పైపై మెరుగులా... సమూల సంస్కరణలా!
పోలీసు వ్యవస్థను సమూలంగా సంస్కరిస్తామంటున్న కేసీఆర్ ప్రభుత్వం పైపై మెరుగులకు పరిమితం కారాదు. పోలీసు వ్యవస్థలోని మౌలిక రుగ్మతలకు చికిత్స చేయడం అవసరం. అప్పుడే తెలంగాణ పోలీసు నిష్పాక్షికమైన, సమర్థవంతమైన వ్యవస్థగా మారుతుంది.
పోలీసు వ్యవస్థ సమూల సంస్కరణకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నడుంకట్టారు. అంటే నేటి వ్యవస్థ ఎంతో లోపభూయిష్టంగా ఉన్నదని ఆయన అంగీకరించినట్టే. ఆయన గుర్తించిన ఆ లోపాలేమిటి? వాటికి కారణాలూ, ఆయన సూచిస్తున్న పరిష్కారాలేమిటి? అనే సందేహాలు కలగడం సహజం. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు వెల్లడించిన సంస్కరణల్లో ప్రధానమైనది రాష్ట్ర పోలీసు శాఖలోని అన్ని విభాగాలను కలిపి ఒకే వ్యవస్థగా రూపొందించడం. హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడంలో భాగంగా న్యూయార్క్ తరహా పోలీసింగ్, పోలీసు వాహనాల కొనుగోలు, నగరం అంతటా సీసీ టీవీ కెమెరాల నిఘా వంటి నిర్ణయాలను తీసుకున్నారు. పోలీసు యూనిఫారాల్లో మార్పులు, ఆధునిక సాంకేతిక పరికరాలను సమకూర్చుకోవడం వంటి ప్రయత్నాలు కూడా జోరుగా సాగుతున్నాయి. కానీ హంగులతో, రూపం మారటంతోటే వ్యవస్థ స్వభావం మారిపోదు.
తెలంగాణలోనే కాదు ఏ రాష్ట్రంలోనైనా పోలీసు వ్యవస్థకు పట్టిన ప్రధాన వ్యాధి... అధికార పార్టీల అడుగులకు మడుగులొత్తుతూ విధులను నిర్వహించాల్సి రావడం. ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే కొందరు ఉన్నత ప్రభుత్వాధికారులే రాష్ట్ర పోలీసు వ్యవస్థను శాసిస్తున్నారు. డీజీపీ నుండి కానిస్టేబుల్ వరకు పాలక పక్షానికి అనుకూలంగా ఉంటేనే కీలకమైన, మంచి పోస్టింగులు దొరుకుతాయి. ఏ చిన్న తేడా వచ్చినా శంకర గిరి మాన్యాలు పట్టాల్సిందే. అధికారంలో ఉన్నవారి దయ లేకున్నా, వారికి అనుగుణంగా చట్టాలను ఎటుబడితే అటు వంచకపోతే ఎంత సమర్థుడైన అధికారికైనా ‘లూప్ లైనే’ గతి. ఆత్మాభిమానాన్ని చంపుకుని చేతి చ మురు వదుల్చుకుని సంపాదించుకున్న పోస్టింగ్‌ను ఇక వాళ్లు ఎలా ఉపయోగించుకుంటారో ప్రజాప్రతినిధులకు, ఆ పై మంత్రులకు, ముఖ్యమంత్రులకు తెలియనిది కాదు. అలాంటి అధికారులకు చట్టంపై, ప్రజలపై ఎంత గౌరవం ఉంటుందో ఎవరైనా ఉహించగలిగిందే. ‘‘ప్రజాస్వామ్య సౌధపు నాలుగు స్తంభాల్లో ఎక్కువ అధికారం రాజకీయ వ్యవస్థదే. ఏ అధికారి అయినా, ఎంతటి నిజాయితీపరుడైనా రాజకీయ అధికారానికి తలొగ్గాల్సిందే’’ అంటూ ఒక ఉన్నతాధికారి నిస్పృహతో వ్యాఖ్యానించారు. పోలీసు వ్యవస్థను సమూలంగా సంస్కరిస్తామంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి పోలీసు వ్యవస్థపై పెత్తనాన్ని వదులుకొని, చట్టాన్ని నిష్పక్షపాతంగా, నిజాయితీగా అమలుచేసేటంతటి తెగింపు, త్యాగశీలత, నిబద్ధత ఉన్నాయా? ఇక ప్రభుత్వ యంత్రాంగంలోని అన్ని శాఖల్లోకీ పోలీసుల్లోనే బాసిజం ఎక్కువ. ఆర్డర్లీ రూపంలోని బానిసత్వం నేటికీ కొనసాగుతూనే ఉంది.
ఒకప్పుడు బ్రిటిష్ పాలకులు వివిధ రకాల విధుల నిర్వహణకు గానూ పోలీసు శాఖలో పౌర, సాయుధ రిజర్వు పోలీసు విభాగాలను ఏర్పాటు చేశారు. సివిల్ పోలీసుల్లో శాంతిభద్రతల పరిరక్షణ, క్రిమినల్, ట్రాఫిక్ వంటి ఉప విభాగాలున్నాయి. ఆయా శాఖల్లో కానిస్టేబుల్ నుండి ఎస్ఐ వరకు ఆయా విధులకు సంబంధించిన ప్రత్యేక శిక్షణను ఇస్తారు. అలాంటి విభాగాలను ఒక్కటిగా చేయడం వల్ల తలెత్తే సమస్యలను గురించి సమూలమైన అధ్యయనం జరపకుండానే ప్రభుత్వం తొందరపాటును ప్రదర్శిస్తోంది. పోలీసు శాఖలో చేరడమంటే నేటికీ 24 గంటల పనిదినమనే పరిస్థితే కొనసాగుతోంది. అంతంత మాత్రపు జీతభత్యాలు, ఎందుకూ కొరగాని అలవెన్సులు. స్టేషనరీ నుంచి, లాకప్ ఖైదీల భోజన వసతి, అనాథ శవ సంస్కారాల వరకు అన్నిటికీ కలిపి చెల్లించేది రూ.1500. ఇక కింది స్థాయి వారి పిల్లలకు విద్య, వైద్యం, గృహవసతులు లేనే లేవు. ఈ పరిస్థితులను మార్చకుండా సంస్కరణలనడం హాస్యాస్పదం. కాగా, సెప్టెంబర్ నాటికల్లా హైదరాబాద్ అంతటా 4 జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. పోలీసు సిబ్బంది వాడుతున్నది పాతికేళ్ల క్రితం నాటి సాంకేతికత. ఐస్‌ఐలకు సైతం ఆండ్రాయిడ్ ఫోన్లను అందించింది లేదు. ఆధునిక నేరగాళ్లతో తలపడాల్సిన పోలీసుల ఆత్మస్థయిర్యం పెరిగేలా వారికి కనీస సౌకర్యాలు అందించకుండా యూనిఫారాల్లోనో, వాహనాల రంగుల్లోనో మార్పులు చేస్తే సరిపోతుందా? కొత్త రాష్ట్రం తెలంగాణ, దేశంలోనే సరికొత్త పోలీసు వ్యవస్థకు నాంది కావాలంటే పైపై మెరుగులకు పరిమితంగాక నిజంగానే సమూల సంస్కరణకు పూనుకోవాలి. అప్పుడే పోలీసు వ్యవస్థ నిష్పక్షపాతంగా, చట్టాలను అమలు చేసే సమర్థవంతమైన వ్యవస్థగా అభివృద్ధి చెందుతుంది.
బోరెడ్డి అయోధ్య రెడ్డి