ను పెనాల్టీ ఏరియాలో అందుకున్న గోమెజ్ కాస్త ఎత్తులో గోల్ పోస్టులోకి పంపడంతో కీపర్ అడ్డుకున్నాడు. అలాగే 41, 42వ నిమిషాల్లో గోమెజ్, ముల్లర్ ప్రయత్నాలు తృటిలో తప్పాయి. అయితే 43వ నిమిషంలో ఇటలీ నుంచి స్టురారోకు చక్కటి అవకాశం దక్కినా బంతి కార్నర్ నుంచి వెళ్లిపోయింది.
ద్వితీయార్ధం 65వ నిమిషంలో జర్మనీ బోణీ చేయగలిగింది. హెక్టర్ ఇచ్చిన పాస్‌ను అతి సమీపం నుంచి ఓజిల్ ఎడమ కాలితో గోల్‌గా మలిచాడు. అయితే 78వ నిమిషంలో పెనాల్టీ ఏరియాలో బంతి బోటెంగ్ చేతికి తాకడంతో ఇటలీకి పెనాల్టీ అవకాశం దక్కింది. బోనుక్కి తక్కువ ఎత్తులో బంతిని రైట్ కార్నర్‌లోకి పంపి స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత ఇరు జట్ల నుంచి ఎన్ని దాడులు జరిగినా గోల్ కీపర్లు సమర్థవంతంగా అడ్డుకుని మరో గోల్ కాకుండా చూశారు. అదనపు 30 నిమిషాల సమయంలోనూ గోల్ రాకపోవడంతో మ్యాచ్ షూటౌట్‌కు వెళ్లింది.
డ్రామా.. డ్రామా: పెనాల్టీ షూటౌట్లో అనూహ్యంగా ఇరు జట్ల స్టార్ ఆటగాళ్లు విఫలం కావడం ఆశ్చర్యపరిచింది. తొలి ఐదు ప్రయత్నాల్లో థామస్ ముల్లర్, మీసట్ ఓజిల్.. ఇటలీ నుంచి పెల్లే, బోనుక్కి వరుసగా ఫెయిలయ్యారు. దీంతో ఇరు జట్లు 2-2తో సమానంగా నిలిచాయి. ఆ తర్వాత పుంజుకున్న రెండు జట్లు వరుసగా మూడు ప్రయత్నాల్లో విజయం సాధించాయి. అయితే నాలుగో చాన్స్‌లో ఇటలీ ఆటగాడు డార్మియాన్ ఎడమ వైపు తక్కువ ఎత్తులో పంపిన షాట్‌ను కీపర్ మాన్యువల్ న్యూయర్ సులువుగా అడ్డుకున్నాడు. ఇక జర్మనీ నుంచి హెక్టర్ ఎలాంటి పొరపాటు చేయకుండా గోల్ చేయడంతో జట్టు సంబరాల్లో మునిగింది. చివరి వరకూ పోరాడిన ఇటలీ గోల్‌కీపర్ బుఫాన్ ఆకట్టుకున్నాడు.
అంతర్జాతీయ టోర్నీల్లో ఇటలీపై జర్మనీ నెగ్గడం ఇదే తొలిసారి.
1 యూరో కప్‌లో ఓ మ్యాచ్‌లో 18 పెనాల్టీ షూటౌట్స్ నమోదు కావడం ఇదే తొలిసారి. 1980లో 9-8తో చెకొస్లోవేకియా ఇటలీపై గెలిచింది.