కవన్ నా కెరీర్‌ను మలుపు తిప్పింది!
నటుడు బోస్‌వెంకట్ పేరు చెబితే ముందుగా గుర్తుకొచ్చేది మెట్టిఒలి సీరియల్. ఆ మెగా సీరియల్లో ఒక ప్రధాన పాత్ర ద్వార బుల్లితెర ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించకున్న బోస్ వెంకట్ ప్రఖ్యాత దర్శకుడు భారతీరాజ్ కంటబడ్డారు. ఆయన దర్శకత్వం వహించిన ఈరనిలం చిత్రం ద్వారా విలన్‌గా వెండితెరకు పరిచయమై మంచి పేరు సంపాదించుకున్నారు. ఆ తరువాత వరుసగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ 60కి పైగా చిత్రాల్లో నటించారు.
వాటిలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో నటించిన శివాజీ, సూర్యతో కలిసి నటించిన సింగం వంటి గుర్తింపు తెచ్చిపెట్టిన పలు చిత్రాలు ఉన్నాయి. పాత్రల్లో ఒదిగిపోవడానికి శాయశక్తులా ప్రయత్నించే బోస్వెంకట్కు కో చిత్రంలోనే దర్శకుడు కేవీ. ఆనంద్ మంచి పాత్రను ఇచ్చి ప్రోత్సహించారు. అదే దర్శకుడు తాజాగా బోస్వెంకట్లోని టాలెంట్‌ను గుర్తించి కవన్ చిత్రంలో పూర్తి స్థాయి ప్రతినాయకుడి పాత్రలో నటించే అవకాశం ఇచ్చి పలువురి ప్రశంసలకు కారణం అయ్యారు.
విజయ్‌సేతుపతి కథానాయకుడిగా సీనియర్ నటుడు టి.రాజేందర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో బోస్‌వెంకట్ ప్రతినాయకుడిగా నటించారు.శుక్రవారం తెరపైకి వచ్చిన ఈ చిత్రంలో తన నటనకు అటు అభిమానుల నుంచి, ఇటు చిత్ర ప్రముఖల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయని సంతోషంతో చెప్పారు నటుడు బోస్‌వెంకట్. తాను పూర్తిస్థాయి విలన్‌గా నటించిన తొలి చిత్రం ఇదేనని తెలిపారు. నిజానికి ఈ పాత్రను నటుడు ప్రకాశ్‌రాజ్ నటించాల్సి ఉందని, ఆయన నటించలేని పరిస్థితుల్లో ఆ అదృష్టం తనను వరించిందని అన్నారు.
ఈ పాత్ర కోసం అరగుండు, పంచెకట్టు లాంటి గెటప్‌లో తనను తాను పూర్తిగా మార్చుకుని దర్శకుడు కేవీ.ఆనంద్ ముందు నిలిచి అవకాశాన్ని పొందానని చెప్పారు.కవన్ చిత్రం తన సినీ జీవితాన్నే మలుపు తిప్పిందన్న ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం కార్తీ హీరోగా నటిస్తున్న ధీరన్ అధికారం ఒండ్రు చిత్రంలో పోలీస్‌గా విభిన్న పాత్రను పోషిస్తున్నానని, చిత్రం అంతా కనిపించే ఈ పాత్ర తనకు మంచి పేరును తెచ్చిపెడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.అదే విధంగా మరో చిత్రంలోనూ వైవిధ్య పాత్రను పోషిస్తున్నట్లు బోస్‌వెంకట్ తెలిపారు.