ధనలాభం పేరుతో దగా
మహిమగల నాణేలు, మంత్రించిన
రుద్రాక్షల పేరుతో మోసం ముగ్గురు అరెస్టు
విశాఖపట్నం, న్యూస్‌లైన్ : మహిమగల నాణేలు, మంత్రించిన రుద్రాక్షలు ఇంట్లో పెట్టుకుంటే ధనలాభం కలుగుతుందని ఓ వ్యక్తిని నమ్మించి నగదు గుంజిన ముగ్గురు మోసగాళ్లను ఎంవీపీ కాలనీ జోన్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ విద్యాసాగర్ కేసు వివరాలు వెల్లడించారు.
మోసం చేశారిలా..
అనకాపల్లి శారద నగర్‌కు చె ందిన బోర్ల శ్రీనివాసరావు, కశింకోటకు చెందిన ఎల్ఐసీ ఏజెంట్ నిక్కల శంకరరావు, పెదగంట్యాడ వెంకన్నపాలేనికి చెందిన తిరుమల అప్పలరెడ్డి స్నేహితులు. పాత ఐదు పైసల నాణాలు ఏడు, వాటితో పాటు అయిదు రుద్రాక్షలు దగ్గర పెట్టుకున్నారు. వాటిని అమాయకులకు విక్రయించి నగదు చేసుకోవాలని వ్యూహం పన్నారు.
నగరంలోని దుంగ వెంకటరెడ్డిని ఈనెల 27న కలిశారు. తమ వద్ద మిహమగల నాణాలున్నాయి. మం త్రించిన రుద్రాక్షలున్నాయి. వాటిని ఇంట్లో పెట్టుకుంటే ధనలాభం కలుగుతుందని నమ్మబలికారు. వీటి ఖరీదు రూ.3 లక్షలు. ముందుగా రూ.5వేలు అడ్వాన్స్ చెల్లించాలని తె లిపారు. దీంతో ఆశ పడిన వెంకటరెడ్డి రూ.5 వేలు అడ్వాన్స్ ఇచ్చాడు. అప్పలరెడ్డి ఈనెల 29న వెంకటరెడ్డికి ఫోన్ చేసి మిగతా రూ.2.95 లక్షలు ఇవ్వాలని చెప్పాడు.
30వ తేదీన అప్ఫుఘర్ వద్దకు తన స్నేహితులతో కలిసి వస్తాను మిగతా నగదు అక్కడే తీసుకుని నాణేలు, రుద్రాక్షలు ఇస్తానని తెలిపాడు. దీంతో వెంకటరెడ్డికి సందేహం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఎస్ఐ తులసీదాస్, సిబ్బంది ఉదయం అప్పుఘర్ వద్ద మాటు వేశారు. నిందితులు వచ్చి వెంకటరెడ్డికి ఫోన్ చేయగానే పోలీసులు దాడి చేసి వారిని పట్టుకున్నారు. నాణేలు, రుద్రాక్షలు, ఫోన్లు, రూ.5 వేలు నగదు స్వాధీనం చేసుకుని నిందితులు ముగ్గుర్నీ అరెస్ట్ చేశారు.